వాడు నీవాడే.. కాదు నీవాడే..!
Publish Date:Aug 17, 2024
Advertisement
బీఆర్ఎస్ పార్టీకి ఇంత నీచ నికృష్టమైన రోజులు వస్తాయని కేసీఆర్ ఏనాడూ ఊహించి వుండరు. కేసీఆర్ వరకూ ఎందుకూ.. బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళు కూడా ఊహించి వుండరు. ఎందుకంటే, బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం అయిపోవడం కంటే ఇంకా ఎక్కువగానే నాశనమైపోయింది. ఎంతగా నాశనమైపోయిందంటే, కొనేవాళ్ళ కోసం ఎదురుచూస్తున్న అంగట్లో సరుకు మాదిరిగా అయిపోయింది. మార్కెట్లో వున్న ‘బీఆర్ఎస్’ అనే ఈ సరుకు నీదే.. కాదు నీదే అని కాంగ్రెస్, బీజేపీ స్టేట్‌మెంట్లు ఇస్తున్నాయి. ‘దసరాబుల్లోడు’ సినిమాలో వాణిశ్రీ, చంద్రకళ ‘‘వాడు నీవాడే.. వాడు వాడు నీవాడే’’ అని పాడుకుంటుంటే, మధ్యలో ఏం చెప్పాలో అర్థంకాకుండా వున్న అక్కినేని నాగేశ్వరరావులా బీఆర్ఎస్ పార్టీ మిగిలిపోయింది. కాంగ్రెస్, బీజేపీ పరస్పరం ‘బీఆర్ఎస్’ మీ పార్టీలోనే కలసిపోతోంది అని ఆరోపించుకుంటూ వుంటే, మధ్యలో వున్న బీఆర్ఎస్ నేను ఏ పార్టీలోనూ కలవను అని చెప్పలేక బిక్కముఖం వేసుకుని దిక్కులు చూస్తోంది. బీఆర్ఎస్ పార్టీ త్వరలో బీజేపీలో విలీనం కాబోతోందని తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో చెబుతున్నారు. తాజాగా ఆయన మరింత లోతుగా సమాచారాన్ని ఇచ్చారు. ఆయన చెప్పినదాని ప్రకారం, అతి త్వరలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోంది. ఆ సందర్భంగా బీజేపీ కొన్ని కానుకలు ఇవ్వబోతోంది. కేసీఆర్‌కి గవర్నర్ పదవి, కేటీఆర్‌కి కేంద్రమంత్రి పదవి ఇస్తారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కుని ప్రస్తుతం తీహార్ జైల్లో వున్న కవితకు ఆ కేసు నుంచి విముక్తి కల్పించడంతోపాటు రాజ్యసభ సభ్యత్వం కూడా ఇస్తారు. అలాగే హరీష్‌రావు తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అవుతారు. ఇలా అకౌంట్ సెటిల్ చేస్తారు. రేవంత్ రెడ్డి చెబుతున్నది ఇలా వుంటే, కేంద్ర మంత్రి బండి సంజయ్ చెబుతున్న ఇన్ఫర్మేషన్ మరోలా వుంది. ఆయన చెబుతున్నదాని ప్రకారం... బీఆర్ఎస్ పార్టీ త్వరలో కాంగ్రెస్ పార్టీలో విలీనం అవబోతోంది. అప్పుడు కేసీఆర్‌కి ఏఐసీసీలో సభ్యత్వం ఇస్తారు. కేటీఆర్‌కి పీసీసీ చీఫ్ పదవి ఇస్తారు. కవితకి ఎంపీ పదవి ఇస్తారు... బీఆర్ఎస్ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ ఈ రకంగా స్టేట్‌మెంట్లు ఇస్తున్నా బీఆర్ఎస్ నాయకులు మాత్రం అవునూ, కాదూ అనడం లేదు. అంటే, బీఆర్ఎస్ ఏ పార్టీలో అయినా విలీనం కావడానికి సిద్ధంగా వుందనే సంకేతాలు వస్తున్నాయి. ఏ పార్టీ ఆఫర్ చేసే ప్యాకేజ్ బాగుంటే అందులోకి వెళ్ళడానికి ఆలోచిస్తున్నట్టు భావించాల్సివస్తోంది.
http://www.teluguone.com/news/content/brs-merge-issue-25-183124.html





