సీతాకోకచిలుకలు
posted on May 14, 2020
సీతాకోకచిలుకలు
కాన్వాసుపైని సీతాకోకచిలుక చిత్రాలు
సజీవమై సడి చేస్తూ తిరుగుతాయి
ఏదో నిశ్శబ్ద రంగులను,
నిర్మల స్పందలనూ
నీకే పరిచయం చేస్తున్నట్లు!
వాలిపోయిన నీ కళ్లప్పుడు
వాటి రెక్కలను చూస్తూ ఎగురుతాయి
అనంత యాత్రలా సందడి చేస్తూ,
వాటి పయనం
నీలోకి చేరినప్పుడు
కాలమొక వలయమని
నీ మనో నేత్రాలు గుర్తిస్తాయి
అంతవరకూ నీకు తెలిసిన
పాతదనమిప్పుడు
తొలగిపోయిన పొగమంచులా
కొత్త రంగులు పూసుకోని
నీలోకి దూకేయబడుతుంది
మళ్లా ఆ కాన్వాసుపైకి
ఆ సీతాకోకలు యధా స్ధానానికొచ్చి
ప్రతిష్ఠించబడతాయి
మౌన భావపు కాన్వాసుపై
తీపి జ్ఞాపకపు కబుర్లే
ఆ సీతాకోకచిలుకలు
నీ చేతికీ,
చిగురిస్తున్న ఆ కళ్లకీ
నవ్య వర్ణాలవే
ఆ నవ్య వర్ణనలివే!!!
- Raghu Alla