రెండేళ్ల ముందే వైసీపీ చేతులెత్తేసిందా? జగన్ మూడేళ్ల పాలన సంబరాలెక్కడ?
Publish Date:May 30, 2022
Advertisement
జగన్ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టి సోమవారం (మే 30) నాటికి సరిగ్గా మూడేళ్లు అయ్యింది. మూడేళ్ల పాలన అదే సమయంలో జగన్ మూడేళ్ల రాక్షస పాలన అంటూ విపక్ష తెలుగుదేశం మాత్రం విమర్శలు గుప్పించింది. కనీసం విపక్ష విమర్శలను ఖండించడానికి కూడా వైసీపీ నేతలూ, ఎమ్మెల్యేలూ, మంత్రులూ, సలహాదారులు ఎవరూ ముందుకు రాలేదు. పార్టీలో అంతటా నిరాశ, నైరాశ్యం తాండవిస్తోంది. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం, సామాజిక న్యాయ భేరి పేరిట మంత్రుల బస్సు యాత్రలు పూర్తిగా విఫలం కావడం ఎక్కడికక్కడ ప్రజల నుంచి వ్యక్తమైన ఆగ్రహం, నిరసన వైసీపీ నేతలకు పార్టీ భవిష్యత్ ను కళ్లకు కట్టడం వల్లనే వారిలో ఈ నిర్లిప్తత, నైరాశ్యం అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీ పాలన మూడేళ్ల వార్షికోత్సవానికి స్వయంగా జగనే దేశంలో లేరు, పార్టీ పరంగా ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలూ నిర్వహించలేదు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలను భుజాన వేసుకుని చేసే క్యాడర్ లో ఆ ఉత్సాహమే కనిపించలేదు. ఎన్నికలకు రెండేళ్ల ముందే వైకాపా చేతులెత్తేసిందా అంటూ సామాజిక మాధ్యమంలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. విపక్షం అయితే రాష్ట్రంలో విధ్వంస పాలనకు మూడేళ్లు అంటూ విమర్శలు గుప్పించింది. వైసీపీ నుంచి తమ పార్టీ మూడేళ్ల పాలనకు సంబంధించి మాట్లాడటానికి ఎవరూ ముందుకు రాలేదు. అదే సమయంలో విపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రం అధినేత నుంచి పార్టీ అధికార ప్రతినిధుల వరకూ అందరూ మీడియా సమావేశాలు పెట్టి మరీ మూడేళ్ల వైసీపీ వైఫల్యాలను ఎండగట్టారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు జగన్ కు పాలించే అర్హత లేదంటూ నిప్పులు చెరిగారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జగన్ మూడేళ్ల పాలనను విద్వేషం, విధ్వంసం, విషాదంగా అభివర్ణించారు. పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జగన్ పాలనపై 1111 అంశాలతో చార్జిషీట్ విడుదల చేశారు. దేవినేని ఉమ, యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలా ఒకరనేమిటి తెలుగుదేశం నేతలందరూ జగన్ మూడేళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయ్యిందంటూ విమర్శలు గుప్పించారు. కనీసం విపక్షం విమర్శలను ఖండించడానికి కూడా వైసీపీ నేతలెవరూ ముందుకు రాలేదంటేనే పార్టీలో నైరాశ్యం ఎంతగా గూడు కట్టుకుందో అర్ధమౌతోందని పరిశీలకులు అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వంటి వారు మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేసినా వారెవరూ పార్టీ మూడేళ్ల పాలనలో సాధించిన విజయాల గురించి మాట్లాడలేదు. అనుచిత భాష ఉపయోగించి విపక్ష నేతలను దుర్భాషలాడేందుకే పరిమితమయ్యారు. వైసీపీలో ఈ పరిస్థితికి కారణం జగన్ స్వయంకృతాపరాధమేనని రాజకీయ పరిశీలకలు అంటున్నారు. ఒక వైపు విపక్షం దూకుడుగా ప్రజలలోకి వెళుతుంటే.. అధికార పార్టీ నేతలు మాత్రం ప్రజల ముందుకు రావడానికే జంకే పరిస్థితి రాష్ట్రంలో నెలకొనడానికి జగన్ తీరే కారణమని విశ్లేషిస్తున్నారు. ముందస్తు ఎన్నికలు అనివార్యమని భావిస్తున్న వేళ, ఆ సంకేతాలను అధికార పార్టీయే ఇస్తున్న వేళ వైసీపీలో ఈ నైరాశ్యం, నిర్లిప్తత ఆ పార్టీ నేతలలో తమ రాజకీయ భవిష్యత్ పై నెలకొన్న ఆందోళనే కారణమని అంటున్నారు. వైసీపీ క్యాడర్ లో కూడా పార్టీ కార్యక్రమాల పట్ల ఆసక్తి కరవైందనడానికి గడప గడపకూ, సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రలే నిదర్శనమని చెబుతున్నారు. వైసీపీ మూడేళ్ల నాడు ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చినా, ఇప్పుడు మూడేళ్ల తరువాత ప్రజాగ్రహంతో ప్రజలలోకి వెళ్లలేని పరిస్థితి దాపురించినా అంతా జగనే కారణం అని పార్టీ వర్గాలే అంటున్నాయి. నేను విన్నాను, నేను ఉన్నాను అని జగన్ అంటుంటే పార్టీ నేతలూ, క్యాడర్ అంతా జగనే చేశారు... ఆయనే చూస్తారు అని కాడె వదిలేస్తున్నారు.
పూర్తి చేసుకున్న సంబరాలు వైసీపీలో ఎక్కడా కనిపించడం లేదు. క్యాడర్ లోనూ జోష్ లేదు. అధికారంలో కొనసాగేందుకు మరో రెండేళ్లు గడువు ఉండగా అప్పుడే పరాజయం పాలయ్యామన్న నైరాస్యమే పార్టీలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నది. మూడేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఎక్కడా ఫ్లెక్సీలు లేవు. సంబరాలు లేవు, పత్రికల్లో ప్రకటనలు లేవు.. ఆఖరికి పార్టీ కేంద్ర కార్యాలయం కూడా కేవలం కేట్ కటింగ్ కే పరిమితమైంది.
http://www.teluguone.com/news/content/ycp-compketes-three-years-rule-where-are-celebrations-25-136707.html





