మర్రికి మళ్లీ హ్యాండ్.. కుప్పం నేతకు ఛాన్స్.. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు..
Publish Date:Nov 12, 2021
Advertisement
మాట తప్పను, మడమ తిప్పను అని అనటమే కానీ.. మాట మీద నిలబడటమే లేదు జగన్‌రెడ్డి. సీఎం అయ్యాక దాదాపు అన్నివిషయాల్లోనూ మాట తప్పుడే.. మడమ తిప్పుడే ఆయన నైజంగా మారింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కొందరు నేతలకు పదే పదే మొండిచేయి చూపిస్తున్నారు. తాజాగా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అభ్యర్థుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 50శాతం సీట్లు కేటాయించినట్లు చెప్పారు. 14 స్థానాల్లో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు 7 స్థానాలు, ఓసీలకు 7 స్థానాల్లో అవకాశం కల్పించినట్టు సజ్జల తెలిపారు. విజయనగరం జిల్లా నుంచి రఘురాజుకు ఛాన్స్ ఇచ్చారు. ఇక విశాఖపట్నం మేయర్ ఎన్నిక విషయంలో పార్టీపై అలకబూనిన వంశీకృష్ణ యాదవ్‌ను ఏకంగా పెద్దల సభకే ఎంపిక చేశారు. ఆయనతో పాటు విశాఖ జిల్లా నుంచి ఒరుదు కల్యాణిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి అనంత బాబు, కృష్ణా జిల్లా నుంచి తలశిల రఘురామ్, మొండితోక అరుణ్ కుమార్, గుంటూరు జిల్లా నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు, ప్రకాశం జిల్లా నుంచి మాధవరావు, అనంతపురం జిల్లా నుంచి వై.శివరామిరెడ్డి పేర్లు ప్రకటించారు. ఇక కుప్పంపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టున్నారు జగన్. కుప్పంకు చెందిన భరత్‌ను ఎమ్మెల్సీ రేసులో నిలిపి.. చంద్రబాబుపైకి ఉసిగొల్పే ఎత్తుగడ వేసినట్టున్నారు. ఇక, స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు కూర్పు మరోసారి వివాదాస్పదమవుతోంది. ఎప్పటి నుంచో ఎమ్మెల్సీ కోసం ఎదురుచూస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్ పేరు ఈసారి కూడా జాబితాలో లేదు. మాజీ ఎమ్మెల్యే, చిలకలూరిపేట ఇంఛార్జ్‌గా ఉన్న మర్రి.. మొదటి నుంచీ పార్టీ కోసం పని చేస్తున్నారు. 2019లో రజనీకి టికెట్ ఇచ్చేందుకు మర్రి రాజశేఖర్‌ను తప్పించారు. ఆ సమయంలో ఆయనను ఎమ్మెల్సీ చేసి, మంత్రిని కూడా చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. మాట అయితే ఇచ్చారు కానీ, అది నిలబెట్టుకునే పాపాన పోవడం లేదు. రెండున్నర ఏళ్లుగా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చిన ప్రతీసారీ.. ఆశావహుల జాబితాలో మర్రి పేరు బలంగా వినిపిస్తున్నా.. ఆ ఛాన్స్ మాత్రం ఇవ్వటం లేదు జగనన్న. బహుషా ఆయన కమ్మ కావటం వల్లేనేమో అంటున్నాయి వైసీపీ వర్గాలు.
http://www.teluguone.com/news/content/ycp-mlc-candidates-names-released-39-126265.html





