Facebook Twitter
కండబలం - బుద్ధిబలం

కండబలం - బుద్ధిబలం

 


శివపురంలో అంజన్న, శివన్న అనే ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు. వాళ్లది విడదీయరాని స్నేహబంధం. అంజి పొడవుగా, బలంగా ఉండేవాడు. ఇక శివకేమో లోకజ్ఞానం ఎక్కువ. "నీకేమిరా, కొండలు పిండి చేసైనా అమ్ముతావు" అనేవాడు శివ. "నీకూ ఏమీ నష్టం లేదు. బలం లేకపోయినా, నీకున్న తెలివితేటలతో ఎక్కడైనా బతికేస్తావు" అనేవాడు అంజి. "ఇద్దరూ కలిస్తే ఇంకెవరూ వీళ్లని ఏమీ చేయలేరబ్బా!" అనుకునేవాళ్ళు ఊళ్ళో వాళ్ళు. శివపురంలో దసరా పండగ బాగా జరుపుకుంటారు. పండగకు అవసరమయ్యే సామాన్లు తెచ్చి అమ్మితే ఈ సమయంలో బాగా లాభాలు వస్తాయి. అందుకని, ఇంకో నాలుగు రోజుల్లో దసరా పండగ రానున్నదనగా, అంజి, శివ ఇద్దరూ చేతికందిన మొత్తాలు పట్టుకొని పొరుగూర్లో జరిగే సంతకు బయలుదేరారు. 


ఆ రోజుల్లో ఇప్పటిలాగా తారు రోడ్లు అవీ లేవు. పొరుగూరు వెళ్ళాలంటే ఊరికే కాదు: అడవి మార్గంలోనుంచి వెళ్ళాలి! దారి దోపిడి దొంగలు, కౄర మృగాల బెడద బాగా ఉంది. అయితే వీళ్ళిద్దరికీ అవి సమస్యలు అనిపించలేదు. కండబలం, బుద్ధిబలం రెండూ ఉన్నవాళ్ళాయె! అట్లా అడవిలోంచి పోతూ ఉంటే వాళ్ల వెనకాల ఏదో అలికిడి అయ్యింది. వాళ్లని ఎవరో అనుసరిస్తున్నారు! "ఎవరై ఉంటారు?" అని ఆలోచించిన శివకి వాళ్ళు దొంగలే అని నిశ్చయంగా అనిపించింది. 'దొంగలు చాలామందే ఉన్నట్లున్నారు. వాళ్లతో పోరాటం చేస్తే కూడా పెద్ద ప్రయోజనం‌ ఉండకపోవచ్చు.. ' శివకి వెంటనే ఒక ఐడియా వచ్చింది. అతను నడుస్తూనే క్రిందికి వంగి, చేతినిండా గులకరాళ్ళని, మట్టిబెడ్డల్నీ తీసుకుని, గబగబా వాటిని తన దగ్గరున్న ఒక గుడ్డలో చుట్టి చటుక్కున జేబులో పెట్టుకున్నాడు. అటుపైన అతను అంజీతో‌ గట్టిగా మాట్లాడటం మొదలెట్టాడు: "ఒరేయ్, అంజీ! మన దగ్గర ఇన్నిన్ని డబ్బులున్నాయి కదరా! 

 


మనల్ని ఎవరైనా దోచుకుపోతే ఎలాగ?!" అని. "మన దగ్గరికి ఎవరూ రారులేరా! ఇంత పెద్ద శరీరాన్ని చూసి భయపడతారులే, వాళ్ళు!" అన్నాడు అంజి, సంగతి అర్థంకాక. "అయినా ఎక్కువమంది వచ్చారనుకో, నిన్నూ నన్నూ కట్టి పడేస్తారు, అప్పుడింక ఏం చేస్తాం? అందుకని ఓ పని చేద్దాం. సంతలో మనకు ఏమన్ని డబ్బులు అవసరం ఉండదు కాబట్టి, ఊరికే ఏ పదో పరకో మన దగ్గర పెట్టుకొని, మిగిలిన సొమ్ములన్నీ ఎప్పటిమాదిరి ఇదిగో, ఈ చెరువులో పడేద్దాం: తెలిసిన చెరువే కనుక, మళ్ళీ మనం వెనక్కి వచ్చేటప్పుడు చెరువులోకి దిగి మన మూటని మనం తీసుకుంటే సరిపోతుంది" అన్నాడు శివ. అంజికి తిక్క పట్టినట్లయింది. శివ ఏమంటున్నాడో అతనికి అర్థమే కాలేదు. "అయినా మిత్రుడు అట్లా అన్నాడంటే ఏదో ఉన్నట్లే కదా" అని తనకు కూడా ఏదో అర్థం అయినట్టే తల ఊపాడు. 


దాంతో శివ ముందుకొచ్చి, మిత్రుడి జేబులోంచే తీసినట్లుగా రాళ్ళ మూటను బయటికి తీసి, దాన్ని నదిలో గిరాటు వేసాడు- "గంగమ్మ తల్లీ! ఎప్పటిమాదిరే డబ్బులు నీ దగ్గర వదిలి వెళ్తున్నాం. మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు తీసుకుంటాం తల్లీ! ఈ మాత్రం సాయం చెయ్యి!" అంటూ. వాళ్ళు అటు వెళ్ళగానే ఇక ఆలస్యం చేయకుండా దొంగలు నలుగురూ చెరువులోకి దూకారు. అంజి, శివ ఇద్దరూ మరే సమస్యా లేకుండా సంతకు చేరుకున్నారు. ఏడు ఊళ్లకి ఒకటే సంత అది- చాలా పెద్ద సంత. తమకు కావలసిన సరుకులన్నీ కొనుక్కున్నారు మిత్రులిద్దరూ. ఇంకా‌ ఒక్క మేకపోతును మాత్రం కొనవలసి ఉన్నది. ఆ సంతలోనే ఒక ప్రక్కగా పశువులు-జంతువుల సంత జరుగుతుంది. మిత్రులిద్దరూ అందులోకి ప్రవేశించారు. అక్కడ ఒక దుకాణంలో వాళ్ళిద్దరికీ నచ్చిన మేకపోతు ఒకటి కనిపించింది. కొమ్ములు మెలిక తిరిగి, మెరిసే బొచ్చుతో నిండుగా ఉన్న ఆ మేకపోతుని చూస్తే అంజికి, శివకి చాలా ముచ్చట వేసింది.

 


"ఇది బలే ఉందిరా! కొంటే ఈ పోతునే కొనాలి!" అంటూనే పోయాడు అంజి, ఆ దుకాణాదారు ముందు. "మాట్లాడకు!" అని శివ ఎన్ని సైగలు చేసినా ప్రయోజనం లేకపోయింది. దాంతో వీళ్లెవరో పల్లెటూరివాళ్ళు- ఎంత ధర చెప్పినా కొనేట్లున్నారని, దుకాణదారు రేటును చెట్టెక్కించాడు: అసలు ధరకు రెట్టింపు రేటు చెప్ప సాగాడు. "అంత రేటు ఎందుకు?" అంటే "ఇది దేవతా మేక" అనసాగాడు! 
"వద్దులేరా! మనకు ఈ మేకపోతు వద్దు. వేరే ఎక్కడైనా మామూలుది కొనుక్కుందాం" అని శివ అంటే "కాదు, ఇదే కావాలి!" అని మొండికేసాడు అంజి! దాంతో శివ అతన్ని బలవంతంగా అక్కడినుండి దూరం తీసుకొచ్చి, "ఒరే! కొందరు దుకాణాలవాళ్ళు నిజాయితీగా ఉంటారు. ఎవరొచ్చినా ఒకే రేటు చెబుతారు. కొందరు ఇతనిలాగా, మనిషికో రేటు చెబుతారు. అదే తెలివనుకుంటారు. అట్లాంటివాళ్లముందు మనం వస్తువులు నచ్చినా నచ్చనట్లే ఉండాలి" అని నచ్చ జెప్పాడు.
 

"అయినా మనం ఆ మేకపోతునే కొనాలి" అని పంతం పట్టాడు అంజి. దాంతో శివ కొంచెం ఆలోచించి, "సరే! నువ్వు ఎక్కువ మాట్లాడకు- నేను ఎట్లా చెబితే అట్లా చెయ్యి" అని కొంచెం అవతలగా ఉన్న దుకాణానికి పోయి ఒక బాతు గుడ్డును కొనుక్కొచ్చాడు. దానికి బంగారు రంగు పూసాడు. రంగు ఆరాక, దాన్ని చేత పట్టుకొని, మేకపోతు దుకాణదారు దగ్గరికి పోయాడు. అతనికి తన చేతిలోని గుడ్డును చూపిస్తూ- "మిత్రమా! నిజంగా మాట్లాడితే నీ మేక మాకు అవసరంలేదు. మాకు బంగారు గుడ్లు పెట్టే బాతొకటి ఉంది. రోజుకో‌ గ్రుడ్డు ఇస్తుందది. అసలైతే ఆ గ్రుడ్డును అమ్ముకునేందుకు వచ్చాం, సంతకి. ఇప్పుడు మేం దీన్ని ఇక అమ్మం. దీన్నే పొదగ పెడతాం. బంగారు బాతు పిల్లలు ఎట్లాగూ పుడతాయి. రోజూ ఓ పదో పన్నెండో బంగారు గుడ్లు వస్తే ఇంకేమి, మేం కోటీశ్వరులం అవుతాం, త్వరలోనే. అందుకని, నీ మేకపోతును ఏదో ఒక రేటుకు ఇచ్చెయ్యి పర్లేదు.." అని ఏదేదో చెప్పసాగాడు.

 

దుకాణదారుకి 'వీడు ఏదో తెలివిని చూపిస్తున్నాడు' అని అర్థమైంది, కానీ కిటుకు ఏంటో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. "ఏదీ- ఆ గ్రుడ్డును ఓసారి చూపించు" అని మాత్రం అన్నాడు. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న శివ, దాన్ని దుకాణదారు చేతిలో పెట్టినట్లే పెట్టి, గ్రుడ్డును క్రిందికి వదిలేసాడు! గ్రుడ్డు పగిలి అందులోని సొన అంతా నేలమీద పడింది. శివ కనుసైగ చేయగానే అంజి ఏడుస్తూ గట్టిగా అరవటం మొదలెట్టాడు: "మా బంగారు బాతు గుడ్డు! నువ్వు పగల గొట్టావు!" అంటూ. జనాలు అంతా చుట్టూ మూగారు. శివ, అంజి తమ నాటకాన్ని రక్తి కట్టిస్తూ, "ఇది మామూలు గుడ్డు కాదు! బంగారు గ్రుడ్డు! దాన్ని ఇతను పగల గొట్టాడు- కాబట్టి దాని మూల్యం చెల్లించాల్సిందే" అని అరవసాగారు. చివరికి, అందరి జోక్యంతోటీ, దుకాణదారు తన మేకపోతును సగం ధరకే వాళ్ల పరం చేసి, నోరు మూసుకొని ఇంటికి పోవలసి వచ్చింది! మిత్రులిద్దరూ విజయగర్వంతో మేకపోతును, సామాన్లను తీసుకొని వెనక్కి బయలు దేరారు.


ఇక అడవిలో దొంగలు చెరువు మొత్తం గాలించి, గాలించి చివరికి ఆ మూటని పట్టుకున్నారు. అయితే దాన్ని తెరిచి చూస్తే అందులో ఒట్టి గులకరాళ్ళున్నాయి. దాంతో వాళ్లంతా మండి పడ్డారు: "ఆ ఇద్దరూ ఎక్కడికీ పోలేరు! ఇటే తిరిగి వస్తారు! అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ము, సామగ్రి మొత్తం మన సొంతం చేసుకుంటాం!" అని ప్రతిజ్ఞలు చేసారు. కులాసాగా మేకపోతుతో పాటు వెనక్కి తిరిగి వస్తున్న శివని, అంజిని వాళ్ళు చూడనైతే చూసారు కానీ, అంజి కండల్ని చూసి వాళ్ల మీదికి దూకేందుకు కొంచెం జంకారు. అప్పుడు వాళ్లలో ఒకడు "అన్నా! వీళ్ళేదో తెలివైనవాళ్ళనుకుంటున్నారు. వీళ్లని తెలివితోటే మోసం చేస్తాం! ఆగండి!" అని తన ఆలోచన చెప్పాడు. అందరూ "సరే సరే" అన్నారు.
 

అట్లా మిగిలిన వాళ్లంతా పొదలమాటునుండి పొంచి చూస్తూండగా ఒక దొంగ మటుకు ముందుకు వచ్చి, శివ వాళ్ళతో పాటు నడుస్తూ "ఎక్కడ దొరికిందయ్యా, మీకు ఈ పంది?!" అని అడిగాడు. శివకు దొంగల పధకం చటుక్కున అర్థమైంది. వెంటనే అతను సమయ స్ఫూర్తితో "ఏంటి, ఈ విడ్డూరం?! ఇది నీకు పందిలా కనపడుతూందా?! నిజానికి వీడు ఒక దొంగ. దారిలో మమ్మల్ని చంపేందుకు ప్రయత్నించాడు. వాడిని చంపటం మాకు ఓ లెక్క కాదు; కానీ ఎట్లాగైనా బంధించి, మచ్చిక చేసుకొని, వాడిచేత ఊడిగం చేయించుకోవాలని మా ఆలోచన. అందుకే ఇదిగో, ఇట్లా మార్చి, వెంట తీసుకెళ్తున్నాం. అయినా మీరు పెంచుకుంటామంటే దానిదేముంది, వీడిని మీకు ఇచ్చేస్తాం!" అన్నాడు. దొంగ బిత్తర పోయాడు. అయినా తేరుకొని, నవ్వు ముఖంతో "బాగుందే! మీరు చూస్తే మంచి వీర యోధుల్లానే ఉన్నారే! దొంగల్ని కూడా మచ్చిక చేసుకుంటారా, మీరు?" అన్నాడు.


"ఓ, నిజానికి జంతువుల్ని మచ్చిక చేసుకోవటం కంటే దొంగల్ని మచ్చిక చేసుకోవటమే చాలా తేలిక. మా గురువుగారు మాకో ఛాలెంజ్ పెట్టారు. ఐదుగురు దొంగల్ని మచ్చిక చేసుకొని తెస్తే తప్ప, మా చదువు ముగిసినట్లు కాదని. ఇదిగో, ఇప్పటికి ఒక దొంగ లెక్క తేలాడు. మరో నలుగురికోసం వెతుకుతున్నాం. ఆ కనబడే పొదల్లో అలికిడి అవుతున్నది చూసావా, అక్కడే ఎవరో దొంగలు నక్కి ఉన్నారని నా అనుమానం. అయితే వాళ్ళు ధైర్యం చేసి మా మీదికి వచ్చే వరకూ మేం ఏమీ చేయటానికి లేదు. అందుకనే ఆలోచిస్తున్నాను" అన్నాడు శివ నవ్వు ముఖం పెట్టి. ఆ పొదల్లోనేగా తమ వాళ్ళున్నది?! దాంతో దొంగవాడికి భయం వేసింది. "మీరు బలే ఉన్నారు. వస్తా" అని చెప్పి సులభంగా తప్పించుకు పోయి, "అబ్బాయిలూ! వీళ్లెవరో మరీ ప్రమాదకరంగా ఉన్నారు. వీళ్లని వదిలేద్దాం- వేరే ఎవర్నైనా పట్టుకోవచ్చు బ్రతికుంటే" అని తమ వారినందరినీ తిరిగి అడవిలోకి తీసుకెళ్ళిపోయాడు. "పద పద- వాళ్ళు మనసు మార్చుకునేలోపల మనిద్దరం ఊరు చేరాలి" అని గబగబా నడిచి, క్షేమంగా శివపురానికి చేరుకున్నారు మిత్రులిద్దరూ. 

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో