ఆత్మ శోధన
posted on Jan 11, 2017
ఆత్మ శోధన
భలే పేరు పెట్టావే,
నీకు నువ్వే
ఆత్మ శోధనని!
నిజాల్నిప్పుల మీద
టపటపమని మండే
కొన్ని అక్షరాల్ని
ఏరదాం..వస్తావా !
మనసుకి ముసుగేసి
కళ్లతో వెతకడం కాదు
శోధనంటే!
ముసుగేసిన కళ్లతో కూడ
మనసుని ఆసాంతం తడిమి
చూసే గొప్ప యజ్ఞం!
గడియారబ్బట్టలేసుకున్న
కాలాన్ని
చావ చచ్చిన చేతికి కట్టడం కాదు
కాలపు విలువంటే!
తీసి పారేసిన
కాలెండర్లలో సైతం
ఒక తేదీని నీకై రాసుకోవడమే!
ఆత్మ శోధనంటూ
ముసుగేసుకోని వెతికితే
దొరికేది
చచ్చిపోయి సమాధి కాబడని
కొన్ని కారణాలు
దోసెడు కంపు కనబడని పొగడ్తలు!
పోత పోసుకోని
పైకెదగడమే అర్ధం,
తప్పు తెల్సుకోని
మసలు కోవడమే పరమార్ధం!
ఎలానా?
సాయంత్రానికి పుట్టబోయే
రేపటి పగటిలా!!!!
- Raghu Alla