ఆమె గెలిచింది... ఊరు మెరిసింది!
Publish Date:Sep 2, 2016
Advertisement
ఒక్క గెలుపు... ఒకే ఒక్క గెలుపు... మొత్తం జీవితాన్నే మార్చేస్తుంది! అవును... ఒలంపిక్స్ లో స్వర్ణం గెలిస్తే జీవితం మారిపోక మరేం అవుతుంది? అమాంతం మొత్తమంతా మారిపోతుంది! మన దేశంలో అయితే కాంస్యం, రజతం గెలిచినందుకే కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటారు. కోట్లు గుమ్మరించి సత్కారాలు చేసి రాత్రికి రాత్రి క్రీడకారుల్ని 'గొప్పొళ్ల'ని చేసేస్తారు! కాని, ఆ కెన్యా దేశపు బంగారు కన్య తాను కోటీశ్వరురాలు కావాలనుకోలేదు. తన ఊరే ముఖ్యమనుకుంది! ఇలాంటి సిన్సియర్ ప్లేయర్స్ మన దేశంలోనూ వుంటే ఎంత బావుండు కదా అనిపిస్తుంది ఆమె ఇన్ స్పిరేషనల్ స్టోరీ వింటే... ఫెయిత్ కిపీగాన్.... ఈ పేరుతో ఒక అథ్లెట్ రియోలో పరుగు పందెంలో పాల్గొన్నదని మనకు తెలియకపోవచ్చు. కాని, పాల్గొనటమే కాదు ప్రపంచ నెంబర్ వన్ రన్నర్ ని ఓడించి స్వర్ణం కూడా గెలుచుకుంది. ఆ తరువాత పరిణామాలన్నీ మనం ఊహించుకోవచ్చు. ఫెయిత్ తిరిగి తన దేశం వెళ్లగానే ప్రధాని సహా అందరూ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతారు. ప్రైజ్ మనీ ప్రకటిస్తారు. ఫెయిత్ కష్టాలన్నీ తీరిపోతాయి. ఆమె తన నెక్ట్స్ ఛాంపియన్ షిప్ పై దృష్టి పెడుతుంది! ఇంతే అనుకుంటాం... బాగా పేద దేశమైన కెన్యాలో ఫెయిత్ పుట్టింది ఓ మారుమూలు కుగ్రామంలో. అది ఎంత పేద గ్రామం అంటే అక్కడ ఇప్పటికీ కరెంట్ వుండదు. టీవీల ప్రశ్నే లేదు. ఇక మిగతా విద్య, వైద్య సదుపాయాల్లాంటివి కూడా మాట్లాడుకోకపోవటమే మంచిది! అలాంటి చిరు గ్రామం నుంచి ఫెయిత్ తన పేరుకు తగ్గట్టుగానే విశ్వాసంతో విశ్వ వేదిక మీదకి దూసుకొచ్చింది! బంగారు పతకం గెలిచింది! ఫెయిత్ ఇంతకు ముందు ఎన్నో కూడా పతకాలు గెలిచింది. కానీ, అవేవీ ఆమె కుటుంబంతో సహా ఊరి వారు ఎవరూ టీవీల్లో చూడలేకపోయే వారు. కారణం కరెంట్ అన్నదే లేకపోవటం. కాని, ఒలంపిక్స్ విషయంలో అలా జరగటానికి వీలు లేదని నిశ్చయించుకుని ఫెయిత్ తండ్రి ఓ సాహసం చేశాడు. తనకు ప్రభుత్వం పేదలకిచ్చి రాయితీలు ఇవ్వనక్కర్లేదని, బదులుగా ఆ డబ్బుతో తమ ఊరికి కరెంట్ ఇవ్వమని కోరాడు. అప్పుడు విషయం తెలసుకున్న కెన్యా ప్రభుత్వం ఫెయిత్ స్వగ్రామానికి కరెంట్ ఏర్పాటు చేసింది. ఫైనల్స్ లో ఫెయిత్ స్వర్ణం గెలవటాన్ని ఊరంతా కళ్లారా చూసింది! మెడల్ గెలుచుకుని తిరిగొచ్చిన ఫెయిత్ ప్రైజ్ మనీ అందుకోటానికి తహతహలాడిపోలేదు. ఎవ్వరు తనని కలవాలన్నా తన ఊరికే రమ్మని చెప్పింది. దాంతో కెన్యా ప్రధాని కూడా ఫెయిత్ వాళ్ల చిరు పల్లెటూరికి రావాల్సి వచ్చింది. అప్పుడు ఆ ఊరి పరిస్థితే మారిపోయింది! కరెంట్ వచ్చింది! ఇంటింటికి సామ్ సంగ్ వాళ్లు అందించిన ఎల్ సీడీ టీవీలు కూడా వచ్చాయి. ఇక మీదట ఫెయిత్ ప్రపంచంలో ఎక్కడ పోటీలో పాల్గొన్నా ఆ ఊరి జనం సగర్వంగా టీవీల్లో చూసుకోగలరు! తన విజయంతో తన జీవితంలో కొత్త వెలుగులు సంతరించుకోవటం ఎవరైనా చేస్తారు! కాని, ఫెయిత్ లాగా... తన విజయాన్ని తన ఊరిలో కొత్త వెలుగులు తీసుకొచ్చేందుకు వాడటం... నిజంగా అద్భుతమే!
http://www.teluguone.com/news/content/faith-kipyegon-45-65949.html





