ఆకలి
posted on Sep 20, 2019
ఆకలి
ఆకలి! ఆకలి! తెరిచిన
రౌరవ నరకపు వాకిలి!
హృదయపు మెత్తని చోటుల
గీరే జంతువు ఆకలి!
బ్రహ్మాండం దద్దరిల్లి
బ్రద్దలైన ఏదో ధ్వని!
అగ్ని శైల గర్భంలో
పొంగిన లావా వాహిని!
బుర్రలోన అర్ధరాత్రి,
అడవిజంతువుల అరుపులు,
పొట్టలోన పరుగెత్తే
బిలబిల ఆకలి పురుగులు,
గుండెలుపిండే, నెత్తురు
పీల్చే, కాల్చే, ఆకలి!
ఆకలి కోకిల పలికిన
పలుకులు చెవులకు ములుకులు
దారిలేని బలిపశులకు
వధకుని కత్తుల తళుకులు
ఆకలి పాడిన గేయం
దీనుల మౌనరోదనం
ఆకలి చెప్పిన మంత్రం
పూటకు చాలు భోజనం.
ఆకలి! తన శిశువులనే
చంపే తల్లుల ఆకలి!
పూటకూటికై శీలం
అమ్మే కన్యల ఆకలి!
చూచావా, ఎప్పుడైనా
ఎంగిలికై రోడ్లపైన
కుక్కల్లా కాట్లాడే ప్రేతాలను?
విన్నావా ఎప్పుడైనా
బరువెక్కిన గాలిలోన
ఆకలితో మరణించిన
మృతకాత్మల రోదనం?
పాలులేని తల్లి రొమ్ము
పీడించే పసిపాపల
ఏడ్పులు వినలేదా?
డొక్కలు అంటుకపోయిన
కన్నులు లోతుకుపోయిన
నల్లని ఎండిన ముఖాలు
కనలేదా? కనలేదా?
లక్షల మానవశవాల
మెత్తని రంగస్థలిపై
ఆకలి తాండవనృత్యం!
ఆకలి! జీవితపుష్పం
లో తొలచిన వేరుపురుగు
ఆకలి! హాలా హలంలో
మృత్యుదేవి నవ్వునురుగు.
ఆకలి! మన నాగరికత
పుట్టించిన విభీషణుడు
జీవిత ద్రౌపది చేలం
లాగే దుశ్శాసనుడు
ఈ ఆకలి హోరు ముందు
పిడుగైనా వినిపించదు.
ఆకలి కమ్మిన కళ్ళకు
ప్రపంచమే కనిపించదు.
మీ సంస్కృతి మీ నీతులు
విభవోన్నత సుఖసంపద
బీదవాని కడుపు కరువు
తీర్చలేని నాగరికత
మా కెందుకు ముద్దకొరకు
మొగం వాచి యున్నమిట
బోనులోన చిక్కుకున్న
జంతువులా గున్నామిట.
నిప్పురవ్వగా ఆకలి
పగిలించిన విధ్వంసం
ఎముకల ఒరిపిడి తెచ్చిన
ప్రళయోద్ధత సంఘర్షం
సామ్రాజ్య శవాలపైన
మూగిన ఆకలి మూకలు
వైభవ సౌధాల చుట్టు
ఎండిన డొక్కల కేకలు
మీ చుట్టూ చెలరేగిన
ఆకలి సంద్రపు హోరూ
నలుదిక్కుల కాచుకున్న
క్షుధిత మానవులపోరూ.
ఆకలి మంటలకాలే
మీ వైభవ స్వర్ణలంక
చూడబోరు జాలిగాను
ఎవరూ మీ చితులవంక.
(ఆలూరి బైరాగి రాసిన చీకటి- నీడలు కవితాసంపుటిలోంచి)