బోరుగడ్డను వైసీపీ వదిలించేసుకుంది!
Publish Date:Dec 10, 2025
Advertisement
వైసీపీలో జగన్ వినా మరే నేతకూ చోటు పదిలం కాదు. మనకు పనికిరాడు అనుకుంటే.. ఒక్క క్షణం ఆలోచించకుండా పక్కన పెట్టేస్తుంది. ఈ విషయం వైసీపీలో పలువురు నేతలకు అనుభవమే. తాజాగా ఆ పార్టీ బోరుగడ్డ అనిల్ కుమార్ ను వదిలించేసుకుంది. జగన్ అధికారంలో ఉండగా ఆయన అండ, వైసీపీ దన్ను చూసుకుని మనిషన్న వాడు మాట్లాడకూడని మాటలతో అప్పటి ప్రతిపక్ష తెలుగుదేశం నాయకులను దూషించిన వ్యక్తి బోరుగడ్డ అనిల్. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్, జనసేనాని పవన్ కల్యాణ్ లక్ష్యంగా ఇష్టారీతిగా మాట్లాడిన సంగతి తెలిసిందే. అంతే కాదు జగన్ ఆదేశిస్తే చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని హతమారుస్తానంటూ కూడా బోరుగడ్డ అనిల్ మాట్లాడారు. గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత.. బోరుగడ్డ అనిల్ కు కష్టాలు మొదలయ్యాయి. కేసులు చుట్టుముట్టాయి. అరెస్టై జైలుకు వెళ్లి వచ్చాడు కూడా. జైలుకు వెళ్లిన సమయంలోనూ, ఆ తరువాత బయటకు వచ్చి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోనూ కూడా బోరుగడ్డ అనిల్ పదేపదే తనకు జగన్ అండ ఉందని చెప్పుకొచ్చారు. మాటకు ముందొక జగన్, మాటకు వెనకొక జగన్ అంటూ జగన్ భజన చేసిన బోరుగడ్డ అనిల్ ను సహజంగానే వైసీపీ వ్యక్తే అని అంతా భావించారు. బోరుగడ్డ అనిల్ కూడా అలానే చెప్పుకొచ్చారు. అన్నిటికీ మించి వైసీపీ అధికారంలో ఉండగా, చంద్రబాబు, లోకేష్, పవన్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మౌనంగా ఉండటం ద్వారా వైసీపీ అతడుమావాడే అనే సంకేతాలు ఇచ్చింది. అయితే అధికారం కోల్పోయిన తరువాత బోరుగడ్డ జైలుకు వెళ్లిన సందర్భంలో వైసీపీకి చెందిన వారెవరూ కూడా బోరుగడ్డను పరామర్శించ లేదు. సరే బోరుగడ్డ జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా తన వైఖరి మార్చుకోలేదు. నేతలపై అనుచిత వ్యాఖ్యలను మానలేదు. అదే సమయంలో తనకు జగన్ అండ ఉందనీ, తాను వైసీపీయుడనేననీ చెప్పుకుంటున్నాడు. అయితే జగన్ మాత్రం ఎవరైనా తనకు బలంగా ఉండాలి కానీ, తన బలం అండగా భావించకూడదు. వివాదాస్పద దర్శకుడు గతంలో తీసిన శివ అనే సినిమాలో విలన్ . ఎవరైనా మనకు బలం కావాలి కానీ మన బలంతో బతకకూడదు అనే డైలాగ్ చెబుతాడు. సరిగ్గా జగన్ తీరు కూడా అంతేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ పదే పదే జగన్ పేరు వల్లిస్తూ, తనకు జగన్ అండ ఉందని చెప్పుకోవడం జగన్ కు, వైసీపీకీ నచ్చలేదు. దీంతో జగన్ పేరు చెప్పుకుంటూ తిరుగుతున్న బోరుగడ్డ అనల్ ను వైసీపీ వదిలించేసుకుంది. పార్టీకీ బోరుగడ్డ అనిల్ కు ఏం సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. బోరుగడ్డ అనిల్ కుమార్ తో వైసీపీకి ఎటువంటి సంబంధం లేదని ప్రకటన విడుదల చేసింది. అతడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఇటీవల కొన్ని మీడియా ఇంటర్వ్యూల్లోనూ, సోషల్ మీడియా వేదికలపై కనిపించడం చెప్పుకోవడాన్ని వైసీపీ ఖండిస్తోందని పేర్కొంది. దీనిపై బోరుగడ్డ ఇంకా స్పందించలేదు. కానీ పరిశీలకులు మాత్రం బోరుగడ్డతో వైసీపీ బంధం ఒక్క ఖండన ప్రకటనతో తీరిపోయేది కాదంటున్నారు.
http://www.teluguone.com/news/content/ycp-distances-from-borugadda-39-210813.html





