RELATED EVENTS
EVENTS
తానా ప్రపంచ సాహిత్య వేదికలో శ్రీనాధ మహాకవి సాహిత్య వైభవం పై పంచ సహస్రావధాని డా. మేడసాని మోహన్ అద్భుత ప్రసంగం

 

 


అట్లాంటా: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో 20 వ “నెల నెలా తెలుగు వెలుగు” సాహిత్య కార్యక్రమం అంతర్జాలంలో ఘనంగా జరిగింది. విదేశాలలో సామాజిక సేవా రంగంలో తెలుగు కేతనాన్ని రెపరెపలాడిస్తున్న తెలుగు సంతతికి చెందిన ఇద్దరు ప్రముఖ రాజకీయనాయకులు - న్యూ జెర్సీ రాష్ట్ర పూర్వ శాసన సభ్యుడు, ప్రస్తుత న్యూ జెర్సీ రాష్ట్ర యుటిలిటీస్ బోర్డు కమీషనర్ అయిన ఉపేంద్ర చివుకుల, కెనడా దేశంలోని అల్బర్టా రాష్ట్ర మౌలిక వసతుల శాఖామంత్రిగా కీలక భాద్యతలు నిర్వహిస్తున్న ప్రసాద్ పండాలను తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహాకులు డా. ప్రసాద్ తోటకూర ప్రత్యేక అతిధులు గా సభకు పరిచయం చేశారు. ఎన్నో దశాబ్దాలగా పర దేశంలో ఉంటూ, జన జీవన స్రవంతిలో మమేకమవుతూ కూడా తెలుగు భాష మీద పట్టు కోల్పోకుండా తెలుగులో అద్భుతంగా ప్రసంగించిన వీరివురు తెలుగు భాషా పరిరక్షణకు అందరూ నడుం కట్టాలని పిలుపునిచ్చారు.

 

ఎంతో విలువైన వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య సంపదను భావితరానికి భద్రంగా అందించే కృషిలో తానా ఎల్లప్పుడూ ముందుంటుందని తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు తన స్వాగతోపన్యాసంలో పేర్కొన్నారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ప్రాచీన సాహిత్యంపై సదస్సు నిర్వహించడం ముదావహం అన్నారు.

శ్రీనాధ మహాకవి కాశీ పట్టణం స్వయంగా పర్యటించి “కాశీ ఖండం” అనే మహాకావ్యం రచించి 600 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా అపూర్వ పంచ సహస్రావధాన సార్వభౌమ డా. మేడసాని మోహన్ శ్రీనాధ మహాకవి సార్వభౌమ కవితా వైభవం – విద్యానగర సంస్థానంలోని ప్రఖ్యాత పండితుడైన డిండిమ భట్టును ఓడించడం, ఎన్నెన్నో గొప్ప రచనలు చేయడం, ఎంతోమంది రాజులు, సంస్థానాదీశుల నుండి లెక్కకు మించిన సన్మానాలు, గండపెండేరాలు, సువర్ణ కంకణాలు అందుకుని కూడా చివరి దశలో అంతా పోగొట్టుకుని సేద్యం చేసి మరింత నష్టాలపాలై ఆర్ధిక బాధలతో కన్నుమూయడం విషాదం అన్నారు.

 

 

శ్రీనాధ మహాకవి పాండిత్యంపై దాదాపు గంటన్నర పైగా సాగిన అవధాని మేడసాని వారి ప్రసంగ ఝరిలో అందరూ తడిసి ముద్డైయ్యారని, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలుగు జాతి కీర్తి ప్రతీక అయిన పుంభావ సరస్వతి, లక్షన్నరకు పైగా పద్యాలను ధారణ చేసినట్టి పంచ సహస్రావధాని డా. మేడసాని మోహన్ గారికి తానా ప్రపంచ సాహిత్య వేదిక తరపున నిర్వాహకులు డా. తోటకూర ప్రసాద్ హృదయ పూర్వక కృతజ్ఞతలను, వివిధ ప్రసార మాధ్యమాలకు ప్రత్యేక ధన్యవాదములను తెలియజేశారు.

 

 

పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది యు ట్యూబ్ లింక్ లో చూడవచ్చును.

https://youtu.be/MZQoYmsvWiA

TeluguOne For Your Business
About TeluguOne
;