మళ్లీ సభలో గుభాళించే ప్రయత్నంలో... రోజా!
Publish Date:Sep 2, 2016
Advertisement
రోజూ వార్తల్లో వుండటం రాజకీయంలో ఓ భాగమే కావొచ్చుగాని... రోజూ వార్తల్లో వుండటం మాత్రమే రాజకీయం కాదు! ఈ విషయం రోజాకు ఎట్టకేలకు బోధపడి వుంటుంది. వైసీపీ ఎమ్మేల్యే అయిన ఆమె గత కొన్ని నెలలుగా అసెంబ్లీలో కాలుమోపలేక జబర్డస్త్ షూటింగ్లు చేసుకుంటూ రచ్చబండ వద్దే కాలక్షేపం చేస్తోంది! అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ ఎక్స్ హీరోయిన్ అసెంబ్లీ స్పీకర్ కి బేషరతుగా సారీ చెప్పిందట! అదీ రాత పూర్వకంగా... కొన్నాళ్ల క్రితం వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా అసెంబ్లీలో లైవ్ గా చెలరేగిపోయింది. ఆ విషయం ఇంకా ఎవరు మర్చిపోలేదు కూడా! ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా టీడీపీ లీడర్లు చాలా మందిపై ఆమె రుసరుసలాడింది. బూతులు కూడా తిట్టిందని అధికార పక్షం వారన్నారు. మొత్తానికి ఎలాంటి సభా సంప్రదాయాలు పాటించని రోజాపై సంవత్సరం పాటూ వేటు పడింది అసెంబ్లీలో. తరువాత ఆమె సుప్రీమ్ కోర్టు దాకా వెళ్లినా కూడా తిరిగి సభలో కాలుపెట్టడం కుదరలేదు. అందుకే, ఇప్పుడు తాను కోర్టులో చెప్పినట్టే స్పీకర్ కి సారీ చెప్పిందంటున్నారు. ఆమె రాసిన లేఖ అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి చేరిందట! అందులో రోజా బేషరతుగా స్పీకర్ కి, సభకి, అలాగే, టీడీపీ ఎమ్మేల్యే అనితకి కూడా సారీ చెప్పిందట! తొలిసారి సభలో కాలుపెట్టడం వల్లనో, లేక బయట జరిగే ప్రెస్ మీట్లకి, లైవ్ ప్రొసీడింగ్స్ కి తేడా తెలియకపోవటం వల్లనో రోజా నోరు జారింది. ఫలితంగా అమూల్యమైన కాలాన్ని కోల్పోవలసి వచ్చింది. ఇప్పటికైనా సారీ చెప్పింది కాబట్టి శాసన సభ స్పీకర్ క్షమించాలని ఆశిద్దాం. ఆమెను సభకి పంపిన జనం తరుఫున రోజా గళమెత్తాలని కోరుకుందాం. ఇక మీదైనా ఆమె తన దూకుడు తగ్గించి జనం సమస్యల గురించి మాట్లాడుతూ పరిణతి ప్రదర్శిస్తుందనే అనుకుందాం. ఎందుకంటే, సంచలన వాఖ్యలు అప్పటికప్పుడు మీడియాలో గరంగరంగా వినిపిస్తాయి కాని... దీర్ఘ కాలంలో సదరు రాజకీయ నేత భవిష్యత్ కే ప్రమాదంగా పరిణమిస్తాయి! ఈ సత్యం ఈ పాటికే వైసీపీ ఎమ్మేల్యేకి బోధపడి వుంటుంది...
http://www.teluguone.com/news/content/ysrc-nagari-mla-roja-45-65939.html





