ఫ్యాన్ రెక్కలు విరిగిపోయినట్లేనా?.. వైసీపీ శ్రేణుల్లో ఆందోళన!
Publish Date:May 14, 2024
Advertisement
వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయా.. ఆ పార్టీ నమ్ముకున్న గూండాయిజం వైసీపీకి గులుపు ఉన్న స్థానాలలో కూడా ఓటమిని శాశించిందా? అంటే జనం ఔననే అంటున్నారు. పరిశీలకులు కంసుడి పతనానికి ముందు కనిపించిన శకునాలను నిన్నటి పోలింగ్ లో జరిగిన సంఘటనలతో పోలుస్తున్నారు. అధికారం తలకెక్కిన జగన్ తల్లి, చెల్లిని దూరం చేసుకున్నారు. వైసీపీ విజయానికి కారణమైన వైఎస్ బ్రాండ్ నూ వదిలించేసుకున్నారు. అన్నీ నేనే.. అంతా నేనే అన్న తీరులో విర్రవీగారు. అమలు చేస్తున్నానని చెప్పుకుంటున్న సంక్షేమ పథకాలు, బెదరించో, బతిమాలో, బెల్లించే తనకు అనుకూలంగా మార్చుకుని కీలక స్థానాలలో పోస్టింగులు ఇచ్చుకున్న కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల అండతో ఎన్నికల గండం గట్టెక్కేయొచ్చని భావించారు. అయితే ప్రజలు ఒక నిర్ణయం తీసుకుంటే.. అదే ఫైనల్. అరాచకాలు, దాష్టీకాలు ఏవీ పని చేయవు. ఏపీ ఎన్నికల వేళ అదే కనిపించింది. వైసీపీ మూకలు ఎంతగా హింసాకాండకు తెగబడితో జనం అంతకు రెట్టింపు పట్టుదలతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్ ల వద్ద గలాటా చేసి పోలింగ్ ప్రక్రియ తీవ్ర జాప్యం అయ్యేలా చేస్తే ఓటర్లు విసిగి వెనుదిరుగుతారని వైసీపీ భావించింది. అయితే వైసీపీ వ్యూహాలు, ఎత్తుగడలు ఓటేసి తీరాలి. రాష్ట్ర భవిష్యత్ బాగుండాలి అన్న ప్రజా సంకల్పం ముందు దిగదుడుపైపోయాయి. పైపెచ్చు వైసీపీ మూకలు ఎంతగా హింసాకాండతో చెలరేగిపోతే అంతగా జనంలో ఆ పార్టీ పట్ల ఏహ్యత పెచ్చరిల్లుతూ పోయింది. అందుకే రాత్రి పొద్దుపోయిన తరువాత కూడా వేల పోలింగ్ బూత్ లలో జనం వందల సంఖ్యలో క్యూలలో నిలుచుని తమ ఓటుహక్కు వినియోగించుకోవడం కనిపించింది. ఎన్నడూ లేని విధంగా వైసీపీ అభ్యర్థులే పోలింగ్ బూత్ లలో దౌర్జన్యాలకు తెగబడటం ఆ పార్టీపై, ఆ పార్టీ అభ్యర్థులపై జనాగ్రహాన్ని పెంచింది. తెనాలిలో ఓ పోలంగ్ బూత్‌లో స్వయంగా వైసీపీ ఎమ్మెల్యే ఓటరు చెంప మీద కొట్టిన సంఘటన అందుకు ప్రతిగా ఆ ఓటరు ఎమ్మెల్యే చెంప ఛెళ్లుమనిపించడం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగా వైసీపీ పరువును గంగలో కలిపింది. ఆ దెబ్బ ఆ ఎమ్మెల్యేకు కాదు వైసీపీకే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పోలింగ్ సమయంలో సంయమనంతో ఉండి, ఓటర్లను అభ్యర్ధించడం బదులు.. స్వయంగా ఓటర్లపైనే దాడులకు తెగబడుతున్న వైసీపీ నేతల అరాచకంపై ఓటర్లు తిరగబడ్డారు. మహిళలని కూడా చూడకుండా వారి తలలు పగలకొడుతున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో చూసిన ప్రజలు పోలింగ్ బూత్‌లలో వైసీపీపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అప్పటి వరకూ తటస్థంగా ఉన్న వారు కూడా వైసీపీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసేసుకున్నారు. గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య ఎస్సీ ఓటర్లపై దురుసుగా ప్రవర్తించడంతో, అక్కడి మహిళలు తిరగబడ్డారు. కాగా పోలింగ్ రోజున జరిగిన ఈ సంఘటనలు వైసీపీ అనుకూలురు కూడా ఓటేసే ముందు ఆలోచించుకునే పరిస్థితికి తీసుకువచ్చాయి. దీంతో వైసీపీ ఓట్లు కూడా పక్కదారి పట్టాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రశాంతతను కోరుకునే ఓటర్లను భయపెట్టి ఓటింగ్ కు దూరం చేయాలనుకున్న వైసీపీ వ్యూహం దెబ్బతింది. ప్రజాగ్రహంగా మారి వైసీపీకి గెలుపు ఆశలను ఆవిరి చేసేసింది.
http://www.teluguone.com/news/content/ycp-win-hopes-evaporated-39-175920.html