TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
గురుదేవో మహేశ్వర
ఒక ఊళ్ళో రామయ్య, శివయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. ఇద్దరూ చక్కగా కలిసి మెలసి ఉండేవాళ్ళు. వారిలో రామయ్య కొంత ఉన్నతమైన కుటుంబంనుండి వచ్చాడు. శివయ్యేమో పేద కుటుంబం వాడు. డబ్బులున్న కుటుంబంవాడవటంతో రామయ్య బాగా చదువుకున్నాడు- శివయ్య పై చదువులకు వెళ్ళకనే పనిలోకి దిగాడు. వాళ్ళ ఊరిలో చాలా పేరుగాంచిన శివాలయం ఒకటి ఉండేది. శివరాత్రి సందర్భంగా ఆ గుడిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతుంటై. ఇద్దరు స్నేహితులూ శివాలయానికి వెళ్ళారు. చిన్నప్పుడు వీళ్లకు చదువు చెప్పిన ఉపాధ్యాయులవారే, ఇప్పుడక్కడ ఒక ఆధ్యాత్మిక ప్రవచనం ఇస్తున్నారు.
రామయ్య, శివయ్య ఇద్దరూ అక్కడే కూర్చొని ప్రవచనంమొత్తం విన్నారు. ప్రవచనం ఇద్దరికీ నచ్చింది. ప్రవచనం ముగియగానే అందరితో బాటు లేచి ,గబగబా దైవ దర్శనం చేసుకొని, ప్రక్కనే ప్రాంగణంలో నిలబడ్డాడు రామయ్య. శివయ్యమటుకు ముందుగా వెళ్ళి తమ గురువుగారిని పలకరించి నమస్కరించాడు. అటుపైన వెళ్ళి దేవుడిని దర్శించుకొని తిరిగి వచ్చాడు. "ఒరే, సోమయ్యా! పెద్దయినా నీకు తెలివి రాలేదురా, అందరికంటే ముందు వెళ్ళి దైవదర్శనం ముగించుకుంటే, ఆ తర్వాత ఇక స్వేచ్ఛగా ఏమైనా చేయచ్చు కదా. అట్లా కాక ముందు ఆ ముసలాయన్ని కలిసి, కబుర్లు చెప్పి, సమయం వృధా చేస్తివి; ఆలోగా అందరూ దైవదర్శనానికి పోయారు, నువ్వు క్యూలో వెనక నిలబడాల్సి వచ్చింది కదా! దేవుడికంటే నీకు ఆయనే ఎక్కువైనట్లున్నాడే?!" అన్నాడు రామయ్య, సోమయ్యను మందలిస్తున్నట్లు.
"దానిదేముందిరా, రామయ్యా! ఒకరు ముందైతే ఒకరు వెనకౌతారు. నువ్వు ముందు దేవుడిని దర్శించుకున్నావు. ఆ దేవుడి దగ్గరికి పోయే దారిని చూపించిన గురువును నేను దర్శించుకున్నాను. ఈయనే లేకపోతే నేను ఏమయి ఉందునో! ఆ దేవుడిని చూసేందుకు కూడా రాలేకపోదునేమో మరి!" అన్నాడు సోమయ్య. కబీరుదాసు గురువును గురించి చెప్పిన మాటలు తలపుకు రాగా సిగ్గుతో తలవంచాడు చదువుకున్న రామయ్య.
- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో