కోట్ల విలువైన నగలు కొట్టేశాడు..ఒక్క టాటూతో అడ్డంగా దొరికాడు.!

Publish Date:Nov 16, 2026

Advertisement

సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!

ముఖానికి ముసుగు.. ఒంటినిండా నల్లటి దుస్తులు.. వేలిముద్రలు పడకుండా చేతులకు గ్లౌజులు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరక్కుండా పక్కా ప్లాన్. సుమారు 15 కిలోల బంగారం, వజ్రాభరణాలను క్షణాల్లో బ్యాగులో నింపుకుని పరారయ్యాడు. కానీ తాను చేసిన చిన్న పొరపాటు అతడి నేర సామ్రాజ్యాన్ని బయటపెట్టింది. చేతి మణికట్టుపై ఉన్న ఓ చిన్న టాటూ పోలీసులకు కీలక క్లూగా మారింది. తమిళనాడులోని మదురైలో జరిగిన ఈ భారీ నగల చోరీ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.

25 ఏళ్ల నిషాంత్ కృష్ణ.. ఓ గ్రాడ్యుయేట్. బైక్ ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తూనే యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, సినిమాల్లో చూపించినట్లుగా పక్కా ప్రణాళికతో భారీ దొంగతనానికి తెరతీశాడు. మదురై బైపాస్ రోడ్డులోని తనిష్క్ జ్యువెలర్స్‌ను టార్గెట్‌గా చేసుకున్నాడు. ఈ నెల 11వ తేదీ రాత్రి తన ప్లాన్‌ను అమలు చేశాడు.

మూడు గెటప్పులు.. మూడు సార్లు రెక్కీ.!

చోరీకి ముందే నిషాంత్ పక్కాగా రెక్కీ నిర్వహించాడు. సాధారణ కస్టమర్‌లా ఒక్కోసారి ఒక్కో గెటప్‌లో షోరూంకు వెళ్లాడు. ఆభరణాలు ఎక్కడున్నాయి? భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎక్కడి నుంచి లోపలికి వెళ్లొచ్చు? ఎలా బయటపడొచ్చు? ఇలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు. ఏ చిన్న ఆధారం కూడా వదలకూడదని ముందుగానే నిర్ణయించుకున్నాడు.

ఆ షోరూం ప్రారంభమై అప్పటికి కేవలం రెండు వారాలే అవుతోంది. దీపావళి సీజన్‌లో భారీగా వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో యాజమాన్యం భవన నిర్మాణం పూర్తికాకముందే కార్యకలాపాలు ప్రారంభించింది. లాకర్ గది నిర్మాణంలో ఉండటం, భద్రతా ఏర్పాట్లు పూర్తిస్థాయిలో లేకపోవడం నిషాంత్‌కు కలిసొచ్చాయి.

బ్యాగులో పట్టినంత బంగారమే టార్గెట్.!

ముఖానికి ముసుగు.. ఒంటినిండా నల్లటి దుస్తులు.. చేతులకు గ్లౌజులు ధరించి భవనం వెనుకవైపు ఉన్న ఇనుప చువ్వల సాయంతో పైకి ఎక్కాడు. మొదటి అంతస్తులోకి ప్రవేశించాడు. సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. కొన్ని కెమెరాలపై స్ప్రే కూడా చల్లాడు.

లాకర్లను తెరిచే ప్రయత్నం చేయలేదు. కేవలం డిస్‌ప్లేలో ఉంచిన ఆభరణాలనే టార్గెట్ చేశాడు. తనతో తెచ్చుకున్న డఫ్ బ్యాగులో పట్టినంత బంగారం, వజ్రాభరణాలను నింపుకున్నాడు. అప్పటికి ఆ అంతస్తులో సుమారు 42 నుంచి 43 కిలోల బంగారం ఉన్నట్లు సమాచారం. అయితే బ్యాగులో పట్టకపోవడంతో మిగిలిన ఆభరణాలను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.

నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ మార్గంలో ఏర్పాటు చేసిన తాడును ఉపయోగించి కిందికి దిగాడు. తాళాలు పగులగొట్టకుండా, ఆయుధాలు ఉపయోగించకుండా చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. మరుసటి రోజు షోరూంలో ఆభరణాలు కనిపించకపోవడంతో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి కోసం ఓ కస్టమర్ అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకున్న నగలు కూడా చోరీకి గురవడం నిర్వాహకులను కలవరపరిచింది.

పోలీసులకు చిక్కిన చిన్న టాటూ.!

కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు షోరూం పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ముసుగు ధరించిన దొంగ ద్విచక్రవాహనంపై మాడకుళం రోడ్డు వైపు వెళ్లినట్లు గుర్తించారు. అయితే అతడి ముఖం కనిపించకపోవడంతో గుర్తించడం కష్టంగా మారింది.

ఇదే సమయంలో షోరూం ప్రారంభోత్సవం రోజు నుంచి నమోదైన సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు మరోసారి పరిశీలించారు. ఓ యువకుడు మూడు వేర్వేరు సందర్భాల్లో షోరూంకు వచ్చినట్లు గుర్తించారు. అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో నిశితంగా పరిశీలించారు.

అప్పుడే పోలీసులకు ఓ కీలక విషయం కనిపించింది. రెక్కీ సమయంలో కనిపించిన యువకుడి చేతి మణికట్టుపై ఉన్న టాటూ.. చోరీ జరిగిన సమయంలో ముసుగు ధరించిన వ్యక్తి చేతిపై కనిపించిన టాటూతో సరిపోలింది. ముఖాన్ని దాచుకున్నా.. ఆ చిన్న గుర్తును మాత్రం దాచలేకపోయాడు. అదే పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారంగా మారింది.

ప్రియురాలి బైక్‌తోనే చోరీకి వెళ్లాడా.?

దర్యాప్తులో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. నిషాంత్ ఉపయోగించిన ద్విచక్రవాహనం ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మీనాక్షి నాచ్చియార్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఆమె కాల్ డేటాను పరిశీలించగా తిరుప్పూర్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ కీలకంగా మారింది.

చోరీ చేసిన నగల సమాచారాన్ని నిషాంత్ తన సొంత ఫోన్ నుంచి కాకుండా మరో వ్యక్తి ఫోన్ ద్వారా మీనాక్షికి చేరవేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా నగలను ఎక్కడెక్కడ దాచారో పోలీసులు గుర్తించారు. మదురైలోని మాడకుళం ప్రాంతంలోని ఇంటితో పాటు సమీపంలోని కొండ ప్రాంతంలో దాచిన సుమారు ఆరు కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

చోరీ తర్వాత తాను ధరించిన దుస్తులను పొలాల్లో తగులబెట్టినట్లు కూడా విచారణలో తేలింది. పోలీసులకు చిక్కకుండా పలుమార్లు మార్గాలు మార్చుకుంటూ వెళ్లినట్లు గుర్తించారు.

ప్రేయసి కోసం భారీ చోరీ చేశాడా.?

మీనాక్షి నిర్మించుకుంటున్న ఇంటికి డబ్బు అవసరమవడంతో నిషాంత్ ఈ భారీ చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మీనాక్షితో పాటు నిషాంత్ తండ్రి, ఆటో డ్రైవర్ సురేష్‌ను కూడా అరెస్టు చేశారు. చోరీ చేసిన సొత్తును దాచిపెట్టడంలో వీరి పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు ప్రధాన నిందితుడు నిషాంత్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతడి ఫోన్ సిగ్నల్స్ తొలుత మదురై సమీపంలోని తిరుప్పాలైలో, ఆ తర్వాత తిరుప్పూర్‌లో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పొల్లాచ్చి, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో తొమ్మిది ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి.

ఇంటి దొంగ హస్తం ఉందా.?

ఈ భారీ చోరీ వెనుక షోరూం భద్రతా లోపాలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చోరీ జరిగిన సమయంలో అలారం ఆఫ్‌లో ఉండటం, డిస్‌ప్లేలోని ఆభరణాలను రాత్రివేళ లాకర్లలో భద్రపరచకపోవడం, భవనం నిర్మాణం పూర్తికాకపోవడం వంటి అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. అలారం ఎందుకు ఆఫ్‌లో ఉందనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. షోరూం సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.

వాస్తవానికి ఈ నెల 5వ తేదీనే నిషాంత్ చోరీకి ప్రయత్నించినట్లు సీసీ కెమెరాల ద్వారా బయటపడింది. భవనంపైకి ఎక్కినప్పటికీ కుక్కలు తరమడంతో అప్పట్లో పారిపోయాడు. ఆ సమయంలో నగలు తీసుకెళ్లలేదు. అయినా షోరూం యాజమాన్యం భద్రతను మరింత పటిష్టం చేయకపోవడం మరోసారి చర్చకు దారితీసింది.

29 వరకు జ్యుడీషియల్ కస్టడీ..!

ఈ కేసులో అరెస్టయిన మీనాక్షి, సురేష్‌లను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వారికి ఈ నెల 29 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. వారిని మదురై సెంట్రల్ జైలుకు తరలించారు.

తొలుత సుమారు 30 కిలోల ఆభరణాలు చోరీకి గురైనట్లు అంచనా వేసినా, స్టాక్ పరిశీలన అనంతరం దాదాపు 15 కిలోల బంగారు, వజ్రాభరణాలు మాయమైనట్లు నిర్ధారించారు. ఇప్పటివరకు ఆరు కిలోల వరకు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ముఖాన్ని దాచుకుంటే తప్పించుకోవచ్చని.. సీసీ కెమెరాలకు చిక్కకుండా వ్యవహరిస్తే పోలీసులకు దొరకమని భావించిన నిషాంత్‌ను చివరకు అతడి చేతిపై ఉన్న చిన్న టాటూ పట్టించింది. కోట్ల విలువైన ఆభరణాల చోరీలో పెద్ద ప్లాన్ వేసినా.. ఓ చిన్న గుర్తు అతడి గుట్టును బయటపెట్టింది. ఇప్పుడు మిగిలిన నగలు ఎక్కడున్నాయి? నిషాంత్ ఎక్కడ దాక్కున్నాడు? ఈ భారీ చోరీలో ఇంకా ఎవరి పాత్ర ఉంది? అన్న ప్రశ్నలకు పోలీసుల దర్యాప్తులో సమాధానాలు రావాల్సి ఉంది.

మీకు నచ్చవచ్చు: హైదరాబాద్‌లో బిర్యానీ ప్రియులకు షాక్..భారీగా పెరిగిన ధరలు.!

మీకు నచ్చవచ్చు: ప్రేమించింది..చంపేయాలనుకుంది..ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి మాస్టర్ ప్లాన్.!

 

[ Tanishq Jewellery Robbery, Madurai Gold Theft, Nishanth Krishna, Meenakshi Nachiyar, 15 Kg Gold Theft, Jewellery Heist, Tattoo Clue, Madurai Police Investigation, Gold Robbery Case, CCTV Footage ]

By
en-us Political News

  
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
బంగారం ప్రియులకు ఇది నిజంగానే ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పవచ్చు
తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
హానీట్రాప్ ఉచ్చులో పడిన వాయుసేన అధికారి.. షాకింగ్ నిజాలు వెల్లడించిన ఛార్జ్‌షీట్.!
మినీ బస్‌ను ఢీకొన్న ట్రక్కు.. 23 మంది మృతి.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.