హిందుపురంలో తెలుగుదేశం జోరు.. మునిసిపాలిటీ వైసీపీ చేజారు!
Publish Date:Aug 17, 2024
Advertisement
అధికారం కోల్పోయిన తరువాత ఎక్కడికక్కడ వైసీపీ ఉనికి మాత్రంగా మిగులుతోంది. పార్టీ ఓటమి తరువాత ఒక్కరొక్కరుగా పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఇంకొంత మంది జగన్ కు ఓ దండం, ఆయన పార్టీకి ఇంకో దండం అని చెప్పి రాజకీయాలకే దూరం అయ్యారు. అలాగే ఇప్పటికే ఒంగోలు కార్పొరేషన్ ను కోల్పోయిన వైసీపీ రాష్ట్రంలోని మిగిలిన కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, పంచాయతీలలో కూడా గట్టి ఎదురు దెబ్బ తినడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే కుప్పంలో బలం కోల్పోయిన జగన్ పార్టీ, మాచర్లలో కూడా మటాష్ అయిపోయింది. తాజాగా అహిందుపురంలోనూ పట్టు కోల్పోయింది. బాలకృష్ణ సొంత నియోజకవర్గం అయిన హిందూపురంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. వైసీపీకి చెందిన హిందూపురం మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇంద్రజతో పాటు ఎనిమిది మంది కౌన్సిలర్లు వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. బాలకృష్ణ సమక్షంలో వీరంతా తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. హిందూపురం మున్సిపాలిటీలో మొత్తం 38 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో 30 మంది వైసీపీ, ఆరుగురు టీడీపీ, బీజేపీ, ఎంఐఎం తరపున ఒక్కొక్కరు గెలుపొందారు. వీరిలో అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే ఇద్దరు వైసీపీ, ఒక ఎంఐఎం కౌన్సిలర్లు తెలుగుదేశం గూటికి చేరారు. ఇప్పుడు మరో 9 మంది చేరడంతో హిందూపురం మునిసిపాలిటీలో తెలుగుదేశం బలం 19కి చేరింది. మరో కౌన్సిలర్ కూడా వైసీపీ గోడ దూకేస్తే హిందుపురం మునిసిపాలిటీ తెలుగుశం వశం అవుతుంది. అలా గోడ దూకి తెలుగుదేశం గూటికి చేరడానికి ఇంకా పలువురు కౌన్సిలర్లు సిద్ధంగా ఉన్నారు. బాలకృష్ణ పచ్చ జెండా ఊపిన మరు క్షణం వారంతా తెలుగుదేశంలో చేరడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న బలాబలాలను చూసినా ఎంపీ, ఎమ్మెల్యేల ఓట్లు కూడా కలుపుకుంటే హిందుపురంలో తెలుగుదేశం పార్టీ బలం ఇప్పటికే 21కి చేరింది. దీంతో హిందుపురం మునిసిపాలిటీలో తెలుగుదేశం జెండా ఎగరడం లాంఛనమే అని చెప్పొచ్చు.
http://www.teluguone.com/news/content/ycp--losing-25-183120.html





