షర్మిల షాక్ తో వైసీపీలో వణుకు మొదలైందా?
Publish Date:Jan 5, 2022
Advertisement
ఒకప్పుడు ఆమె జగనన్న వదిలిన బాణం, కానీ, ఆమె ఇప్పుడు కాదు. ఇద్దరి మధ్య దూరం పెరగడమే కాదు, అగాధమే ఏర్పడిందని అంటున్నారు.అన్న జగన్ చెల్లీ షర్మిల మధ్య సాగుతున్నది అస్తుల తగువే కావచ్చును. కానీ, అది అక్కడితో ఆగలేదు. రాజకీయ విద్వేషంగా మారిన సంకేతాలు స్పష్టమవుతున్నాయి. నిజా నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, అన్నా చెల్లలి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి నెలకొందనే వార్తలు ప్రముఖంగా ప్రచారంలో ఉన్నాయి. అంతే కాదు, జగన్ రెడ్డికి వ్యతిరేకంగా షర్మిలా పావులు కడుపుతున్నారని, అన్న ఓడించడమే లక్ష్యంగా ఆమె ఏపీలోనూ కాలుపెట్టే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. ఈ నేపధ్యంలో వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ... ఎపీలోనూ పార్టీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన సంకేతాలు, వైసీపీ నేతలను కలవర పాటుకు గురి చేస్తున్నాయి. ఆమె ఇంకా పార్టీ పెడతాను అని అనలేదు. అందుకు సంబంధించి స్పష్టమైన ప్రకటన ఏదీ చేయలేదు.ఇటీవల ‘క్రిస్మస్’ సందర్భంగా ఇడుపులపాయ వేదికగా, అన్నా, చెల్లీ మధ్య తెరపై కొచ్చిన ఆస్తుల తగవు నేపధ్యంగా, విలేకరుల సమావేశంలో ఏపీలో పార్టీ పెడతారా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా..షర్మిల రాజకీయ పార్టీ అన్నప్పుడు ఎక్కడైనా పెడతాం.. అక్కడ పెట్టకూడదని ఏమైనా రూల్ ఉందా అంటూ, మర్మగర్భంగా ప్రశ్నకు ప్రశ్ననే సమాధానంగా ఇచ్చారు. అయినా, అంతమాత్రానికే, వైసేపీ నాయకులు కలవర పడి పోతున్నారు. కంగారు పడుతున్నారు. షర్మిలపోటీకి దిగితే, జగన్ రెడ్డి ప్రధాన ఓటు బ్యాంకులో చీలిక వస్తుంది. అందుకే, షర్మిల పార్టీ ప్రస్తావన రాగానే వైసేపీలో కలకలం మొదలైంది. ఈనేపధ్యంలో మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆసక్తికరంగా మారాయి. వైఎస్ షర్మిల ఎవరైనా.. ఎక్కడైనా పార్టీ పెట్టవచ్చంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఏపీలో పార్టీ పెడతానని షర్మిల చెప్పలేదని బాలినేని అన్నారు. అదంతా అసత్య ప్రచారం అంటూ తేలిగ్గా కొట్టేశారు. అంతవరకు ఓకే అయితే.. అయితే, అదే సమయంలో, మంత్రి బాలినేని, పాత చుట్టరికాలను పైకి తెచ్చారు. “షర్మిల వేరు మేము వేరు కాదు. మేమంతా ఒక్కటే కుటుంబం, వైయస్సార్ కుటుంబం” అంటూ వ్యాఖ్యనించారు. ఇక షర్మిల ఏపీలోనూ పార్టీ ఏర్పాటు చేస్తారా? రక్త సంబంధాన్ని కాదని జగన్ రెడ్డిని దెబ్బ తీయడమే లక్ష్యంగా పని చేస్తారా?అంటే , రాజకీయాల్లో రక్త సంబంధాలు పని చేయవని, అందుకు, జగన్ రెడ్డే సాక్షమని అంటున్నారు. అయన జైల్లో ఉన్న రోజుల్లో పార్టీని బతికించింది, తల్లి విజయమ్మ, సోదరి షర్మిల. షర్మిల పాదయాత్రతోనే వైసీపీ బతికి నిలిచింది. అయినా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి జరిగిందో.. ఏమి జరుగుతోందో కళ్ళముందే కనిపిస్తోంది. సో ... రాజకీయాల్లో ఎవరికి ఎవరూ ఏమీ కారు .. అధికారమే ముఖ్యం, అంటారు. అదే మరో మారు రుజువుతోంది.
అంటే, షర్మిల నిజంగానే, ఏపీలోనూ సొంత పార్టీ పెడితే, ఏమి జరుగుతుందో, అన్న భయం వైసేపీ నాయకుల్లో మొదలైందని అనుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే, చుట్టరికాన్ని అడ్డు పెట్టుకుని, షర్మిలను బుజ్జగించే ప్రయత్నాలకు మంత్రి బాలినేని శ్రీకారం చుట్టారని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/ycp-leaders-fear-for-sharmila-new-party-39-129694.html





