RELATED EVENTS
EVENTS
జులై 1 నుండి అమెరికాలో “తానా’’ సంబరాలు ముఖ్యఅతిథులుగా జి.యం.ఆర్. & బాలకృష్ణ

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) 18వ వార్షిక సంబరాలు జులై 1వ తేదీ నుండి మూడు రోజులపాటు కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాంతాక్లారా కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించటానికి సన్నాహాలు పూర్తైనట్టు “తానా’’ అధ్యక్షులు కోమటి జయరాం తెలిపారు.

 

ఈ ఉత్సవాలకు జి.యం.ఆర్. సంస్థల అధినేత గ్రంధి మల్లిఖార్జునరావు, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు. ప్రముఖ దర్శకుడు ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్ ను “జీవిత సాఫల్య పురస్కారం’’తో సత్కరిస్తున్నట్లు తెలిపారు. కేంద్రమంత్రి పల్లంరాజు, రాష్ట్రమంత్రులు గల్లా అరుణ, పొన్నాల లక్ష్మయ్య, ఎం. వెంకటరమణ, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరిలతో పాటు పలువురు ఎం.పీ.లు హాజరవుతున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మిక గురువులైన గణపతి సచ్చిదానందస్వామి, విశ్వయోగి విశ్వంజీ, మాతా శివచైతన్య తదితరులు ప్రవాసాంధ్రులకు ఆధ్యాత్మిక బోధనలు అందిస్తారని జయరాం తెలిపారు.

జస్టీస్ తామాడ గోపాలకృష్ణ, జస్టీస్ భవానీ ప్రసాద్, సాహితీవేత్తలు, డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డాక్టర్ మేడసాని మోహన్, సామవేదం షణ్ముఖశర్మ హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. సినీ ప్రముఖులు గొల్లపూడి మారుతీరావు, శ్రియశరణ్, నిత్యామీనన్, ఇండియన్ ఐడిల్ శ్రీరామచంద్ర, మురళీమోహన్, పరుచూరి గోపాలకృష్ణ, శేఖర్ కమ్ముల, సుహాసిని తదితరులు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు.

మూడు రోజులపాటు జరిగే వేడుకల సందర్భంగా యువజన, మహిళా, పారిశ్రామిక, ఆధ్యాత్మిక, సాహిత్య సదస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అమెరికా నుండి దాదాపు 10 వేల మంది ప్రతినిథులు ఈ సదస్సుకు హాజరుకానున్నారని కోమటి జయరాం వెల్లడించారు.


TeluguOne For Your Business
About TeluguOne
;