తికాయత్ పై తిరుగుబాటు.. బీకేయూలో చీలిక.. సాగు చట్టాలకు లైన్ క్లియర్ అయినట్లేనా?
Publish Date:May 16, 2022
Advertisement
రాకేశ్ తికాయత్ పరిచయం అవసరం లేని రైతు నాయకుడు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన, మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో సంవత్సరం పైగా ఆందోళన నిర్వహించిన, భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధికార ప్రతినిధి. ఉద్యమ నాయకుడు. తికాయత్ సారధ్యంలో సాగిన ఆందోళనకు కేంద్ర ప్రభుత్వమే దిగి వచ్చింది. ఉత్తర ప్రదేశ్, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, స్వయంగా,సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించారు. రైతులకు క్షమాపణలు చెప్పారు. తికాయత్ డిమాండ్’కు తలొగ్గి మోడీ ప్రభుత్వం పార్లమెంట్’లో మూడు చట్టాలను ఉపసంహరించుకుంది.ఎన్నిక గండం గట్టేక్కేందుకు అదొక ఎత్తుగడే అయినా, కేంద్ర ప్రభుత్వం మెదలు వచండం మాములు విషయం కాదు. అయితే, మహేంద్ర సింగ్ తికాయత్ కుమారుడిగా రైతు ఉద్యమ నాయకత్వాని వారసత్వంగా పొందిన రాకేష్ తికాయత్’ ముందు నుంచి కూడా అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు.ఆయన పేరుకు రైతు నాయకుడే అయినా, రాజకీయాలను వంట పట్టించుకున్నారు. రాజకీయ పార్టీలతో అంటకాగుతూనే ఉన్నారు.ఢిల్లీ ఆందోళన సమయంలోనూ ఆయనపై రాజకీయ పార్టీలతో అంటకాగుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీల ఆర్థిక సహకారంతోనే ఆయన అంతకాలం పాటు, సర్వ సదుపాయాలతో, ‘ఫైవ్ స్టార్’ ఆందోళన సాగించారు అనే ఆరోపణలు వచ్చాయి. అదే విధంగా అంతర్జాతీయ వేర్పాటువాద శక్తులతోనూ ఆయనకు, ఉద్యమానికి సంబంధాలున్నాయని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు అవే ఆరోపణలు ఆయన నాయకత్వానికి సవాలుగా నిలిచాయి. బీకేయూ రెండుగా చీలిపోయింది.తికాయత్ సోదరులు రాకేశ్ తికాయత్, నరేష్ తికయత్ రాజకీయ పార్టీలతో అంటకాగుతూ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ, బీకేయూ జాతీయ ఉపాధ్యక్షుడు రాజేశ్ సింగ్ చౌహాన్, రాజకీయాలకు అతీతంగా రైతులకోసమే పనిచేసే భారతీయ కిసాన్ యూనియన్ (ఎ-అపొలిటికల్) సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ‘రైతు సంఘమైన బీకేయూ ఏ రాజకీయ పార్టీ కోసం పని చేయరాదనేది సంఘం మౌలిక సిద్ధాంతం’ అయితే రాకేశ్ తికాయత్’ గీత దాటారు, ‘రాజకీయ క్షేత్రం’లోకి దూసుకుపోయారు. రైతుల సమస్యలపై దృష్టిపెట్టడం లేదు, అందుకే వేరుగా సంఘం పెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. అంతే కాకుండా, తికాయత్ సోదరులు, మొదటినుంచి కూడా, రాజకీయ పార్టీల చేతిలో పావులుగా పనిచేస్తున్నారని. ఇది బీకేయూ మౌలిక సిద్ధాంతానికి విరుద్ధమని రాజేశ్ సింగ్ చౌహాన్ పేర్కొనారు. అందుకు తగ్గట్టుగానే, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో, తికాయత్ మమతా బెనర్జీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.ఆయన సోదరుడు, నరేశ్ తికాయత్ యూపీ ఎన్నికల్లో ఎస్‌పీ, ఆర్‌ఎల్డీ కూటమికి బహిరంగంగా మద్దతు తెలిపారు. అయినా తికాయత్ కు గట్టి పట్టుందని భావించే పశ్చిమ ఉత్తర ప్రదేశ్’లో కూడా బీజేపీ హవానే కొనసాగింది. అలాగే, ఎన్నికల అనంతరం, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేక కూటమికి ఆయన మద్దతు ప్రకటించారు. ఢిల్లీలో కేసేఆర్’ను కలిసిన ఒకరిద్దరు నాయకుల్లో తికాయత్’ ఒకరు కావడం విశేషం. అదలా ఉంటే, తికాయత్ సహజంగానే, చీలిక వెనక బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు. అది నిజమే కావచ్చును. ఎందుకంటే, ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయ ప్రత్యర్ధులను ఉపేక్షించే తప్పు చేయదు. అందులోనూ మోడీ, షా జోడీ అలాంటి తప్పు అసలే చేయదు. అందులోనూ, కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను తిరిగి తీసుకొచ్చే అలోచన చేస్తున్న వార్తలు వస్తున్న నేపధ్యంలో తికాయత్’ అడ్డు తొలిగించుకోవడం అవసరమని భావించవచ్చును. ఏమైనా, ఇంతకాలం రైతులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేసిన తికాయత్’ తాజా చీలిక పెద్ద ఎదురు దెబ్బగానే రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అంతే కాకుండా ఈ చీలిక, ఉత్తర ప్రదేశ్, మరీ ముఖ్యంగా పశ్చిమ ఉత్తర ప్రదేశ్’లో రాజకీయంగానే కాకుండా, సామాజికంగానూ ప్రభావం చూపుతుందని, అదే విధంగా దేశంలో రైతు ఉద్యమాలపై కూడా ఈ చీలిక ప్రభావం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.
ఈ నేపధ్యంలోనే రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ఏర్పడిన బీకేయూలో ఇలాంటి రాజకీయ వాసనలు తగవంటూ అందులోని ఓ వర్గం ఎంతో కాలంగా తీవ్రంగా నిరసిస్తూ వస్తోంది. చివరికి ఇది చిలికి చిలికి గాలివానగా మారి వేరు కుంపటికి దారితీసింది.అయితే రైతు ఉద్యమ అగ్ర నేత, రాకేశ్ తికాయత్ తండ్రి మహేంద్ర సింగ్ తికాయత్ వర్ధంతి (ఆదివారం) రోజునే బీకేయూలో మరో చీలిక రావడం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే గతంలోనూ బీకేయూలో చేలికలు వచ్చాయి. కానీ,గతంలో ఎప్పుడు లేని విధంగా తికాయత్’కు అత్యంత సన్నిహితులుగా ఉంటూవచ్చిన నాయకులు ఇప్పుడు ఆయనకు ఎదురు తిరిగారు.
http://www.teluguone.com/news/content/will-split-in-bku-clears-way-to-agri-laws-25-135935.html





