TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
అవ్వ-కాకి
ఒక ఊరిలో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వ ఒకనాడు రొట్టె చేస్తోంది. అంతలో ఒక కాకి వచ్చి ఆ రొట్టెను ఎత్తుకెళ్ళి చెట్టు మీద కూర్చుంది. అవ్వ అన్నది "కాకీ కాకీ నా రొట్టె ఇచ్చెయ్, నాకు ఆకలిగా ఉంది" అని. అయినా కాకి రొట్టెను ఇవ్వలేదు. అప్పుడు ఆ అవ్వ చెట్టు దగ్గరకు వెళ్లి, "చెట్టూ, చెట్టూ, కాకి నా రొట్టెను ఎత్తుకుపోయింది, ఇవ్వమంటే ఇవ్వటం లేదు, అందుకని కాకి గూడును తోసేయ్" అన్నది. అప్పుడు ఆ చెట్టు "నేనేమీ తోసెయ్యను, కాకి నాకేమీ చెయ్యలేదు కదా?" అన్నది. అప్పుడా అవ్వ ఇంకేమీ చెయ్యలేక కట్టెలు కొట్టే ఆయప్ప దగ్గరకు పోయింది. "కట్టెలు కొట్టే ఆయప్పా, కట్టెలు కొట్టే ఆయప్పా, కాకి నా రొట్టెను ఎత్తుకుపోయింది, చెట్టు కాకి గూడును తోసేయనంది, నువ్వు చెట్టును కొట్టేయవా?" అని అడిగింది. "ఉహుఁ., నేను కొట్టేయను. చెట్టు నాకేమీ నష్టం చెయ్యలేదు" అన్నాడు కట్టెలుకొట్టే ఆయప్ప. "సరేలే", అని ఆ అవ్వ ఎలుక దగ్గరకు వెళ్లింది.
"ఎలుకా, ఎలుకా, కాకేమో నా రొట్టె ఎత్తుకు పోయింది; చెట్టు గూడు తోసేయనంది; కట్టెలు కొట్టే ఆయప్ప చెట్టును కొట్టేయనన్నాడు, అందుకని నువ్వు పోయి ఆయప్ప గొడ్డలిని కొరికేసెయ్" అని అడిగింది. "నేను కొరకను, కట్టెలాయప్ప నాకేం నష్టం చేయలేదు" అన్నది ఎలుక. అప్పుడా అవ్వ "సరేలే" అని పిల్లి ఉండే తావుకు పోయింది. "పిలీ, పిల్లీ, కాకేమో నా రొట్టె ఎత్తుకుపోయింది; చెట్టేమో గూడును తోసేయనంది; కట్టెలాయప్ప చెట్టును కొట్టేయనన్నాడు; ఎలుక గొడ్డలిని కొరికేయనన్నది, నువ్వు పోయి ఎలుకను తినేసెయ్యి" అన్నది. కానీ పిల్లి ఒప్పుకోలేదు- "నువ్వు చెప్పిందైతే బాగానే ఉంది, కానీ అలాచెయ్యను. ఎలుక నన్నేమీ చెయ్యలేదు" అన్నది పిల్లి. "సరేలే" అని అవ్వ కుక్క దగ్గరకు వెళ్లింది.
"నా ప్రియమైన కుక్కా, నా ప్రియమైన కుక్కా, కాకేమో నా రొట్టె ఎత్తుకుపోయింది; చెట్టేమో గూడును తోసేయనంది; కట్టెలాయప్ప చెట్టును కొట్టేయనన్నాడు; ఎలుక గొడ్డలిని కొరికేయనన్నది; పిల్లి ఎలుకను తినెయ్యనన్నది- నువ్వు పోయి పిల్లిని తినేసెయ్యి" అన్నది. అది "సరే" అని పోయి, పిల్లి వెంట పడింది అప్పుడా పిల్లి వణికిపోతూ "వద్దొద్దు, నన్ను చంపద్దు- నేను పోయి ఎలకను చంపేస్తాను" అని ఎలక వెంట పడింది. అప్పుడా ఎలక "వద్దొద్దు, నన్ను చంపద్దు, నేను గొడ్డలిని కొరికేస్తాను" అని గొడ్డలి మీద కెళ్లింది. అప్పుడా కట్టెలు కొట్టే ఆయప్ప "వద్దొద్దు, నా గొడ్డలిని కొరకద్దు, నేను చెట్టును కొట్టేస్తాను" అని చెట్టు మీదికి వెళ్లాడు. అప్పుడా చెట్టు "వద్దొద్దు, నన్ను నరకద్దు; నేను కాకిగూడును తోసేస్తాను" అని కాకి గూడును తోసేసింది. దాంతో కాకి నోట్లోని రొట్టెముక్క జారి క్రింద పడిపోయింది. అప్పుడా అవ్వ దాన్ని తీసుకొని సంతోషంగా ఇంటికి పోయింది.
Courtesy..
kottapalli.in