వీణా వాణి
posted on Apr 8, 2020
వీణా వాణి
నువ్వు సరిగా వినాలేగానీ
నిశ్సబ్దంలోనూ ఒక వింత సడి
మౌనంలోనూ రవ్వంత తడి
నీకై ఎదురేగుతాయి!
నిలువెత్తు కొండకోనల్లోనూ
నువ్వు ఆర్తిగా అరిచే అరుపుకు
ఒక సమాధానం ప్రతిధ్వని గా
మార్మోగుతుంది విన్నావా ఎప్పుడైనా!
ఒక చిన్న పలకరింపుకు
యుగాలనాటి భావాలను పంచుకోడానికి
ఎదో మనసు ఆరాటపడుతుంది!
మీటి చూస్తే తెలుస్తుంది
ఆ మనో వీణ నీకై కురిపించే
వేల రాగాలు,గారాలతో!
నువ్వు నీతో మాట్లాడుకున్నంత
హాయిగా..
నువ్వు నీలో ప్రవహించినంత
గోముగా...
నీకు నువ్వే పలకరించుకున్నంత
ఖుషీగా...!
ప్రతిధ్వనిస్తుంది ప్రతీసారి
ఒక వాణి
ప్రకటిస్తుంది నీలో దాగున్న
వేవేల వినూత్న బాణీ
నిజమేనంటావా చెప్పు
విరహపు పూబోణి!!!!
- రఘు ఆళ్ల