నీట్ వివాదంలోకి డీఎస్సీని లాగేందుకు వైసిపి యత్నం.. వర్కౌట్ అయ్యేనా?
Publish Date:Jul 23, 2026
Advertisement
దేశవ్యాప్తంగా ప్రస్తుతం నీట్ లీకేజీ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీ వీధుల నుంచి మొదలైన విద్యార్థుల నిరసన జ్వాలలు దేశమంతటికీ వ్యాపించాయి. తమ భవిష్యత్తు, విద్యా హక్కుల రక్షణ కోసం లక్షల మంది విద్యార్థులు, యువత రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారు. ఎలాంటి జకీయ ప్రమేయం లేకుండా, విద్యార్థుల హక్కుల కోసం సాగుతున్న ఈ పోరాటానికి జనబాహుల్యం నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఇక్కడే.. ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వైసిపి పిలుపునిచ్చింది. ఈ ర్యాలీల్లో విద్యార్థులు, నిరుద్యోగ యువత, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరింది. వైసిపి ప్రధానంగా మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నీట్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తోంది. నీట్ వివాదంతో డీఎస్సీని ముడిపెట్టడం ద్వారా యువతలో ఆందోళన రేకెత్తించి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. నీట్ పరీక్షల తీవ్రతకు, ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ అంశానికి అసలు పోలికే లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భవిష్యత్తుతో ముడిపడిన నీట్ వ్యవహారం జాతీయ మీడియాలో, సుప్రీం కోర్టులో, పార్లమెంటులో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో వైసీపీ లేవనెత్తుతున్న ఏపీ డీఎస్సీ విషయంలో స్థానికంగా అంటే రాష్ట్రంలో కూడా పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదు. జాతీయ స్థాయిలో హోరెత్తుతున్న ఒక స్వచ్ఛంద విద్యార్థి ఉద్యమంలోకి, రాష్ట్రంలో కూడా ఎవరూ ప్రాధాన్యత ఇవ్వడానికి ముందుకు రాని డీఎస్సీ అంశాన్ని తీసుకురావాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నం వృధా ప్రయాసే, కాకుండా ఆ ప్రయత్నాలు వైసీపీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. YCP NEET Protests, AP Mega DSC Issue, YSRCP July 28 Rally
http://www.teluguone.com/news/content/ycps-attempt-to-drag-dsc-into-the-neet-controversy-25-226915.html




