పదిచిలకలు

  పదిచిలకలు పది చిలకలు పాడుతుండగా,         పాడలేక ఒకటిపోతె ఇంకా తొమ్మిది తొమ్మిది చిలకలు తూగుచుండగా,         తూగలేక ఒకటిపోతె ఇంకా ఎనిమిది ఎనిమిది చిలకలు ఎగురుతుండగా,         ఎగరలేక ఒకటిపోతె ఇంకా ఏడు ఏదు చిలకలు ఏడ్చుచుండగా,         ఏడ్చలేక ఒకటిపోతె ఇంకా ఆరు ఆరు చిలకలు ఆడుచుండగా,         ఆడలేక ఒకటిపోతె ఇంకా అయిదు ఐదు చిలకలు అరచు చుండగా,         అరచలేక ఒకటిపోతె ఇంకా నాలుగు నాలుగు చిలకలు నవ్వుతుండగా,         నవ్వలేక ఒకటి పోతె ఇంకా మూడు మూడు చిలకలు మూల్గుతుండగా,         మూల్గలేక ఒకటిపోతె ఇంకా రెండు రెండు చిలకలు రేగుచుండగా,         రేగలేక ఒకటిపోతె ఇంకా ఒక్కటి ఒక్క చిలుక వంచుచుండగా,         వంచలేక ఒకటిపోతె ఇంకా సున్నా.! Courtesy.. kottapalli.in

బాధ కూడా బాగానే ఉంటుంది

  బాధ కూడా బాగానే ఉంటుంది     మనం ప్రేమించిన వ్యక్తి మనకి దూరం అయినపుడో/ మోసం చేసినపుడో భరించలేనంత బాధ. పరీక్షల్లో పాస్ అవ్వలేదనో, ఫస్టు ర్యాంకు రాలేదనో బాధ. వెళ్లిన ప్రతిసారి ఉద్యోగం దక్కకపోతే, చచ్చిపోవాలి అనిపించేంత బాధ. నమ్మిన వాళ్లు మోసం చేసినపుడు, అయినవాళ్ళందరూ దూరమైనపుడు, బ్రతకకూడదు అనిపించేంత బాధ. ఎంతో ప్రేమతో పెంచుకున్న మొక్కో, కుక్కో, ఇష్టపడి కొనుక్కున్న వస్తువు పోతేనో, పాడైపోతేనో బాధ. అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో బాధ... నిజమే ప్రతి మనిషి జీవితంలో బాధలుంటాయి చాలా మందిమి బాధ దగ్గరే ఆగిపోతున్నాం. అందుకే వ్యక్తి మీద కక్ష కట్టెస్తున్నాం, జీవితం మీద విరక్తి చెందుతున్నాం, అందుకే చిన్న చిన్న వాటికి అసలీ బ్రతుకే వద్దనుకుంటున్నాం.. కాని ఎర్రటి ఎండాకాలం తర్వాత వర్షాకాలం వచ్చి మనుషుల్ని(మనసుల్ని) స్పృశింప చేసినట్లు శిశిర ఋతువు వచ్చి చెట్ల ఆకుల్ని రాల్చితే, ఆ వెంటనే వచ్చే వసంత ఋతువు అవే చెట్లను మళ్ళి చిగురింపజేసినట్లు... మనిషి జీవితంలో కూడా బాధ తర్వాత ఆనందం ఉంటుంది. కాని ఆ ఆనందాన్ని పొందటానికి బాధల్ని అధిగమించలేకపోతున్నాం. మనలో ఆ బాధని అధిగమించే శక్తి ఉంటే అవును నిజంగా బాధ కూడా హాయిగానే ఉంటుంది -నందు

సంక్రాతి కవిత!!!

సంక్రాతి కవిత!!! సంక్రాంతి క్రాంతి మంచుతెరల చేమంతుల దోబూచులు బంతిపూల పూబంతుల విరబూతలు హేమంతం చేసెనంత సీమంతం పుడమితల్లి కడుపుపంట లోగిళ్ళను చేసెనంట శ్రీమంతం ..సిరివంతం! సిరుల విరులతో అలరారే కాలం ఆబాలగోపాలం ఆలపించు భూపాలం శుభ సంక్రాంతి శోభకిదే సంకేతం! దినకర మకర సంక్రమణా సరంభాని కిదే యిదే స్వాగతం! ముంగిళ్ళ రంగవల్లి వేదికగా అదిగదిగో... హరిలో రంగహరీ...కీర్తనల హరిదాసు నర్తనలు ముద్దులొలుకు గుమ్మల గొబ్బెమ్మల పాటలూ.. ఇవిగివిగో...బొమ్మల కొలువులు...భోగిపళ్ల బోసి నవ్వులు అందాల అనుబంధాలు...ఆనందాలు పెనవేసిన బంధాలు ఇలా తెలిగింటి వెలుగులతో వెలిగెనంట భోగిమంట మకర సంక్రాంతి కిదే యిదే స్వాగతమంటా.. డబడబ బుడబుక్కల సడులు...డోలు...సన్నాయి తోడ డూడూ బసవన్నలాడు సందడులు.. కోడిపుంజుల రంజైన ఎడ్లపందాల గెలుపుల ఈలలు గాలిపటాల అలలు అహహా.. అంబరాలు తాకినవి సంక్రాంతి సంబరాలు సర్వాంగ సుందరమీ ధనుర్మాస సోయగాలు పాడిపంటల వేడిమంటల  భోగి పండుగ పిండివంటల పొంగలి పొంగుల పెద్దపండుగ పశువుల మేనినునుపుల మా కనుమ పండుగ..కలల పండుగ ఆ పర్వదిన మాధుర్యం...అపూర్వ సంప్రదాయ సౌరభం మూడునాళ్ళూ ముచ్చటగా సంక్రాంతి...తెలుగునేల తియ్యదనాల స్రవంతి జాలువారాలి నిరంతరం...తరలిరావాలి తరం తరం తరం తరం... నిరంతరం....నిరంతరం ..తరంతరం. విస్సా నాగమణి

ఆత్మ శోధన

ఆత్మ శోధన     భలే పేరు పెట్టావే, నీకు నువ్వే ఆత్మ శోధనని! నిజాల్నిప్పుల మీద టపటపమని మండే కొన్ని అక్షరాల్ని ఏరదాం..వస్తావా ! మనసుకి ముసుగేసి కళ్లతో వెతకడం కాదు శోధనంటే! ముసుగేసిన కళ్లతో కూడ మనసుని ఆసాంతం తడిమి చూసే గొప్ప యజ్ఞం! గడియారబ్బట్టలేసుకున్న కాలాన్ని చావ చచ్చిన చేతికి కట్టడం కాదు కాలపు విలువంటే! తీసి పారేసిన కాలెండర్లలో సైతం ఒక తేదీని నీకై రాసుకోవడమే! ఆత్మ శోధనంటూ ముసుగేసుకోని వెతికితే దొరికేది చచ్చిపోయి సమాధి కాబడని కొన్ని కారణాలు దోసెడు కంపు కనబడని పొగడ్తలు! పోత పోసుకోని పైకెదగడమే అర్ధం, తప్పు తెల్సుకోని మసలు కోవడమే పరమార్ధం! ఎలానా? సాయంత్రానికి పుట్టబోయే రేపటి పగటిలా!!!! - Raghu Alla

ఏది శాశ్వతం

  ఏది శాశ్వతం     హితులుఎవరు..! సుతులుఎవరు..!! మాయ మాయ.. అంతా మాయ ..!! జగమే మాయ మనిషి బతుకే మాయ..!! ఎవరికెవరు పుత్రుల్..!మిత్రుల్ ..!! నీపాపమెంత ..!పుణ్యమెంత..!! ఎవరికెరుక......!!!!!! ఆటుపోట్లు..!సూటుపోట్లు..!! హృదయపోట్లు..! ఎవరికోసం..!! విమర్శరాని..!ప్రశంసరాని..!! నీప్రశంసతో నాదు:ఖాల్..!! నీవిమర్శతో సుఖాల్..!! తీరవు..!తీరవు..!తీరనే తీరవు..!! వస్తేరా..!పోతేపో ..!! ఎవరురమ్మనారు..!ఎవరుపొమ్మన్నారు..!! నీవురాకపోతే..! కాలమాగునా..!! అంతేకదా .....!!!!! ఆగితే ఆగని..!సాగితే సాగని..!! భయాల్లేవ్..!బంధాల్లేవ్..!! దేహ..జీవాల్..మధ్య మమతల్లేవ్..!! నాకెరుకవ్వావ్.. ఏవీశాశ్వతం..!! రుచులెందుకు..!సుచులెందుకు..!! ఘడియ కూడ నమ్మకం లేని దేహముల్..!! కోపమేల..!శాపమేల..!! కష్టములకు భయమేల..!! సుఖములకు ఆనందమేల..!! కావేవి శాశ్వతం  నాకెరుకలే ఓ నీలకంఠ..!!   కలం:-అఖిలాశ - జాని.తక్కెడశిల..!

నేను మీకు తెలుసా ?

నేను మీకు తెలుసా ?     నేనెవరో తెలియాలంటే  ప్రశాంతంగా సాంతం చదవండి  భాష రాదు నాకు - అందరినీ పలుకరిస్తా  కళ్ళు లేవు నాకు - అందమైన ప్రకృతిని చూస్తా  చెవులు లేవు నాకు - అందరికీ వినిపిస్తా నోరు లేదు నాకు - నా మాటనే తూటాలా పేలుస్తా  కాళ్ళు లేవు నాకు - అందరి దగ్గరకు నే వెళతా  చేతులు లేవు నాకు - అందరిచేతా రాయిస్తా  మాట రాదు నాకు - అన్ని భాషలు నే పలికి(కే)స్తా పాట రాదు నాకు - అందరితో పాడిస్తా  అక్కున చేర్చుకున్న వారిని అందలమెక్కిస్తా  అందరిలో నేనుంటా  అందరిచేతా భావాలొలికిస్తా  ఉరకలువేసే హృదిలో నేనుంటా   మరులుగొలిపే మదిలో నేనుంటా  బావల భావాల్లో నేనుంటా  భామల ఊహల్లో నేనుంటా  ఆకతాయిల ఆలోచనల్లో నేనుంటా   ఆవేశపూరిత అక్షరాల్లో నేనుంటా  ప్రేమికుల హృదయాలలో నేనుంటా  విరాగుల గీతికల్లో నేనుంటా  పండితుల పదాల్లో నేనుంటా  పామరుల గుండెల్లో నేనుంటా  అందరిలో నేనుంటా  అందరినీ స్నేహంగా కలుపుతుంటా  నన్నుచూసి మెరుస్తారు కొందరు  నన్నుచూసి ఏడుస్తారు మరికొందరు  ఇంతకీ నేనెవరో తెలిసిందా ? నేనేనండీ మీ అందమైన ....... "కవిత"ని   - Sweta Vasuki

పువ్వూ-ముల్లూ

పువ్వూ-ముల్లూ   నాలుగ్గోడల మధ్య నుంచి, నలుగురు మనుషుల్లోకి సాయంత్రం అలా నడుచుకుంటూ కాస్త చల్ల గాలి పీలుద్దామని కాసిని పువ్వుల నవ్వుల్ని, కాసిని నవ్వుల పువ్వుల్ని, లేత ఎండ పూయించే కొన్ని బుగ్గల సిగ్గుల్ని ఏరుకుందామని వెళ్తానా.......! అందరూ నన్ను చూసి నవ్వుతారు నింగీ నేలా, పచ్చ గడ్డీ, చల్లగాలీ, తెల్ల మబ్బులూ, అప్పుడే పూసిన గడ్డిపూలూ, ప్రొద్దుటే రాలివాడుతున్న పారిజాతాలు.... మురిపెంగా, ఒక్కొక్కటీ అందుకుంటుంటే ఎదురయ్యింది నిన్నటిదాకా నన్నుచూసి అందంగా నవ్విన అమ్మాయి కానీ ఏదీ ఆ చిరునవ్వు ఇవ్వాళ గుబులు కళ్ళగూళ్ళలో ముడుచుకున్న నవ్వు, ఉబికి వచ్చే అలల సంద్రాలను అదిమిపట్టి రెప్పల తీరం దాటకుండా కట్టడి చేస్తున్న ఆ కళ్ళ ముడతలు, ఇష్ట మైన వారు చేసిన ఖాళీలు మనసున ఎక్కు వైనపుడు కాబోలు దిగులు దిగమింగడానికన్నట్లు దుఖాన్ని గొంతున నొక్కేసినట్లు కింది దవడ వెనక్కి లాగేసి బిగ పట్టిన బుగ్గలు, పెదాలు, ఆమె కళ్ళలోకి చూస్తూకాస్త నవ్వుదామంటే... ఆమె మాత్రం శూన్యంలోకి చూస్తున్నట్లు అసలు నన్నెరుగనట్లు వెళ్ళిపోయింది ఖంగారుగా నా పూల బుట్టలో చెయ్యి పెట్టానా? కసుక్కున గుచ్చుకున్న ముల్లు నా ర క్తం కళ్ళ చూసి నవ్వింది నవ్వులనేగా ........... అందుకే ఈ నవ్వునికూడా పదిలంగా ఏరుకున్నాను. - శారద శివపురపు

కల్లోలిత

కల్లోలిత     అదిగదిగో నిజంకాని కలలకే సిగ్గెక్కువ మరి ఏమిటంత పిచ్చి ప్రేలాపన? కలలూ,నిజమున్నా? కలలన్నీ ఊహలైతే ఆ ఊహంతా మరి నిజమే కదూ నీలవేణి మంచుకొండల్లోంచి జారిపోతున్న నీటిబిందువులేమీ ఏడవటం లేదు మళ్ళీ ఘనీభవించటం నేర్చుకున్నాయి కాబోలు! మరి పాత వాసనేస్తున్న జ్ఞాపకాల డైరీల్లో ఎండిపోయిన నీటిచారలు మాత్రం ఇలా ఎడారులుగానే మిగిలిపోవాలనుకుంటున్నాయేమో.. ఒక్కో సిప్పుకి ఇంకిపోతున్న కాఫీకప్పుల్లో ఆప్టిమిసాన్ని వెతుక్కుంటూ కాయితాల్లో కలల్ని ఒంపుకోవటానికి కవినేమీ కాదోయి.. తుజ్సే కైసే సమ్జాన్..ఇస్ దిల్ కే జజ్బాత్ ! చిమ్మ చీకట్లలోన నిశ్శబ్దానికి సైతం కనబడకుండా ఎన్నెన్నో కావ్యాలు లిఖిస్తూనే ఉన్నాయి మనసు కళ్ళు అదిసరే..దిగులు దండాలను తెంచివేసే తుఫానులనేమీ ఇపుడిక కోరుకోను కానీ ప్యారా నాక్కొద్దిగా నవ్వటం నేర్పవూ! అచ్చూ నీలా..ఆ పువ్వులా రాలిపోతానన్న సంగతే తెలియక ఇంకా విచ్చుకోవాలనుకుంటున్న ఆ పసిమెుగ్గలా! - సరిత భూపతి