RELATED ARTICLES
ARTICLES
19వ తానా సభల్లో ప్రత్యేక ఆకర్షణ గా నిల్చిన సాహిత్యవేదిక

 

 

 

 

ఇటీవల మే నెల 24, 25, 26 తారీఖుల్లో డాలస్ లో అత్యంత పైభవంగా జరిగిన తానా మహా సభల్లో సాహిత్యకార్యక్రమాలు సాహిత్యవేదిక సమన్వయకర్త మద్దుకూరి విజయచంద్రహాస్, తానా అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ ల నాయకత్వంలో కార్యవర్గ బృందం పులిగండ్ల విశ్వం, పూదూర్ జగదీశ్వరన్, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, జువ్వాడి రమణ, కాజా సురేశ్, పాలూరి సుజన, ఊరిమిండి నరసింహారెడ్డి, సుద్దాల శ్రీనివాస్, జాస్తి చైతన్య, కన్నెగంటి చంద్ర, మందపాటి సత్యం, వంగూరి చిట్టెన్ రాజు, నసీం షేక్, రాయవరం భాస్కర్, ఇంకా స్థానిక తెలుగు సంస్థ ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్యవేదిక సమన్వయకర్త సింగిరెడ్డి శారద, కార్యవర్గ సభ్యులు పున్నం సతీశ్, బసాబత్తిన శ్రీల ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగాయి. 19వ తానా మహాసభలకు సహ ఆతిథ్యం అందించిన టాంటెక్స్ నిర్వహించే "నెల నెలా తెలుగు వెన్నెల" 70 వ సదస్సును కూడా ఈ కార్యక్రంలో భాగంగా జరుపుకోవడం విశేషం. భారతదేశం నుండి, అమెరికా నలుమూలలనుండి వచ్చిన అనేక సాహితీవేత్తలు, అభిమానులు అనేక వైవిధ్యభరితమైన వినూత్నకార్య క్రమాల్లో పాల్గొని అనందించడమే కాక సాహిత్యవేదిక బృందాన్ని మనసారా అభినందించారు.

 

 

 

  

శనివారం మే 25 మధ్యాహ్నం మద్దుకూరి చంద్రహాస్ వచ్చిన అతిథులందరికీ స్వాగతం పలికిన తరువాత జ్యోతిప్రజ్వలనతో సాహిత్య వేదిక ప్రారంభం జరిగింది. మొదటి కార్యక్రమం సినీగేయవైజయంతి అనే మకుటంతో చంద్రహాస్ నిర్వహించారు.  ప్రసిధ్ధ సినీ రచయితలు వడ్డేపల్లి కృష్ణ, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరాం లను వేదికమీదకు సాదరంగా ఆహ్వానించారు.  వీరి ప్రఖ్యాతిగాంచిన గేయాలను ప్రముఖగాయకుడు, సంగీతగురువు రామాచారి, హ్యూస్టన్ కు చెందిన మధురగాయని ఆకునూరి శారద ఆలపించగా, ఆ గీతాల నేపధ్యాలను, ఆసక్తికరంగా ఆయా రచయితలు చెప్పారు.  జగదానందకారకా (జొన్నవిత్తుల), నీచూపులోనా విరజాజివాన (వడ్డేపల్లి), తప్పెట్లోయ్ తాళాలోయ్ (రామజోగయ్య), నాలోఊహలకు (అనంతశ్రీరాం), చినుకుచినుకు అందెలతో (జొన్నవిత్తుల), ముద్దులజానకి (వడ్డేపల్లి), సదాశివాసన్యాసి (రామజోగయ్య), ఎదుట నిలిచిందిచూడు (అనంతశ్రీరాం) , మొదలైన పాటల సంరంభానికి తోడు గాయకులు కూడా అయిన రామజోగయ్య, అనంత శ్రీరాం వారిపాటలకు రామాచారిగారితో గళంకలపడం మరింత చక్కని అనుభూతిని కలిగించగా,  హాలు పూర్తిగా నిండిపోగా, ప్రేక్షకులు పెద్ద పెట్టున హర్షధ్వానాలతో అనేకమార్లు తమ అనందాన్ని వ్యక్తం చేశారు. మొత్తం సాహిత్యకార్యక్రమాలలో వచ్చిన అతిధులవివరాలతో పాలూరి సుజన చేసిన స్లైడ్ షో ఒక ముఖ్య పాత్ర ధరించి అందరినీ ఆకట్టుకుంది.

 

 



 

 

అనంతరం వడ్డేపల్లి కృష్ణ రచించిన ‘తెలుగువైభవం’ బుర్రకథ, అనంత శ్రీరాం తండ్రి చేగొండి వీరవెంకట సత్యనారాయణ మూర్తి గానంచేసిన ఆంధ్రసంస్కృతీ వైభవం సీడీ ఆవిష్కరణ జరిగింది.  అన్ని ఆవిష్కరణలకు సాహిత్యబృందసభ్యులు సుద్దాల శ్రీనివాస్, జాస్తిచైతన్య బాధ్యత వహించారు.  తరువాత సినీగేయరచయితలను సాహిత్యవేదిక సభ్యులు ఘనంగా సన్మానించారు.

 

పిమ్మట కాజ సురేశ్, మందపాటి సత్యం సారధ్యంలో మరో కొత్తతరహా కార్యక్రమం వచనరచనావైదుష్యం జరిగింది. నవల, నాటకము, కథ మరియు విమర్శ లాంటి వచన రచనా ప్రక్రియలను గురించి కొనసాగిన ఈ చర్చావేదికలో కథారచయిత ‘మిథునం’ ఫేం శ్రీరమణ, ప్రముఖ నవలారచయిత సూర్యదేవర రామమోహనరావు, సీనియర్ రచయిత అక్కిరాజు రమాపతిరావు, రచయిత్రి వాసా ప్రభావతి మరియు వాసిరెడ్డి నవీన్ పాల్గొనగా, వారిని మందపాటి సత్యం సభకు పరిచయం చేసారు. “రచనా నేపథ్యము", “వచన రచన – పరిణామక్రమము" మరియు "భాష, శైలి, శిల్పము" అనే శీర్షికలతో మూడు ఆవృతాలుగా ఈ కార్యక్రమాన్ని కాజ సురేశ్ నిర్వహించారు.

 



 

శ్రీరమణ తమకు అతి ప్రీతిపాత్రమైన కథ "మురుగు" గురించి వివరిస్తూ ఆ కథలోని విశేషాలను, నేపథ్యాన్ని సభికులకు తెలియపరిచారు. రామమోహన రావు తాము రాసిన అసంఖ్యాకమైన నవలలను గురించి ప్రస్తావిస్తూ, బాల్యము, తండ్రిగారి వృత్తియైన ఆయుర్వేద వైద్యము, సమకాలీన సమాజములో ఈ వైద్య ప్రక్రియ యొక్క ఆవశ్యకత, మరియు తమ రచనల మీద వీటి ప్రభావమును గురించి వివరించారు. వాసిరెడ్డి నవీన్ తమ కథా సంకలన ప్రక్రియ తెలియపరిచారు. అక్కిరాజు రమాపతిరావు మరియు వాసా ప్రభావతి తమతమ రచనలు మరియు విమర్శనా గ్రంథాల లోని విశేషాలను సభికులకు విశదీకరించారు.

 

తెలుగులో మరిన్ని అనువాదాలు రావాలని తద్వారా ప్రపంచభాషలలోని మేటి రచనలు తెలుగువారికి చేరువ అవ్వాలని రమాపతిరావు భావించారు. ఎనబైల దశకము వరకు ఒక వెలుగు వెలిగి, టి.విలు మరియు సీరయళ్ల వలన ప్రాభవము కోల్పోయిన తెలుగు నవలా ప్రక్రియకు మరల మంచి రోజులు వచ్చే సూచనలు కనపడుతున్నాయి అని రామమోహనరావు తలపోసారు. కొత్తగా వచ్చే రచనలలోని సింహభాగము వ్యక్తిత్వ వికాశము, ఆరోగ్యము మరియు కెరియర్ కు సంబంధించిన విశేషాలు మాత్రమే ఉంటున్నాయి అని వక్తలు ఆవేదన వ్యక్తపరిచారు. ఆంగ్ల భాష ప్రభావము తప్పనిసరి అని భావిస్తూనే రచనలలో తెలుగు భాషకు, నుడికారాలకు, సంప్రదాయాలకు పెద్దపీట వెయ్యాలని వక్తలు భావించారు. తెలుగులో మరిన్ని వైవిధ్యభరితమైన రచనలు రావాలని, వాటిని మరింతమంది పాఠకులు కొని చదవాలని చర్చావేదికలోని సభ్యులు ఆశాభావము వ్యక్తపరిచారు.

 

 



 

 

అనంతరం వంగూరి చిట్టెన్ రాజు కథాసంపుటి ‘116 అమెరికామెడీ కథలు’, కోసూరి ఉమాభారతి కథాసంకలనం ‘విదేశీకోడలు’, వాసాప్రభావతి కథల ఇంగ్లీషు అనువాద సంపుటి ‘డ్రీమ్స్ అండ్ డిలైట్స్’, మధురాంతకం నరేంద్ర సంపాదకత్వంలో వెలువడిన ‘కథావార్షిక 2012’  ఆవిష్కరణలు జరిగాయి.  తరువాత వేదికమీది రచయితలను సాహిత్యవేదిక సభ్యులు ఘనంగా సన్మానించారు.  వీటితో శనివారం సాహిత్యకార్యక్రమాలు ముగిశాయి.  సన్మానాలనిర్వహణలో ఊరిమిండి సరసింహారెడ్డి, పున్నం సతీశ్, సింగిరెడ్డిశారద ప్రధానభూమిక వహించారు.

 

మరునాడు ఆదివారం మే 26 ఉదయం ‘భాషకోసం మనం’ అనే చర్చావేదిక తో పాహిత్య కార్యక్రమాలు పునఃప్రారంభం అయ్యాయి.  ప్రముఖ రచయిత నటుడు  గొల్లపూడి మారుతీరావు, సీనియర్ పాత్రికేయులు మానవీయవాది నరిశెట్టి ఇన్నయ్య, తెలుగు ఆచార్యురాలు గుండ్లపల్లి రెజీనా,  నాటకప్రయోక్త గంజి ‘సమైఖ్యభారతి’ సత్యనారాయణ, యూటీ ఆస్టిన్ లో తెలుగు అధ్యాపకులు, కవి అఫ్సర్ మహ్మద్, రచయిత్రి, పాత్రికేయురాలు రెంటాల కల్పన పాలొన్న ఈ చర్చకు అధికారభాషాసంఘం అధ్యక్షులు మండలి బుధ్ధప్రసాద్ అధ్యక్షత వహించగా మద్దుకూరి చంద్రహాస్ సభ నిర్వహించారు.  

 

తెలుగు భాష అంతరించిపోతోందా? భాష మనగడ ప్రశ్నార్థకం కావడానికి గల నేపధ్యం ? ప్రాచీనహోదా వల్ల ఒరిగిందేమిటి?  జరుగనిదేమిటి? వర్తమాన పరిస్థితి ... భాషభవితకోసం మనం (ప్రభుత్వం, విద్యాలయాలు, స్వఛ్ఛందసేవాసంస్థలు, తలిదండ్రులు) చేయవలసినది ఏమిటి? అన్న విషయాలగురించి వేదికమీద పెద్దలు అందరూ వారివారి అనుభవాల దృష్ట్యా వ్యాఖ్యానించి  తెలుగు బ్రతికే వుంటుందనీ అయితే అందరి అలోచనా విధానాల్లో మార్పు రావాలనీ అన్నారు.  తలిదండ్రులలో పిల్లలలో భాషపట్ల ఆసక్తి మమకారం తగ్గిపోతోందనీ తరానికీ తరానికీ కుటుంబాలలో భాషలో ప్రవేశం తగ్గి పోతోందనీ చెప్పారు.  మారుతున్న అవసరాలకు అనుగుణంగా భాషను మార్చులోవలసివుందని ఇన్నయ్య చెప్పారు.  యూటీ ఆస్టిన్ లో తెలుగు తరగతుల్లో చేరేవారిలో ఇరవై శాతం మంది తెలుగువారు మిగతా అందరూ వేరే భాషల జాతులవారు అనీ అఫ్సర్ చెప్పారు.  సాంస్కృతిక సంస్థల ద్వారా కళల ద్వారానే భాష ప్రజలకు చేరువ గా వుంటుందనీ వీటిని ప్రభుత్వం ప్రోత్సహించాలనీ గంజి సత్యనారాయణ అన్నారు. 

 

ఆఖరున అందరి అభిప్రాయాలనూ సమన్వయంచేసి ప్రభుత్వపరంగా జరుగుతున్న కృషిని మండలి బుధ్ధప్రసాద్ విశదీకరించి ఎంతో కాలంనుండి ప్రయత్నించగా పరిపాలన పూర్తిగా తెలుగులో ఒక్క సల్గొండజిల్లాలో అమలు చేయగలిగామని చెప్పారు.  పొరుగున వున్న తమిళనాడు నుండి మనంనేర్చుకో వలసినది వుందనీ అన్నారు.  ప్రభుత్వపరం గా చేయగలిగిన పనులకు వున్న అడ్డంకులు, పరిమితులు మండలి వివరించి మేధావుల వద్దనుండి సలహాలు సూచనలు కోరారు. 

 

సభలోని వారు భాషకోసం ప్రభుత్వం చేపట్టపలసిన వివిధ చర్యలకు సలహాసూచనలను తనకు పంపిస్తే తానా తరపున ప్రభుత్వానికి అందజేస్తామని చంద్రహాస్ తెలిపారు.  అనంతరం పాలపర్తి శ్యామలానందప్రసాద్ రచించిన ‘పద్మవంశీ’, ‘మనస్సాక్షిమహాభారతం’ పుస్తకాలను మండలి బుధ్ధప్రసాద్ ఆవిష్కరించారు.  తరువాత సాహిత్యవేదిక సభ్యులు చర్చలో పాల్గొన్న అందరినీ ఘనంగా సత్కరించారు. 

 

ఆదివారం మధ్యాహ్నం భోజనవిరామానంతరం ఆవధాన కళావైభవం పేరిట సహస్రావధాని గరికిపాటి నరసింహారావు, శతావధాని పాలపర్తి శ్యామలానందప్రసాద్ పాల్గొన్న అవధానయుగళ విన్యాసం జరిగింది. 

 

అష్టావధానంలోని దత్తపది, సమస్య, , వ్యస్తాక్షరి, అప్రస్తుతప్రసంగం  మొదలైన అంశాలతో, అవధానులిద్దరు ఒకే ప్రశ్నకు జవాబుచెప్పే వినూత్నశైలిలో జరిగిన ఈకార్యక్రమానికి అనూహ్యంగా జనం తరలివచ్చి సభ కిటకిటలాడిపోయింది. ముందుగా మద్దుకూరి చంద్రహాస్, కార్యక్రమ సంధాత, అమెరికా వాసులైన ఏకైక అవధాని పుదూరు జగదీశ్వరన్, తరవాత అవధానులు గరికిపాటి, పాలపర్తిలను వేదికమీదకు ఆహ్వానించారు. ఈ అవధానంలో ఒక విలక్షణత ఒకే ప్రశ్నకి ఇద్దరు అవధానులు వేరే సమాధానాలు చెప్పడం. అవధానంలో ఉన్న అంశాలు దత్తపది, సమస్య, వర్ణన, ఆశువు, వ్యస్తాక్షరి, పురాణ పఠనం, అప్రస్తుత ప్రసంగం. ఈ కార్యక్రమంలో అవధానులని ప్రశ్నించిన పృచ్ఛకులు శొంఠి శారదా పూర్ణ(దత్తపది), వడ్డేపల్లి కృష్ణ(సమస్య), జనని కృష్ణ (ఆశువు), జువ్వాడి రమణ (వ్యస్తాక్షరి), చేగొండి సత్యనారాయణ మూర్తి (పురాణ పఠనం), అక్కి రాజు సుందర రామకృష్ణ (పురాణ పఠనం), వంగూరి చిట్టెంరాజు (అప్రస్తుత ప్రసంగం) మొదలైనవారు. పురాణ పఠనంలో పృచ్ఛకుడు ఆలాపించిన పద్యం చుట్టూ ఉన్న కథని ఆ సందర్భాన్ని అవధాని వివరిస్తాడు. ఒకే పద్యానికి రెండో సారి వివరణ జనరంజకంగా ఉండదు కనుక ఈ ఒక్క అంశానికి మాత్రం ఇద్దరు పృచ్ఛకులు వేరువేరు పద్యాలు ఆలాపించారు. ఈ ఇద్దరు పృచ్ఛకులు పద్యాలు అద్భుతంగా ఆలాపించి ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. కార్యక్రమం అవధానుల పద్యకల్పనతో, చలోక్తులతో, వాగ్ఢాటితో సరసభాషణలతో అద్భుతంగా జరిగి ప్రేక్షకులను విశేషంగా అలరించింది.  ఎన్నో సార్లు చప్పట్లతో హాలు మార్మ్రోగిపోయింది. అవధాని వేగానికి దీటుగా ఆ పద్యాలని లేఖకులు పాలూరి సుజన, పాలూరి రామారావు, కొమ్మెర రవి, కాజా సురేశ్ ప్రేక్షకుల సౌలభ్యం కోసం తెరకెక్కించారు.

అనంతరం అక్కిరాజు సుందరరామకృష్ణ రచించిన ‘బాపూరమణా’ అధిక్షేప శతకం, శొంఠి శారదాపూర్ణ సంకలనకర్త గా వ్యవహరించిన వ్యాస సంకలనం ‘తెలుగు సంస్కృతి - భాషాసారస్వతములు’, తిరుమల సుందరవల్లి శ్రీదేవి రచించిన సంకీర్తనల గ్రంథం ‘శతకీర్తనామణిహారం’, విద్వాన్ తెన్నేటి రచించిన పద్యకావ్యం ‘తెలుగుభాష గుండెఘోష’ పుస్తకాలను గరికపాటి, పాలపర్తి ఆవిష్కరించారు.  తరువాత సాహిత్యవేదికబృందం అవధానులను ఘనంగా సత్కరించింది. 

తదనంతరం ధారణావధాని వొలుకుల శివశకరరావుగారిని జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం సాదరంగా వేదికమీదకు ఆహ్వానించారు.  వొలుకుల తనదైనశైలిలో అనేక పద్యాలను శ్రావ్యంగా గానంచేసి అభ్యుదయం అనే అంశాన్ని పూర్వ కవులు చిత్రించిన వైనాన్ని తెలియజెప్పారు.  సాహిత్యవేదిక సన్మానాన్ని అందుకున్నారు. 

 

సాహిత్య వేదిక కార్యక్రమాల ముగింపు అంశంగా జరిగిన కవితా వైభోగం కార్యక్రమం అతిథుల, ఆహూతుల మనసుల్లో చిరకాలం నిలిచిపోయే రీతిలో సాగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి, నటులు, దర్శకులు తనికెళ్ళ భరణి గారు; కవి, సంగీత దర్శకులు స్వర వీణాపాణి గారు; రచయిత్రి కేతవరపు రాజ్యశ్రీ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసారు. ముందుగా తనికెళ్ళ భరణి గారు తను "శభాషురా శంకరా" అనే మకుటంతో తెలంగాణా మాండలీకంలో రచించిన శివతత్వాలు వినిపించి శ్రోతల రస హృదయాలను రంజింపచేశారు. ఆయన తన కంచు కంఠంతో చదివిన ప్రతీ పద్యానికీ చప్పట్లు మారుమ్రోగాయి. అనంతరం 72 మేళకర్త రాగాలనూ ఆరున్నర నిమిషాల ఒకే పాటలో ఇమిడ్చిన స్వర వీణాపాణి గారు, ఆ పాటకి తనే స్వయంగా వ్రాసిన "అమ్మ" సాహిత్యాన్ని వినిపించి సభను రస ఝరిలో ఓలలాడించారు. కేతవరపు రాజ్యశ్రీ గారు నానీలు, వ్యంజకాలు, రెక్కలు వంటి సాహితీ ప్రక్రియలలో తాను రచించిన కవితలను వినిపించారు. చివరిగా తానా సాహిత్యవేదిక సభ్యురాలు పాలూరి సుజన తానా పై కేవలం త, న అన్న రెండే అక్షరాలు వాడి రాసిన మినీ కవిత వినిపించి అతిథులకు, ఆహూతులకు వందన సమర్పణ చేయడంతో తానా సాహిత్య వేదిక కార్యక్రమాలు దిగ్విజయంగా ముగిశాయి. 

19వ తానా సభల ‘గీతా(నా)oజలి’ గీత రచన పోటీకి అనూహ్య స్పందన - భైరవభట్ల పాటకు ప్రథమ బహుమతి డాలస్ లో మే 24-26 తారీఖుల్లో జరిగిన 19వ తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) మహాసభల సందర్భంగా, ఇటీవల గీతా(నా)oజలి పేరుతో తెలుగు భాష వస్తువుగా గేయ రచన పోటీలు నిర్వహించారు.
 

చక్కని చిక్కని కవిత్వం, క్రొత్తదనం, శిల్పం, గాన సౌలభ్యం కొలమానాలు గా జరిగిన పోటీలో అందరు న్యాయనిర్ణేతలను మెప్పించి ప్రథమ  బహుమతి రూ. 10116 కైవసం చేసుకున్న పాట భైరవభట్ల కామేశ్వరరావు రచించిన ‘తెలుగంటే ఎందుకో తీయని పులకింత’. దండెబోయిన పార్వతీదేవి రచన ‘అందమైన నా తెలుగు’ రెండవ బహుమతి రూ. 5116, జెజ్జాల కృష్ణమోహనరావు రచన ‘తెలుగులో పాడుతా తీయగా’ మాడవ బహుమతి రూ. 3116 గెల్చుకున్నాయి.
 

ఇవిగాక అత్యుత్తమ రచనలుగా మొదటి పన్నెండు స్థానాల్లో ఎంపిక కాబడ్డ ఇతర రచనలు పంపినవారు ఉండవల్లి సూర్యచంద్రరావు, వీరెల్లి రవి, కేయస్సెమ్ ఫణీంద్ర, గరిమెళ్ళ నారాయణ, తుమ్మూరి రామ్మోహన్ రావు, వురిమళ్ళ సునంద, టీవీ రామదాస్, ప్రజాగాయకుడు వంగపండు, రెడ్డి రామకృష్ణ.  

ఈ పోటీకి అనూహ్య స్పందన లభించిందని, ఆంధ్రప్రదేశ్ నుండి అమెరికా వరకు వందలాదిమంది కవులు, గేయ రచయితలు పాల్గొన్నారని, ఈ పోటీకి ఉత్తమ రచనలను ఎంపిక చేయడం నిర్వాహకులకు న్యాయనిర్ణేతలకు ఒక సవాలుగా పరిణమించిందని, ఈ మంచి పాటలు పదిలాలాల పాటు తెలుగువారిని అలరిస్తాయని ఆశిస్తున్నామని,  విజేతలను త్వరలో సంప్రదించి బహుమతులను అందజేస్తామనీ తానా అధ్యక్షులు తోటకూర ప్రసాద్, 19వ తానా మహాసభల సాహిత్యవేదిక సమన్వయకర్త మద్దుకూరి విజయ చంద్రహాస్, ఒక ప్రకటనలో తెలియజేస్తూ, పోటీలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసారు.

TeluguOne For Your Business
About TeluguOne
;