TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
పెద్దచింతచెట్టు... చిన్న చింతచెట్టు
ఒక అడవిలో రెండు చింత చెట్లు ఉండేవి. ఒకటేమో పెద్దది. ఇంకొకటేమో చిన్నది. ఒకరోజు ఆ అడవికి ఒక కాకి వచ్చింది, తన పిల్లలతో బాటు. అవి గూడు కట్టుకొనడానికి ఒక చెట్టు కావాలి. పెద్ద చింత చెట్టును చూసి 'ఇదైతే మనకు బాగుంటుంద'ని అనుకున్నాయవి. అప్పుడు అమ్మ కాకి దాని దగ్గరకు వెళ్ళి, "బావా! బావా! నీకొమ్మ ల మీద మేము ఇల్లు కట్టుకుందుమా?" అని అడిగింది. దానికి ఆ చింతచెట్టు, "ఏయ్! ఏమనుకున్నారు నేనంటే! నీలాంటోళ్ళా నా మీద ఇల్లు కట్టుకునేది! పోతారా, లేదా!?" అని గట్టిగా కసురుకుంది. ఆ అరుపుకి భయపడి అక్కడ్నించి వెళ్ళిపోయాయి అవి.
తరువాత అవి చిన్న చింతచెట్టు దగ్గరకు వెళ్ళి, "బావా! బావా! నీ చిన్ని చిన్ని కొమ్మల్లో మేము ఇల్లుకట్టుకుందుమా?" అని అడిగాయి. చిన్న చింతచెట్టు సంతోషంగా, "దానిదేముంది, వచ్చి నా కొమ్మల్లో మీకు ఇష్టమొచ్చినట్లు ఇల్లు కట్టుకోండి. నాకూ మీ తోడు బాగుంటుంది" అనింది.
కాకులు భలే సంతోషపడ్డాయి. అక్కడక్కడా ఉన్న ఎండు పుల్లల్ని ఏరి తెచ్చి కాకులు చిన్న చింత చెట్టులో ఒక చక్కని ఇల్లు కట్టుకున్నాయి. నిదానంగా కాకులు చాలా అయినాయి. అన్నీ సంతోషంగా బతుకుతున్నాయి. ఇప్పుడు చెట్టు నిండా చాలా కాపురాలయినాయి. కాకుల సందడితో చిన్న చింతచెట్టూ సంతోషంగా ఉంది.
ఒకరోజు చింతాకు కోసమని పక్కూరు నుండి చాలా మంది మనుషులు ఆ అడవికి వచ్చారు. వాళ్ళకి మొదట చిన్న చింతమాను కనబడింది. దాని మీది చింతాకు వాళ్ళకు బాగా నచ్చింది. కానీ దాని మీదున్న కాకుల్ని చూసి, "అయ్యో! దీని చింతాకు మనకొద్దు. దీని మీద ఎన్ని కాకులున్నాయో! అవి మనల్ని పొడుస్తాయి, ఇక్కడ వద్దు," అని ఆ మనుషులు అలా పోతూ ఉంటే వాళ్ళకు పెద్ద చింతచెట్టు కనబడింది. దానిలో కూడా చింతచిగురు చాలా బాగా కాసి ఉంది. కానీ చిన్నచెట్టు మీదలాగా దీని మీద కాకులు లేవు! అంతే! మనుషులంతా దానిమీద పడి, ఆ చెట్టు మీద ఉన్న చింతాకు మొత్తం పీక్కెళ్ళి పోయినారు.
ఆకులన్నీ పోగొట్టుకొని, విరిగిపోయిన కొమ్మలు రెమ్మలతో బాగా ఏడ్చుకున్నాక, పెద్ద చింతచెట్టుకు బుద్ధి వచ్చింది. అప్పటినుండీ అది అందరినీ ఆహ్వానించటం, అందరినీ కలుపుకు పోవటం నేర్చుకున్నది.
Courtesy..
kottapalli.in