ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి.. ఆటో డ్రైవర్‌గా మారిన మహిళ.. సంపాదన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Publish Date:May 30, 2026
Advertisement
ప్రస్తుత రోజుల్లో సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం అంటే సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఐటీ కొలువు వస్తే జీవితం స్థిరపడినట్లేనని చాలా మంది భావిస్తారు. అయితే, అదే ఐటీ రంగానికి చెందిన ఒక మహిళ తన తొమ్మిదేళ్ల వైట్ కాలర్ ఉద్యోగానికి ఊహించని విధంగా గుడ్ బై చెప్పేసింది. సమాజం ఏమనుకుంటుందో అనే సంకోచాలు పెట్టుకోకుండా, పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉండే ఆటోమొబైల్ రంగాన్ని ఎంచుకుని ప్రస్తుతం ఆటో డ్రైవర్‌గా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఆసక్తికరమైన సంఘటనకు సంబంధించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఒక ప్రముఖ కంపెనీకి చెందిన సీఈఓ నెజ్రీన్ మిధ్లాజ్ తన ప్రయాణంలో భాగంగా ఈ మహిళా ఆటో డ్రైవర్‌ను కలిశారు. అమె కట్టుబొట్టు, మాట్లాడే విధానంలో కనిపించిన అపారమైన ఆత్మవిశ్వాసాన్ని చూసి ముచ్చటపడిన సదరు సీఈఓ, ఆమె విజయగాథను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఐటీ కంపెనీల్లో పని గంటలు, డెడ్‌లైన్లు, నిరంతర ఆన్‌లైన్ మీటింగ్‌ల వల్ల ఉద్యోగులపై మానసిక ఒత్తిడి తీవ్రంగా పెరుగుతోంది. ఈ మహిళ కూడా గత తొమ్మిది సంవత్సరాలుగా సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తూ అదే రకమైన కార్పొరేట్ ప్రెజర్‌ను ఎదుర్కొంది. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ పూర్తిగా దెబ్బతినడంతో, ఎంత డబ్బు సంపాదించినా మనశ్శాంతి కరువైందని భావించి ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టేయాలని గట్టి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆమె ఆటో నడుపుతూ నెలకు ఏకంగా రూ.60,000 వరకు సులభంగా సంపాదిస్తోంది. గతంలో కంటే ఆర్థికంగా స్థిరపడటమే కాకుండా, తన ఇష్టానుసారంగా పని వేళలను కేటాయించుకునే స్వేచ్ఛ దొరికిందని ఆమె సంతోషంగా చెప్తోంది. సమాజంలో లభించే హోదా కంటే మానసిక ప్రశాంతత, సంతోషకరమైన జీవితమే ముఖ్యమని భావించి ఆమె తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కార్పొరేట్ ప్రపంచంలోని యాంత్రిక జీవన విధానంపై విసిగిపోయిన ఎంతో మంది ఐటీ ఉద్యోగులు ఈ పోస్టుకు స్పందిస్తూ తమ అభిప్రాయాలను రాసుకొస్తున్నారు. "తాము కూడా గత కొన్నేళ్లుగా రాత్రి వేళల్లో క్లయింట్ కాల్స్, ప్రొడక్షన్ సమస్యలతో సతమతమవుతున్నామని, అయితే ఈమె లాగా ధైర్యం చేసి బయటకు రాలేకపోతున్నామని" కొందరు నెటిజన్లు వాపోతున్నారు. మరికొందరు మాత్రం, ఎలాంటి సంకోచం లేకుండా సమాజం ఏమనుకుంటుందో అనే భయాలను వీడి, గౌరవప్రదమైన రీతిలో స్వయం ఉపాధిని ఎంచుకున్న ఈ మహిళ నిజమైన రోల్ మోడల్ అని కొనిడుతున్నారు. రాబోయే రోజుల్లో మహిళలు కేవలం సాఫ్ట్‌వేర్ లేదా డెస్క్ ఉద్యోగాలకే పరిమితం కాకుండా, తమకు నచ్చిన రంగాల్లో స్వతంత్రంగా రాణించేందుకు ఇలాంటి విజయగాథలు గొప్ప స్ఫూర్తినిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/woman-quits-it-job-36-221306.html





