TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
గుడ్డు నుంచి అప్పుడే బయటకు వచ్చిన బుల్లి కోడిపిల్ల చుట్టూ ఉన్న వాతావరణాన్ని వింతగా చూస్తుంది. ఇంతలో తల్లికోడి అంతకుముందే గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్లలను దగ్గరకు తీసుకుంటూ ఈ బుల్లి కోడిపిల్లను వాటిలో చేర్చింది. తల్లికోడి ఆహారాన్ని వెతకడంలో అటూ ఇటూ తిరుగుతున్నప్పుడు మిగిలిన కోడిపిల్లలు దానిని అనుసరించేవి. ఈ బుల్లి కోడిపిల్ల మాత్రం బాగా వెనుకబడేది. బద్ధకం పనికిరాదని, సోమరితనాన్ని విడిచి పెట్టమని తల్లి ఎన్నిసార్లు చెప్పినా ఈ పిల్ల ప్రవర్తనలో ఏ మార్పు ఉండేది కాదు.
ఒకరోజు దూరంగా ఏదో అలికిడి విని తల్లికోడి తన పిల్లలను వేగంగా తనను అనుసరించమని హెచ్చరిస్తూ తానూ పరుగెత్తింది. కానీ ఈ చిన్నారి కోడిపిల్ల తల్లి మాటలను వినిపించుకోక అక్కడే ఉంది. విసిగి వేసారిన ఆ తల్లి ఆ పిల్లను కఠినంగా తిట్టింది. ఎంతో బాధపడిన ఆ బుల్లిపిల్ల తల్లి ఏమరుపాటుగా ఉన్న సమయంలో సోదర కోడిపిల్లల నుంచి దూరంగా వెళ్ళి, ఒక దగ్గర కూర్చొని వెక్కి వెక్కి ఏడవసాగింది.
అంతలో అటుగా వెళ్తున్న ఓ పిల్లి ఈ కోడిపిల్లను చూసి, "ఏమ్మా! ఎందుకలా ఏడుస్తున్నావు?" అని ఆప్యాయంగా పలకరించింది. జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పింది కోడిపిల్ల. "అది తల్లా! కాదు, బ్రహ్మ రాక్షసి. ఈ బుల్లి బంగారాన్ని తిట్టడానికి దానికి నోరెలా వచ్చింది? మీ అమ్మకు నువ్వంటే ఇష్టం లేదు. మిగతా పిల్లలను ప్రేమగా చూస్తూ నిన్ను పట్టించుకోవడం లేదు. నువ్వేమీ బాధపడకు. నీకు నేనున్నాను. నీకు కావలసిన ఆహారాన్ని నేనే సంపాదించి పెడతాను. నిన్ను కన్నతల్లి కంటే ఎక్కువ ప్రేమతో చూసుకుంటాను. నువ్వు నా దగ్గరే ఉండు." అంది ఆ మార్జాలం. అప్పటి నుండి కోడిపిల్ల పిల్లి పెడుతున్న ఆహారాన్ని తింటూ దాని వెంటే తిరగసాగింది. ఇలా నాలుగైదు రోజులు గడిచాయి.
ఒకరోజు పిల్లి వెంట కోడిపిల్ల తిరగడం ఓ కుందేలు చూసింది. ఆశ్చర్యంగా అనిపించింది. పిల్లి ఆహారాన్ని వెతుకుతుండగా బాగా వెనుకబడిన కోడిపిల్లను సైగతో పిలిచింది కుందేలు. "ఎందుకు పిల్లి వెంట తిరుగుతున్నావు?" అని అడిగింది కుందేలు. జరిగింది చెప్పింది కోడిపిల్ల. "ఓసి పిచ్చిదానా! అమ్మ తిట్టిందని అలిగి శత్రువు పంచన చేరుతావా? అమ్మ తిట్టిందంటే తప్పనిసరిగా అది నీ మంచి కోసమే! నువ్వు అమ్మ వెంట వెళ్ళకుండా సోమరిలా వెనుకబడి ఉంటే శత్రువులు నిన్ను తినేస్తారు. ఆ భయంతోనే అమ్మ నిన్ను తిట్టింది. కానీ నీ మీద ప్రేమ లేక కాదు. ఈ మాయదారి మార్జాలం మాటలు నిమ్మకు. కొన్నాళ్ళు నీకు ఆహారం తినిపించి, నువ్వు పెద్దగా బలిష్టంగా తయారయ్యాక అది నిన్ను తింటుంది. మీ జాతికే శత్రువైన పిల్లి మాటలను మూర్ఖంగా నమ్మకు. తీయగా మాట్లాడే ప్రతి ఒక్కరూ మిత్రులు కాలేరు. మంచి చెడులను గుర్తించే విచక్షణా జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలి. సరే, నా వెంట రా! మీ అమ్మ దగ్గరకు తీసుకెళ్తా!" అని చెప్పి, తల్లికోడి వద్దకు పిల్లకోడిని చేర్చింది కుందేలు. కనిపించని తన చిన్నారి కనిపించేసరికి తల్లికోడి ఆనందంతో పిల్లకోడిని తన అక్కున చేర్చుకుంది. అమ్మ చెప్పినట్లే వింటానని, ఇంకెప్పుడూ అమ్మను విడిచిపెట్టి పోనని కోడిపిల్ల ప్రమాణం చేసింది.
- సరికొండ శ్రీనివాసరాజు