జగన్ ఇంటికి వైసీపీ కార్యకర్త పాదయాత్ర.. మరీ ఇంత అరాచకమా?
Publish Date:Oct 26, 2021
Advertisement
ఏపీలో పాలన అనేదే లేదు. కేవలం అరాచకం మాత్రమే. ఓవైపు అధికారులు.. మరోవైపు వైసీపీ పెద్దలు.. ఎవరి మాటా వినడం లేదు. ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, లబ్దిదారులు, అర్హుల ఎంపిక విషయంలో పార్టీ లీడర్లదే పెత్తనమంతా. అయితే, వైసీపీ కండువా కప్పుకున్న వారందరి మాటా చెల్లుబాటు కావట్లేదు. కొందరిదే హవా. క్రింది స్థాయి కార్యకర్తలను పట్టించుకునే వారే లేదు. పార్టీ ప్రముఖులే కాదు.. అధికారులు సైతం సామాన్యులను లెక్క చేయడం లేదంటున్నారు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఉద్యోగుల్లో ఉదాసీనత, బద్దకం, నిర్లక్ష్యం బాగా పెరిగిపోయాయని చెబుతున్నారు. ఇక లంచగొండితనం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తాజాగా జరిగిన ఓ ఘటన ఏపీలో అధికారుల ఓవరాక్షన్‌ను మరోసారి గుర్తు చేస్తోంది. కృష్ణా జిల్లా ధనియాలపేటకు చెందిన వైసీపీ కార్యకర్త పల్లపు శ్రీనివాసరావుకు అధికారుల చేతిలో చేదు అనుభవం ఎదురైంది. కుటుంబ సభ్యత్వ ధ్రువపత్రం కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు శ్రీనివాసరావు. యదావిధిగా లంచం అడిగారట అక్కడి అధికారులు. అదేంటి.. లంచం ఎందుకు? తాను వైసీపీ కార్యకర్తనని చెప్పారట. అయితే ఏంటి? ఎవరైనా సరే.. లంచం ఇస్తేనే పనవుతుందని ఆ ఆఫీసర్ నుంచి రిప్లై వచ్చింది. మనోడు షాక్. అధికార పార్టీ కార్యకర్తను తననే లంచం అడుగుతారా అంటూ గట్టిగా ప్రశ్నించారు. అధికారులు ఇంకా ముదురు కదా. అందుకే, శ్రీనివాసరావు ఎంత వాదించినా.. లంచం ఇస్తేనే పనవుతుందని తేల్చేశారు. ఒళ్లు మండిన ఆ వైసీపీ కార్యకర్త.. మీ సంగతి సీఎం జగన్ దగ్గరే తేలుస్తానంటూ పాదయాత్ర చేపట్టడం సంచలనంగా మారింది. లంచం అడిగారంటూ వైసీపీ కార్యకర్త పల్లపు శ్రీనివాసరావు కృష్ణా జిల్లా గుడివాడ నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లికి పాదయాత్ర చేపట్టారు. ‘అధికారుల నిర్లక్ష్యం.. లంచగొండితనం..సీఎం సారూ నాకు న్యాయం చేయండి..’ అంటూ ప్లకార్డు పట్టుకొని.. మెడలో వైసీపీ కండువా కప్పుకొని.. పాదయాత్రగా తాడేపల్లి ప్యాలెస్ వైపు వెళ్తున్న శ్రీనివాసరావు ఉదంతం ఏపీలో కలకలంగా మారింది. మరి, అవినీతికే బ్రాండ్ అంబాసిడర్ లాంటి సీఎం జగన్‌రెడ్డి.. అవినీతికి పాల్పడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటారా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.
http://www.teluguone.com/news/content/ycp-follower-doing-padayatra-to-jagan-house-against-correption-39-125202.html





