TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
చెడపకురా.. చెడేవు!
అనగనగా ధర్మారం ఆనే ఊరిలో రామయ్య-భీమయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. రామయ్యకు భీమయ్య అంటే చాలా ఇష్టం. భీమయ్య మాత్రం రామయ్య దగ్గర ఉన్న డబ్బును మాత్రమే చూసేవాడు. రామయ్య భార్య లక్ష్మికి తెలుసు, భీమయ్య ఎలాంటివాడో. కానీ రామయ్య ఆమె మాటల్ని పట్టించుకునేవాడు కాదు. మిత్రుడిని అమితంగా ప్రేమించేవాడు. అయితే రాను రాను మిత్రుల ఆర్థిక పరిస్థితి దిగజారటం మొదలైంది. దాంతో రామయ్య 'పట్నానికి వలస పోదాం' అనుకున్నాడు. "ఇప్పుడు వెళ్తే తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బులతో ఏదైనా వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు.
తర్వాత తర్వాత అది కూడా వీలవ్వకపోవచ్చు.." అయితే భీమయ్య దానికి ససేమిరా ఒప్పుకోలేదు. "మన పొలాలు ఎటు పోతాయి? కావాలంటే నీ పొలం కూడా నేనే సాగు చేసి పెడతాను!" అన్నాడు. రామయ్య కుటుంబం పట్నానికి వలస పోయింది. భీమయ్య అక్కడే ఉండి రామయ్య పొలాన్ని కౌలుకు చేయటం మొదలు పెట్టాడు. "ఖర్చులు నువ్వు పెట్టు; పొలంలో వచ్చిన లాభాలను సమానంగా పంచుకుందాం" అన్నాడు. పట్నంలో రామయ్య వ్యాపారం బాగానే సాగింది. అక్కడ తనకు వచ్చిన కొద్దిపాటి లాభాలను కూడా రామయ్య తన వంతు పెట్టుబడిగా భీమయ్య చేతికి ఇస్తూ వచ్చాడు. తీరా పంట చేతికి వచ్చే సరికి భీమయ్య మొండి చెయ్యి చూపించాడు: "ఏం చెప్పమంటావు రామయ్యా! వానలే లేవాయె! నీ పొలం అసలు పండనే లేదు!" అన్నాడు.
"అందరి పంటలూ బాగానే పండుతున్నాయి కాని నా పంట పండట్లేదేమి?" అని దిగులు చెందేవాడు రామయ్య. "కొన్ని రోజులు ధర్మారం లోనే ఉండి చూద్దాం" అన్నది లక్ష్మి, భీమయ్య మాటల మీద ఒకింత అనుమానంగా. నిజంగానే వాళ్ళు ఉన్న కొద్ది రోజుల్లో పంట చాలా మెరుగైంది. ఏపుగా పెరిగిన పంటను చూసి "ఈసారి మంచి ఫలితాలు వస్తాయి" అని కొంచెం ఆశపడ్డాడు రామయ్య. తరువాత భీమయ్యకు కొంత ఎక్కువ డబ్బు ఇచ్చి, పంటకు అవసరం అయ్యే పనిముట్లు తెప్పించమని, తను పట్నం చేరుకున్నాడు. అయితే "ఈ సంవత్సరమూ పంట బాగా పండలేదు- నీ పొలానికి ఏదో అరిష్టం పట్టినట్లుంది. సాధనాల వల్ల కూడా ఫలితం రాలేదు" అన్నాడు భీమయ్య, ఒక్క పైసా కూడా ఇవ్వకుండా.
వ్యాపారంలో వచ్చిన లాభాలతో ఈసారి తన పొలంలో బోరుబావులు వేయించాడు రామయ్య. పంట ఎలా ఉన్నదో చూసుకు-నేందుకు ప్రతినెలా ఒకసారి తనూ, లక్ష్మీ ఊరికి రావటం మొదలుపెట్టారు. దాంతో పరిస్థితి కొంత మెరుగయింది. పంట బాగా వచ్చింది. రామయ్య, లక్ష్మి ఇద్దరూ దగ్గర నిలబడి పంటను నూర్పించారు. భీమయ్య "ఈసారి నీ అదృష్టం బాగుంది" అని మాటవరసకు మెచ్చుకున్నాడుగానీ, డబ్బుల దగ్గరికి వచ్చేసరికి- "రేపు ఇస్తాను- ఎల్లుండి ఇస్తాను" అని దాటవేస్తూ వచ్చాడు. "చూసారా, మీ మిత్రుడి బుద్ధి?!" అన్నది లక్ష్మి. ఆమె పోరు పడలేక రామయ్య డబ్బులు ఇమ్మని భీమయ్యను ఒత్తిడి చేయటం కొనసాగించాడు. మరొకవైపున లక్ష్మి భీమయ్య భార్యపై ఒత్తిడి పెంచింది.
చివరికి ఒకరోజున భీమయ్య "నా దగ్గర ఎక్కడున్నై రామయ్యా, డబ్బులు?! మళ్ళీ సంవత్సరం ఇస్తాలే" అనేసాడు. అయితే అదే రోజున లక్ష్మి పోయి అతని భార్యనుండి తమకు రావలసిన మొత్తాన్నంతా వసూలు చేసుకొచ్చింది! అప్పుడు రామయ్యకు అర్థమైంది- భీమయ్య తనను ఎంత మోసం చేస్తున్నాడో! లక్ష్మి చెప్పిన మాటను తను ముందుగానే విని ఉండాల్సిందని బాధపడ్డాడు. అటు తర్వాత భీమయ్యతో సంబంధాలు తగ్గించుకున్నాడు. వేరే పాలేరును ఒకరిని పెట్టుకొని, స్వయంగా తన పంటను తానే పండించుకున్నాడు.
దాంతో అటు వ్యాపారమూ లాభాల్లో కొనసాగింది. ఇటు పొలమూ వృద్ధిలోకి వచ్చింది. రాను రాను రామయ్య మంచి స్థాయికి ఎదిగాడు. మోసం చేస్తూ పోయిన భీమయ్యకు మటుకు పెట్టుబడి కరువౌతూ వచ్చింది. కొద్ది సంవత్సరాల తర్వాత అతని పొలంలో పంటలు అస్సలు బాగా పండలేదు. తనను వదిలేసి సొంతంగా వ్యవసాయం చేసుకుంటున్న రామయ్యను సహాయం అడిగేందుకు ఇప్పుడు అతనికి ముఖం చెల్లలేదు. తప్పు తెలుసుకొని బాధ అయితే పడ్డాడు కానీ, ఇప్పుడిక ఏమి ప్రయోజనం?!
- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో