ఆ చల్లని సముద్రగర్భం

ఆ చల్లని సముద్రగర్భం   ఈ కవిత శీర్షిక వినగానే, ఈమధ్యకాలంలో ప్రతి వేదిక మీదా వినిపిస్తున్న గేయం గుర్తుకువస్తుంది. మహాకవి దాశరథి కృష్ణమాచార్య కలం నుంచి వెలువడిన కవిత ఇది. 1949లో ప్రచురించిన ‘అగ్నిధార’ కవితాసంపుటిలోది. నిజానికి ఈ కవిత పేరు ‘?’. ఇందులో కనిపించే ప్రశ్నలకి ప్రతిరూపంగా కేవలం ప్రశ్నార్థకాన్నే శీర్షికగా ఎంచుకున్నారు దాశరథి. దాశరథి ఇతర కవితల్లోలాగానే ధనవంతుల గురించీ, రాచరికపు క్రూరత్వం గురించీ, పేదవాడి అసహాయత గురించీ, కులమతాల పట్టింపుల గురించీ ఎండగట్టడం కనిపిస్తుంది. శ్రీశ్రీకవితలకు సాటిరాగల దూకుడు, లయబద్ధత ఈ కవిత సొంతం. అందుకనే రోజులు గడుస్తున్న కొద్దీ... ఈ కవిత గేయంగా మారింది. ప్రతి వేదిక మీదా వినిపించడం మొదలైంది. తెలంగాణ పోరాటం దగ్గర నుంచీ పిల్లల పాటల పోటీల వరకు అన్నిచోట్లా ఈ కవిత గేయమై నినదిస్తోంది. ఈ క్రమంలో గాయకులు దాశరథి మూలకవితలో చిన్నచిన్న మార్పులు కూడా చేస్తున్నారు. అయితే దాశరథి రాసిన అసలు కవిత మాత్రం ఇది…   ఆ చల్లని సముద్రగర్భం దాచిన బడబానలమెంతో? ఆ నల్లని ఆకాశంలో కానరాని భానువు లెందరో? భూగోళం పుట్టుకకోసం కూలిన సురగోళా లెన్నో? ఈ మానవరూపం కోసం జరిగిన పరిణామాలెన్నో? ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠా లెన్నో? శ్రమజీవుల పచ్చి నెత్తురులు త్రాగని ధనవంతు లెందరో? అన్నార్తులు అనాధలుండని ఆ నవయుగ మదెంత దూరమో? కరువంటూ కాటక మంటూ కనుపించని కాలాలెప్పుడో? అణగారిన అగ్ని పర్వతం కని పెంచిన "లావా" యెంతో? ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం యెంతో? పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం యెంతో? గాయపడిన కవిగుండెల్లో వ్రాయబడని కావ్యాలెన్నో? కులమతముల సుడిగుండాలకు బలిగాని పవిత్రులెందరో? భరతావని బలపరాక్రమం చెర వీడే దింకెన్నాళ్లకో?  

సీతాకోకచిలుకలు

సీతాకోకచిలుకలు   కాన్వాసుపైని సీతాకోకచిలుక చిత్రాలు సజీవమై సడి చేస్తూ తిరుగుతాయి ఏదో నిశ్శబ్ద రంగులను, నిర్మల స్పందలనూ నీకే పరిచయం చేస్తున్నట్లు! వాలిపోయిన నీ కళ్లప్పుడు వాటి రెక్కలను చూస్తూ ఎగురుతాయి అనంత యాత్రలా సందడి చేస్తూ, వాటి పయనం నీలోకి చేరినప్పుడు కాలమొక వలయమని నీ మనో నేత్రాలు గుర్తిస్తాయి అంతవరకూ నీకు తెలిసిన పాతదనమిప్పుడు  తొలగిపోయిన పొగమంచులా కొత్త రంగులు పూసుకోని నీలోకి దూకేయబడుతుంది మళ్లా ఆ కాన్వాసుపైకి ఆ సీతాకోకలు యధా స్ధానానికొచ్చి ప్రతిష్ఠించబడతాయి మౌన భావపు కాన్వాసుపై తీపి జ్ఞాపకపు కబుర్లే  ఆ సీతాకోకచిలుకలు నీ చేతికీ, చిగురిస్తున్న ఆ కళ్లకీ నవ్య వర్ణాలవే ఆ నవ్య వర్ణనలివే!!! - Raghu Alla

కరోనాపై కవిత

కరోనాపై కవిత       చైనాయందుబుట్టి సకల దేశములకుబాకె అంతుచిక్కనట్టి వింతజబ్బు  'కరోనా' అనుపేర కరతాళ నృత్యముజేసి  ప్రజల ప్రాణముల్దీయుచుండె పాపిష్టివ్యాధి కనివినియెరుగని కాలనాగులవలె విలయతాండవముజేయుచుండె విస్తృతముగ లక్షలప్రాణాలు తన కుక్షినింపుకొనుచుండె కక్షసాధింపుచర్య ఇది నిశ్చయముగ ప్రపంచాన్నంత గడగడలాడించుచు  మహమ్మారి రక్కసి కోరలు చాపుచుండె విలవిల్లాడుచు విధిలేక ఇంటికే పరిమితమైనజనులు రోజురోజుకు పెరుగుచున్నదేగాని తగ్గదాయె ఇదియేమిచోద్యమో తెలియదాయె అవనియంత వ్యాపించి అతలాకుతలముజేసి  భయభ్రాంతులొందించుచుండె పెనుభూతమయ్యి శాస్త్రఘ్నులకు గూడ నాడి చిక్కనట్టి నావయయ్యె  తల్లులు, పిల్లలతాలూకులేక తల్లడిల్లుచుండ్రి  రాత్రిపగలనుతేడాలేక నీనామస్మరణమే చేయుచుంటిమమ్మ  కాసింతైన దయలేదటమ్మ మానవులపై నీకు ఓ మహమ్మారి! పేదలు రైతులు రోజుకూలీలంత ఎట్లుబ్రతకవలెనంచుచింతజెంద దినమొక ఏడుగ గడుపుచుండిరి బాలలు, వృద్ధులు బయటికెళ్ళలేక మేధావులందరు దీనికి మందేదో తెలియక మథనపడుచుండిరి మనసులోన రాజకీయనాయకులొకరిపైనింకొకరు విమర్శలు గుప్పించుచుండిరుబుసుపోక దేశాధినేతలు దిక్కుదోచని స్థితిలో లాక్డౌను విధించిరి స్వీయ రక్షణ కొరకు కోవిడ్-19 ను ప్రళయకాల రుద్రునివలె ప్రబలనాట్యముజేయుచుండె ప్రపంచమంతా యెంతమంది బలియౌదురో ముందేమియగునో దైవమాయయో లేక దైత్యులమాయయో తెలియదాయె కలిమహాత్యమింతఘోరమైనదా! కలియుగపరిమాణము నాలుగు లక్షలా ముప్పది రెండువేల సంవత్సరాలనిజెప్పియుంటిరె  ఇంతలోనేయింత మార్పు వచ్చినదా? ఏదియేమైనా  రెండువేలా ఇరవయ్యో సంవత్సరంబొక గండుబెబ్బులి  మానవాళికిదియొక మారణహోమం ప్రపంచానికిది యొక ప్రబలారిష్టం! పంచభూతాలను ప్రేమిద్దాం ప్రపంచమనుగడకు మనవంతు సహకారమిద్దాం, ప్రకృతినిలోని సమస్త జీవరాశులతో మమేకమౌదాం ప్రబలనూతనోత్తేజంతో ఇలాంటి మహమ్మారులను జయిద్దాం! విజయీభవ! శుభం భూయాత్! -పి.వి.ఆర్

ఒక్కసారి ఆలోచించు

ఒక్కసారి ఆలోచించు     "ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది కాని చావు ఏ సమస్యకి పరిష్కారం కాదు" ఇది తెలిస్తే నీకు చావాలన్న ఆలోచన రాదు.. నీకే కాదు, ప్రతి మనిషికి సమస్యలుంటాయి చేతనైతే పోరాడు లేదా పరుగెత్తు అంతేగాని ప్రాణాలు మాత్రం తీసుకోకు.. బ్రతికుంటే ఏదైనా సాధించే అవకాశం ఉంటుంది చనిపోతే నీ వాళ్ళకి కన్నీళ్ళు తెప్పించడం తప్ప నువ్వేం సాధించలేవు.. నీ చావుకి కారణం కొన్ని క్షణాలైతే నీ చావు విలువ నీ వాళ్ళ కన్నీళ్ళు నీకు చావాలన్న ఆలోచన వచ్చినప్పుడు  నీ వాళ్ళ కన్నీళ్ళు గుర్తుతెచ్చుకో  నీకు బ్రతకాలన్న ఆశ పుడుతుంది.. అసలు నీ సమస్యే నీ వాళ్ళైతే  వాళ్ళకి దూరంగా నీకు నచ్చినట్టు బ్రతుకు అంతేగాని శాశ్వతంగా దూరమవ్వకు.. చివరగా ఒక్క మాట "నీకేదైనా సమస్య వస్తే చావుని వెతుక్కుంటూ వెళ్ళకు సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్ళు"... - గంగసాని  

వీణా వాణి

వీణా వాణి   నువ్వు సరిగా వినాలేగానీ నిశ్సబ్దంలోనూ ఒక వింత సడి మౌనంలోనూ రవ్వంత తడి నీకై ఎదురేగుతాయి! నిలువెత్తు కొండకోనల్లోనూ నువ్వు ఆర్తిగా అరిచే అరుపుకు ఒక సమాధానం ప్రతిధ్వని గా మార్మోగుతుంది విన్నావా ఎప్పుడైనా! ఒక చిన్న పలకరింపుకు యుగాలనాటి భావాలను పంచుకోడానికి ఎదో మనసు ఆరాటపడుతుంది! మీటి చూస్తే తెలుస్తుంది ఆ మనో వీణ నీకై కురిపించే వేల రాగాలు,గారాలతో! నువ్వు నీతో మాట్లాడుకున్నంత  హాయిగా.. నువ్వు నీలో ప్రవహించినంత గోముగా... నీకు నువ్వే పలకరించుకున్నంత ఖుషీగా...! ప్రతిధ్వనిస్తుంది ప్రతీసారి ఒక వాణి ప్రకటిస్తుంది నీలో దాగున్న వేవేల వినూత్న బాణీ నిజమేనంటావా చెప్పు విరహపు పూబోణి!!!!   - రఘు ఆళ్ల

గుండె కింద కవిత్వ చెలమ

గుండె కింద కవిత్వ చెలమ   కవిత్వం రాయడానికి ప్రత్యేకంగా ఏమైనా వర్క్ షాప్స్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అవును కవిత్వమంటే జీవిత అనుభవాల ఊటలో నుండి మస్తిష్కంలో నుండి ఉబికి భావాల రూపంలో సమాజపు పుడమిపై గంగాజలంలా ప్రవహించడమే కదా..! వ్రుత్తి పరంగా ఎక్సైజ్ శాఖలో ఉన్నత ఉద్యోగం చేస్తూ సమాజాన్ని నిశితంగా పరిశీలించి రాసిన కవిత్వమే “నీటి చెలమ” మకుటంతో మన ముందుకు వచ్చిన ఈ పుస్తకంలోని కవితలు అనుభవాల తోటలో పుష్పాల వలె వికసించాయి.   కవి తీసుకున్న కవితా శీర్షికలన్నీ మన చుట్టూ మన ఇంట్లో జరిగే అంశాలనే సరళమైన భాషలో అందరికి సులభంగా అర్థమయ్యే రీతిలో కవిత్వకరించడం స్వాగతించదగినది.  నిజానికి కవిత్వమంటే అసజమైన పోలికతో పోల్చడం వల్ల సాధారణమైన రీడర్ కి చేరువ కాదు. ఇంకా పుస్తకంలోని మొదటి కవిత “నాన్న కొడుకులు” పిల్లవాడికి తండ్రి బంతి కొనిపిస్తే ఆ పిల్లవాడి అనుభూతిని చెప్తూ తను కూడా ఒక్కప్పటి కొడుకెనని గుర్తుచేసుకుంటూ రాసిన కవిత మన బాల్యాన్ని గుర్తు చేస్తుంది. వర్షాలు లేకా భూమి ఏ విధంగా ? నేర్రలు బారి ఉన్నదో చెప్తూ..., ఓ మేఘమా ఆకాశంలో నీ ప్రయాణాన్ని ఆపేసి ఒక్కసారి పుడమిని ముద్దాడి వెళ్ళు అని మేఘాన్ని అర్దించిన తీరు మనసును కలచివేస్తుంది. నీటిచెలమ కవితలో పాత నీటిని తోడేసినట్టు సమాజంలో కుళ్ళు కుతంత్రాలని తుడిచిపెడతానని కవి వాగ్ధానం చేయడమే కాదు ఆ దిశగా తన పయనం వైపు కూడా సాగిస్తున్నారు. అది తను ఎంచుకున్న వృత్తిలో మనకు తెలిసిపోతుంది. అసలు ఈ తీవ్రవాదం, ఉగ్రవాదం ఎలా వచ్చాయి ? ఆకలి, అసమానత్వం, కుల వివక్ష వీటి నుండి కదా! అసలు అవే లేకుండా చేయాలి అని కాస్త ఘాటుగానే విప్లవమై గర్జించిన కవి మనషులను మేల్కొల్పడానికి నవజీవన వేదంలా సాగారు. సూర్యుడు ఉదయించగానే ఉదయిస్తావు ఆకలి కొరకో , బిడ్డలా కోసమో వ్యభిచారంలో నలిగిపోతున్న సోదరిమనుల గురించి అమోఘమైన అలతి అలతి పదాలతో వారి దీనస్థితిని మన కన్నుల ముందు ఆవిష్కరించిన తీరు బాగుంది. కవి చదివిన ప్రభుత్వ కళాశాల గురించి అప్పటికి , ఇప్పటివి వచ్చిన మార్పులు వివరించిన, మొక్కను నాటండని చెప్పినా , ఊరి నుండి మిత్రుడొచ్చి పల్లె అనుభూతులు గురించి చెప్పున విషయాలను కవిత్వకరించిన తీరు ఆకట్టుకుంది. కవిత్వ అంశం ఏదైనా ప్రతి కవితలో సున్నిత ఆగ్రహంతో మన పై అక్షరాల కవిత్వ మాల విసిరిన తీరు బాగుంది. మనిషి కోసం కవితలో కవి రాసిన ఈ వాఖ్యలు అందరూ చదివితీరాల్సిందే. “ మనిషిని తాకితే మట్టివాసన రావాలి మానవత్వపు పరిమళం వెదజల్లాలి “ ఈ రెండు వాఖ్యలు నేటి మనషుల మనసులు ఎలా కలుషితమయ్యాయో చెప్తూ ఆ మురికి కంపు పోవాలంటే కాస్తా స్వచ్చమైన మట్టి వాసన రావాలని చెప్పిన తీరు చాలా బాగుంది. స్వచ్ఛభారత్, అమ్మ, తల లేని వాడు, కోల్పోయిన బాల్యం, లాంటి కవితలు రీడర్స్ హృదయాలలో శాస్వతంగా నిలిచిపోతాయి. ఇలాంటి కవిత్వ సంపుటాలు మరెన్నో తెలుగు సాహిత్యానికి అందివ్వాలని ఆశిస్తూ...!! జాని.తక్కెడశిల, 

క్షణమంటే...

క్షణమంటే...     మెుగలి పొదల్ని గుప్పున అలుముకున్న చీకటి ఎందుకో నడిజామున ఉన్నపళంగా నడవమని పిలుస్తూ.. కళ్ళు పొడుచుకొని చూడబుద్ధేయని నిర్వర్ణ ఆనందం ఆ తర్వాత ఆ కల చెదిరిపోతుంది మరలా ఊహిస్తాను..వెలుతురు కోసం నడవడాలనూ, ఉషోదయాలనూ .. కానీ, వెలుతురులో నన్ను నేను కలుసుకోవటం కన్నా ఆ గమ్యం కోసం అంధకారంలో లిఖించుకున్న వెలుతురు క్షణాలు గొప్పగా కనబడతాయి గమ్యాన్ని ప్రేమించటం కన్నా గమనాన్ని అనుభూతించటమే బతకటానికి, బతికేవున్నావనటానికీ మధ్యనున్న చిన్న గీత కళ్ళ నిండా ఒంపుకునే పెరటి మెుక్కల నవ్వులు పెదవుల మీద తచ్చాడుతూ కాఫీ కప్పు రాగాలు కిటికీలోంచి తొంగి చూసిన వెన్నెల అన్నీ.. అన్నీ కాసేపటికో రేపో వెక్కిరించిపోతాయి అయినా సరే అవన్నీ నీకిపుడు ఉండటం ఇష్టమంతే నువ్వు కావాలనుకున్న క్షణాలేవీ అట్టే నిలిచిపోవు చేయాల్సిందల్లా అవి ఉన్నపుడు నీకంటూ నువ్వు లేకుండా వాటిలోనే కలిసిపోవటం నిన్ను నువ్వు కోల్పోయిన క్షణమంటే నిన్ను కొత్తగా వెతుక్కోవటమే - సరిత భూపతి    

బాల్య పుస్తకం

బాల్య పుస్తకం   నేను తెరిచిన పుస్తకంలో కొన్ని గవ్వలు దొరికాయి వాటినేరిన గురుతులూ, సగం చెరిగిన అడుగులూ కనిపించాయి! ముందు పేజీలో రాసుంది చల్లటి గాలినీ, వెచ్చటి భావాల్ని మోసుకొచ్చే ఒక కాలంలోకి నువ్విప్పుడు వెళ్తున్నావని! చదవగా చదవగా చివరాఖరి పేజీ వెన్నెల్లో తడిచి కారుతున్న జల్లుల్లా స్పృశించింది! నిజం చెప్పనా పుస్తకాన్ని తెరిచి కళ్లు మూయాలి ఆ భావాలు నీతో పలకాలంటే ఆ గవ్వలు నీకు తగలాలంటే అమ్మ ఒడి వెచ్చదనం నిన్ను తాకాలంటే వెన్నెల్లో అమ్మతనపు గోరుముద్దల కమ్మదనం నీపై కురవాలంటే, 'బాల్యం' అనే పుస్తకాన్ని నువ్వు తెరవాలంటే... చిన్నప్పటి గురుతుల చుట్టూ నువ్ రివ్వున తిరగాలంటే.. క్షణాలన్నీ నువ్వు పట్టిన సీతాకోక చిలుకలై నీ నవ్వులపై వాలాలంటే... వాటి రెక్కల రంగు నీ రెప్పలకు అంటాలంటే!!! - రఘు ఆళ్ల      

సూది గుడ్డు

సూది గుడ్డు     ఒక ఊరిలో సూది, గుడ్డు, పేడ ఉంటారు. వాళ్లు ముగ్గురూ స్నేహితులు. ఒకసారి గుడ్డుకు జ్వరం వచ్చింటే, ఆసుపత్రికి బయలుదేరి పోతుంటుంది. దానికి సూది ఎదురౌతుంది. ’గుడ్డూ, గుడ్డూ ఎక్కడి కెళ్తున్నావ్?’ అంటే, ’నాకు జ్వరం వచ్చింది, ఆసుపత్రికి వెళ్తున్నాను’ అంటుంది గుడ్డు. ’నాకూ పడిశం పట్టింది. పద, ఇద్దరం వెళ్దాం’ అని సూది కూడా బయలుదేరింది. ఇద్దరూ పోతుంటే, పేడ తప్పె ఎదురైంది. ’ఎక్కడికి పోతున్నారు, సూదీ, గుడ్డూ?’ అని అడిగింది. ’ఆసుపత్రికి’ అంటే, ’ఎందుకు?’ అని అడుగుతుంది పేడతప్పె. అప్పుడు గుడ్డు చెప్తుంది, ’నాకు జ్వరం వచ్చింది, సూదికి పడిశం పట్టింది’ అని. ’నాక్కూడా వంట్లో బాగా లేదు, పదండి ముగ్గురం పోదాం’ అని ముగ్గురూ పోతారు. అయితే ఆస్పత్రిలో డాక్టరు ఉండడు. అన్నం తినేకి ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. ఎంతసేపు చూసినా రాడు. అప్పుడు ముగ్గురికీ చాలా కోపం వచ్చింటింది. అప్పుడు సూది వెళ్లి, డాక్టరు కూర్చునే కుర్చీ మీద కూర్చొని ఉంటుంది. గుడ్డు డాక్టరు గది గడప మాను మీద అడ్డంగా కూర్చుంటుంది. పేడతప్పె వెళ్ళి ఫ్యాను మీద దాక్కుంటుంది. అంతలోనే డాక్టరు వస్తాడు, మెల్లగా చేతులు ఊపుకుంటూ. అటూ ఇటూ చూసుకుంటూ వచ్చి గడపమాను మీద కాలు పెట్టగానే గుడ్డు చిట్లి, ప్యాంటుకంతా అంటుతుంది. ’అయ్యో, ఎవరో ఇక్కడ గుడ్డు పెట్టినారే,’ అని డాక్టరు పోయి అంతా తుడుచుకొని, కుర్చీలో కూర్చుంటాడు. వెంటనే అందులో కూర్చున్న సూది డాక్టరుకు గట్టిగా గుచ్చుకుంటుంది. "అబ్బా!’ అని ఏడుస్తాడు డాక్టరు కొంతసేపు. మళ్ళీ ’అబ్బ ఉడుకు ఉడుకు’ అని ఫ్యాన్ వేసి, ’ఆహాఁ’ అని నోరు తెరుస్తాడు, అప్పుడు ఫ్యాన్ పైనున్న పేడతప్పె వచ్చి సూటిగా డాక్టరు నోట్లో పడిపోతుంది! - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో  

ప్రియమైన నేస్తం

ప్రియమైన నేస్తం       నేనున్నా నీకు అంటూ దగ్గరయ్యే మొదటి నేస్తం "అమ్మ " తోడూ నీడలా మన రక్షణ ఇచ్చే నిరంతర నేస్తం "నాన్న " మనందరం ఒకే తీరుగ కలిసిమెలిసున్న నేస్తం "మన కుటుంబం " ఎంత ఎత్తు ఎదిగినా విలువలను పంచి , జ్ఞానం పెంచే నేస్తం " మన గురువులు " ఎల్లలు లేవని హాయిగా ఎక్కడెక్కడో పరిచయ మైన హస్తాలు "మన నేస్తం " మదిలో గూడును కట్టుకొని పదిలంగా మలిచే ప్రతీ హృదయం "నమ్మకమైన నేస్తం " అచ్చు గుద్దిన ,చెక్కు చెదరని చెలిమి రహస్యాల నావ "నిజాయితీ ఉన్న నేస్తం " ఇలలో ,భువిలో ఆనంద కేరింతలు , కవ్వింతలు పంచిన నేస్తం "బాల్యమే నేస్తం " ఎన్నడూ వీడవని వెంటే ఉంటావని అందరిలో ప్రవహించే నేస్తం "సరిగమల సరాగాలు నేస్తం " దాగుడుమూతల దోబూచులాటలో దెబ్బలాటలో మైమరచి మురిపించే ప్రతీక్షణం "ప్రియమైన నేస్తం " దూర తీరాన ఎక్కడున్నా ఒకే నేస్తం గుర్తుకొచ్చే వేళ "కంటతడే నేస్తం " ఎన్ని హల్లో , హాయి లు ఉన్నా తిరిగిన కాలం లో పలికించిన గళం "నీ మాటే నేస్తం " అందుకే కల్ల కపటం ఎరుగని మన చెలిమే అవ్వాలి అన్ని వేళల "ఆదర్శవంతమైన స్నేహం ఓ నేస్తం " - దివ్య చేవూరి    

నీడలు!

నీడలు!     నీడలు! నీడలు! చీకటి నీడలు! గాలిమేడలకు ఎగిరే గోడలు! అమావాస్య, చిక్కని చీకటిలో చలిచీమల్లా ముసిరే నీడలు! నీడలు! నీడలు! ఊళ్ళూ, ఇళ్ళూ పేదలగూళ్ళూ, కుబేరులమేడలు! ఆకాశంలో మబ్బులనీడలు! భూమిపైన ప్రారబ్ధపునీడలు! కునుకుకనులలో నిద్దురనీడలు! అచేతనంలో అద్దపునీడలు! ప్రేమలనీడలు! ద్వేషపునీడలు! శాంతపునీడలు! రోషపునీడలు! కదిలేనీడలు! కదలనినీడలు! తెలిసేజాడలు! తెలియనిజాడలు! రంగులనీడలు! తావులనీడలు! తెల్లకాగితపు టావులనీడలు! గడచినకాలపు చారల నీడలు! గడిచేకాలపు భారపు నీడలు! గడువనికాలపు దూరపు నీడలు! కాలసముద్రపు తీరపునీడలు!  అంతులేని బ్రహ్మాండపుతెరపై దేశకాలముల మార్పులనీడలు!  విరహప్రణయములు, సృష్టిప్రళయములు ఏడ్పులపై ఓదార్పుల నీడలు! పురిటిపాప చిరునగవు పెదిమపై పాకేచావుల పురుగుల నీడలు!  ప్రొద్దుటిపూటల లే ఎండలపై మబ్బులచీకటి చెరగులనీడలు!  జీవితసీమ, నీలికొండలపై ఎండలనీడల దాగుడుమూతలు! పూలజల్లులా చిరుకన్నీరులు! వెలుగుకుంచతో బంగరుపూతలు! మానవజీవిత కాళరాత్రిలో ప్రేమచితాగ్నుల ఎర్రనినీడలు! నైరాశ్యపు చిక్కని చీకటిలో అక అస్పష్టపు కదలిక జాడలు! రివ్వున దూసుకపోయే నీడలు! నీడలనే వెన్నాడే నీడలు! చీకటి మూలల ఏకాంతంలో ఎందులకో వెదుకాడే నీడలు! గాలిలోన మృతకాత్మల నీడలు! నేలపైన కృతకాత్మల నీడలు! ఆశయాల ఆకాశపు నీడలు! వాస్తవాల యమపాశపు నీడలు! నీడల యుద్ధం, యుద్ధపు నీడలు! కర్తవ్యాల విరుద్ధపునీడలు! నిశ్చల విశ్వాసపు నీడల్లో, సంశయాల కదులాడే నీడలు!  ఉత్సాహపు ఉరికే నీడల్లో అనుమానపు వెనుకాడే నీడలు! చావు పుట్టుకల కొండలోయలో బ్రతుకుల దోబూచులాడే నీడలు!  నీడలు; నీడలజగత్తు మానవులంతా సుఖదుఃఖాల కోల్పోయిన అడుగులజాడలు! వెదుకుతున్న నల్లని నీడలు! ఘోరనిశీథపు చీరచెరగులో మూగరహస్యపు నీలిముసుగులో త్వరత్వరగా ముందుకు అడుగిడుతూ తడబడుతూ మరిమరి పొరబడుతూ పోతున్నారా? లేస్తూ పడుతూ నీడలు వారల మిగిలినజాడలు! నీడలు! నీడలు! చీకటినీడలు! (కవి బైరాగి రాసిన ‘చీకటి నీడలు’ కవితా సంకలనం నుంచి)   - నిర్జర.

ఆకలి

ఆకలి   ఆకలి! ఆకలి! తెరిచిన రౌరవ నరకపు వాకిలి! హృదయపు మెత్తని చోటుల గీరే జంతువు ఆకలి! బ్రహ్మాండం దద్దరిల్లి బ్రద్దలైన ఏదో ధ్వని! అగ్ని శైల గర్భంలో పొంగిన లావా వాహిని! బుర్రలోన అర్ధరాత్రి, అడవిజంతువుల అరుపులు, పొట్టలోన పరుగెత్తే బిలబిల ఆకలి పురుగులు, గుండెలుపిండే, నెత్తురు పీల్చే, కాల్చే, ఆకలి! ఆకలి కోకిల పలికిన పలుకులు చెవులకు ములుకులు దారిలేని బలిపశులకు వధకుని కత్తుల తళుకులు ఆకలి పాడిన గేయం దీనుల మౌనరోదనం ఆకలి చెప్పిన మంత్రం పూటకు చాలు భోజనం. ఆకలి! తన శిశువులనే చంపే తల్లుల ఆకలి! పూటకూటికై శీలం అమ్మే కన్యల ఆకలి! చూచావా, ఎప్పుడైనా ఎంగిలికై రోడ్లపైన కుక్కల్లా కాట్లాడే ప్రేతాలను? విన్నావా ఎప్పుడైనా బరువెక్కిన గాలిలోన ఆకలితో మరణించిన మృతకాత్మల రోదనం? పాలులేని తల్లి రొమ్ము పీడించే పసిపాపల ఏడ్పులు వినలేదా? డొక్కలు అంటుకపోయిన కన్నులు లోతుకుపోయిన నల్లని ఎండిన ముఖాలు కనలేదా? కనలేదా? లక్షల మానవశవాల మెత్తని రంగస్థలిపై ఆకలి తాండవనృత్యం! ఆకలి! జీవితపుష్పం లో తొలచిన వేరుపురుగు ఆకలి! హాలా హలంలో మృత్యుదేవి నవ్వునురుగు. ఆకలి! మన నాగరికత పుట్టించిన విభీషణుడు జీవిత ద్రౌపది చేలం లాగే దుశ్శాసనుడు ఈ ఆకలి హోరు ముందు పిడుగైనా వినిపించదు. ఆకలి కమ్మిన కళ్ళకు ప్రపంచమే కనిపించదు. మీ సంస్కృతి మీ నీతులు విభవోన్నత సుఖసంపద బీదవాని కడుపు కరువు తీర్చలేని నాగరికత మా కెందుకు ముద్దకొరకు మొగం వాచి యున్నమిట బోనులోన చిక్కుకున్న జంతువులా గున్నామిట. నిప్పురవ్వగా ఆకలి పగిలించిన విధ్వంసం ఎముకల ఒరిపిడి తెచ్చిన ప్రళయోద్ధత సంఘర్షం సామ్రాజ్య శవాలపైన మూగిన ఆకలి మూకలు వైభవ సౌధాల చుట్టు ఎండిన డొక్కల కేకలు మీ చుట్టూ చెలరేగిన ఆకలి సంద్రపు హోరూ నలుదిక్కుల కాచుకున్న క్షుధిత మానవులపోరూ. ఆకలి మంటలకాలే మీ వైభవ స్వర్ణలంక చూడబోరు జాలిగాను ఎవరూ మీ చితులవంక. (ఆలూరి బైరాగి రాసిన చీకటి- నీడలు కవితాసంపుటిలోంచి)  

చందురునికో దస్తావేజు

  చందురునికో దస్తావేజు     నిజమొకటి గట్టిగా చెప్పాలని ఎప్పట్నుంచి అనుకుంటున్నానో పున్నమి రేయిన ఆకశాన నువ్వు పడే మిడిసిపాటులో ఓయ్ చందురుడా అని! నా కనురెప్పలను హంసతూలికా తల్పాలని, శయనిస్తున్న ఆ కొన్ని క్షణాల లక్షణాన్ని నే అనిర్వచనీయంగా కలల్ని తాగే రేయిలో.., మధురాత్మక అనుభూతుల రేవులోని భావాత్మక నౌకలో నీ దగ్గరకొచ్చి.. తగ్గి పెరిగే నీ అందం ఏముందోయ్ నన్ను తనలో పెంచుకోని తనలోకి నన్ను ఇమడ్చుకునే ఒక బంధం గురించి, నీ కంటే తియ్యగా అంతకంటే కమ్మగా చిక్కనైన సుధగా మధుర మనోహరంగా ఒక చల్లటి 'తన'గా, నా దగ్గరా ఒక వింత ఉందని! ఓయ్ చందురుడా నీ 'పక్ష' పాతి సంద్రానికి కూడా చెప్పు నా మదిలోని అలలూ తన తమకాల గమకాలకి ఉవ్వెత్తున ఎగసిపడతాయని! ఒక లోకానికి మేమెప్పుడూ పయనిస్తుంటాం తెలుసా నీకు? నీ పైన ఒక స్వప్నపు తోటలో మేం పరుగులిడే సరసాల వేళల్నిచూసి కదూ నువ్వలా కుచించుకోని వ్యాకోచిస్తావ్! నిజం తెలుసులేవో నెలవంక ఎవరికీ చెప్పనులే నీకు తప్ప నిజం నమ్మవయ్యా ఇదిగో నా చెలి హృదంటి తెల్లటి కాగితంపై నే నీకిస్తున్న హామీ పత్రం దస్తా పేజీల కవిత్వానికి సమానమైన మా ఇద్దరి ప్రణయ దస్తావేజు పత్రం! నీకిస్తున్నాం!! నిజమొకటి చెప్పాలని నీకు చెప్తున్నాం!!! Raghu Alla    

వానల్లు కురవాలి వానదేముడా

వానల్లు కురవాలి వానదేముడా     వానల్లు కురవాలి వానదేముడా వరిచేలు పండాలి వానదేముడా నల్లాని మేఘాలు వానదేముడా చల్లంగ కురవాలి వానదేముడా చేలన్ని నిండాలి వానదేముడా మూనాలు యెదగాలి వానదేముడా యెన్నులు వెయ్యాలి వానదేముడా పన్నుగ సేలన్ని వానదేముడా పంటల్లు పండాలి వానదేముడా భాగ్యాలు నింపాలి వానదేముడా పండుగలు సేత్తాము వానదేముడా మావూరి చెరువైన వానదేముడా ముంచెత్తి పోవాలి వానదేముడా కప్పలకు పెళ్ళి వానదేముడా గొప్పగ సెయ్యాలి వానదేముడా (వర్షాలు బాగా పండాలంటూ అనాదిగా జానపదులు పాడుకుంటున్న పాట ఇది. కృష్ణశ్రీ సంకలనం చేసిన ‘పల్లెపదాలు’ అనే పుస్తకంలోంచి)    

అమ్మ ప్రేమ

అమ్మ ప్రేమ     అమ్మ ఆ పిలుపు మధురం, ఆ ప్రేమ స్వచ్ఛం.. కన్నవారు, కట్టుకున్నవాడే ప్రపంచంగా బ్రతికే స్త్రీ ఎప్పుడైతే బిడ్డకు జన్మనిచ్చి అమ్మ అవుతుందో అప్పటినుండి తనకి ఆ బిడ్డే ప్రపంచం.. పురిటినొప్పుల్ని తన బిడ్డ మొదటి స్వరం, మొదటి స్పర్శతో మర్చిపోయి, నా సర్వస్వం అని సంతోషిస్తుంది.. కంటికిరెప్పలా చూసుకుంటూ అమ్మ అనే మొదటి పిలుపు కోసం ఆరాటపడుతుంది.. తన చివరి శ్వాస వరకు బిడ్డ గురించే ఆలోచిస్తుంది.. అమ్మ ప్రతి ఆలోచన, ప్రతిఆనందం, ప్రతి ఆశ, ప్రతి అడుగు బిడ్డే.. అందుకే అమ్మ ప్రేమ స్వచ్ఛం.. అమ్మ ప్రేమ అనంతం.. కనిపించని దేవుడికంటే గొప్పదైన అమ్మ కోసం గుడులు కట్టాలని లేదు.. అమ్మని అమ్మలా చూసుకుంటూ, అమ్మ చూపించే ప్రేమలో పదోవంతు ప్రేమ చూపించినా చాలు అమ్మ ఆనందంగా ఉంటుంది.. ఈ సృష్టిలో, అమ్మని ఆనందంగా ఉంచటం కంటే గొప్ప అనుభూతి ఏముంటుంది... ఉంచుదాం.. అమ్మని ఆనందంగా ఉంచుదాం.