రోజాకి ఎర్త్ రెడీనా..?
Publish Date:Aug 4, 2017
Advertisement
గత ఎన్నికల్లో చేసిన తప్పులను సరిదిద్దుకొని రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం అందుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆచరణ సాధ్యమయ్యే హామీలు, అభ్యర్థులుగా పట్టున్న నేతల ఎంపిక తదితర అంశాలపై ఆయన పెద్ద కసరత్తే చేస్తున్నారని లోటస్ పాండ్ టాక్. అంతేకాదు హద్దులు దాటి ప్రవర్తించే నేతలకు తనదైన శైలిలో స్వీట్ వార్నింగులు ఇస్తున్నారట జగన్. దీనిలో భాగంగా మరీ దూకుడుగా వెళ్తున్నావు..కాస్త స్పీడు తగ్గించుకో అని వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాను సున్నితంగా మందలించారట జగన్. దీనిపై ఆమె మనస్తాపం చెందారని అందుకే విశాఖలో జరిగిన పార్టీ కార్యక్రమంలో రోజా పాల్గొనలేదని వార్తలు వచ్చాయి. అదే ఊపులో రోజా వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీ లేదా జనసేనలోకి వెళ్లేందుకు సిద్దమయ్యారంటూ పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత వాటిని రోజా ఖండించడం..తాను చివరి వరకు జగనన్నతోనే ఉంటానని చెప్పిందనుకోండి అదే వేరే విషయం. ఇంత జరిగినా రోజా నోరు అదుపులో పెట్టారా..? అంటే లేదని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ టార్గెట్‌గా విమర్శలు చేస్తూ వస్తున్న రోజా సీఎం మనవడు చిన్నారి నారా దేవాన్ష్‌ను సైతం వదలకపోవడంతో నెటిజన్లు ఆమెపై విరుచుకుపడుతున్నారు. దీనికి తోడు ఓ పక్క గోదావరి జిల్లాల ప్రజలను ఆకట్టుకునేందుకు జగన్ కిందా మీద పడుతూ పవన్ కళ్యాణ్‌ను ఎలా మచ్చిక చేసుకోవాలా అని వ్యూహాలు రచిస్తుంటే..మరో పక్కన రోజా అదే పవన్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది..ఈ వ్యాఖ్యలను పవన్ గానీ ఆయన ఫ్యాన్స్ గానీ సీరియస్‌గా తీసుకుంటే జగన్ మళ్లీ అధికారం దూరం కావడం ఖాయం. ఇప్పటికే స్పీకర్‌ను, తోటి శాసనసభ్యులను కామెంట్స్ చేయడంతో ఆమె అసెంబ్లీ నుంచి ఏడాది సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ చర్య ప్రజల్లో వైసీపీకి ఉన్న ఇమేజ్‌ను బాగా దెబ్బతీసింది. అందుకే వైసీపీ ఫైర్‌బ్రాండ్‌గా రోజా ప్రాధాన్యతను తగ్గించి మరొకరిని తెరమీదకు తీసుకురావాలని జగన్ భావించారు. ఆ మరొకరే సినీ నటి హేమ. అమ్మ, అక్క, వదిన పాత్రలతో మంచి పేరు తెచ్చుకున్న హేమకు రాజకీయాల్లో రాణించాలనే కోరిక బలంగా ఉంది. దీనిలో భాగంగా గత ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మా ఎన్నికల్లో హేమ మామూలు హడావిడి చేయలేదు. హేమ ఎంట్రీతో అవి సార్వత్రిక ఎన్నికలను తలపించాయి. తదనంతర కాలంలో కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపారు. కాపు సామాజిక వర్గంతో పాటు గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తి కావడంతో జగన్ ఆమె రాకకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారని అతి త్వరలో హేమ వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.
http://www.teluguone.com/news/content/ysr-congress-party-45-76825.html





