సోనియా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?
Publish Date:Aug 3, 2022
Advertisement
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చివరాఖరుకు కాంగ్రెస్ పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. గత కొంతకాలంగా ఇదే విషయంగా సాగుతున్న చర్చ పక్కదారి పడుతున్న నేపధ్యంలో ఇంకా లేట్ చేస్తే ఇంకెన్నో లోగుట్లు బయటపడే ప్రమాదం ఉందని, సో ..ఇంకా జాగుచేయడం మంచిది కాదని రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. రాజగోపాల రెడ్డి రాజీనామా ఖరారైన నేపధ్యంలో మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నిక అనివార్యమవుతుంది. వచ్చే ఆరు నెలలో ఎప్పుడైనా ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ లోగా ముఖ్యమంత్రి అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళితే తప్పించి, ఉప ఎన్నిక జరిగి తీరుతుంది. మరోవంక వచ్చే సంవత్సరం (2023) ద్వితీయార్ధంలో జరిగే శాసనసభ ఎన్నికల ముందు, జరిగే మునుగోడు ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాలలో ఒక కీలక మలుపు అవుతుందని, పరిశీలకులు భావిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక అధికార పార్టీ లెక్క తేల్చడంతో పాటుగా అనేక రాజకీయ భేతాళ ప్రశ్నలను సమాధానం ఇస్తుందని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా, తెరాసకు ప్రాధాన ప్రత్యర్ధి ఎవరో మునుగోడు తెల్చేస్తుంది. అందుకే, మూడు ప్రధాన పార్టీలు ఉప ఎన్నికలను అత్యంత కీలకంగా భావిస్తున్నాయి.యుద్ధానికి సిద్దమవుతున్నాయి. అలాగే, సోనియా గాంధీ సెంటిమెంట్ ను తెరమీదకు తెచ్చారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సోనియా గాంధీని విచారిస్తున్న సమయంలో రాజగోపాల రెడ్డి హోం మంత్రి అమిత్ షాతో బిజినెస్ డీల్ కుదుర్చుకున్నారని, ఫైర్ అయ్యారు. అంతే కాకుండా, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని తెలంగాణ తల్లిగా అభివర్ణిస్తూ, సోనియా సెంటిమెంట్ నే ఎన్నికల అస్త్రం చేసుకున్నారనే అభిప్రాయం కల్పించారు. అయితే రాష్ట్ర విభజన జరిగిన ఎనిమిది సంవత్సరాల తర్వాత, రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికలో పనిచేయని సోనియా సెంటిమెంట్ ఇప్పుడు ఈ ఉపఎన్నికల్లో పనిచేస్తుందా? అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా వుంది. అంతే కాకుండా గతంలో ఇదే సోనియా గాంధీని, బజారు భాషలో దూషించిన రేవంత్ రెడ్డి ఇప్పడు ఆమెను తెలంగాణ తల్లి అన్నా, ఇంకొకటి అన్నా, ప్రజలు ఎంతవరకు ఆమోదిస్తారు అనేది ప్రధాన ప్రశ్నగా వుంది. అయితే, మరో వంక మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడంతో కాంగ్రెస్‌కు ఈ ఉప ఎన్నికలో విజయం కీలకంగా మారిందన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి పట్టున్న జిల్లాల్లో ఒకటి. పార్టీ కున్న ముగ్గురు ఎంపీల్లో ఇద్దరు ఉమ్మడి నలోగొండ జిల్లా నుంచే ఎన్నికయ్యారు. ఇంకా అనేక మంది దిగ్గజ నేతలున్న జిల్లా నల్గొండ జిల్లా. అయినా జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సోదరుడు,ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి ఇలా కాంగ్రెస్ దిగ్గజ నేతలు ఎవరికీ, ఎన్నికల కమిటీలో స్థానం కల్పించకపోవడం పట్ల జిల్లా నాయకులు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. అందుకే, రాజగోపాల రెడ్డి రాజీనామా నిర్ణయం ప్రకటించిన వెంటనే రేవంత్ రెడ్డి పునరాలోచనకు అవకాశం లేకుండా రంగప్రవేశం చేశారు. నిజానికి గత వరం రోజులుగా సాగుతున్న రాజగోపాల రెడ్డి ఎపిసోడ్ లో రేవంత్ రెడ్డి ఎక్కడా ప్రత్యక్ష పాత్ర పోషించలేదు. కానీ, రాజగోపాల రెడ్డి రాజీనామా నిర్ణయం ప్రకటించిన వెంటనే మీడియా ముందుకొచ్చి ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారని పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా, పార్టీ సీనియర్ నాయకులు ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి దూకుడు బ్రేకులు వేసే సమయం వచ్చిందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక విధగా రేవంత్ రెడ్డి పార్టీని హైజాక్ చేస్తున్నారనే అభిప్రాయం పార్టీ సీనియర్ నాయకులు వ్యక్తపరుస్తున్నారు,ఈ పర్యవసాన ప్రభావం ఉపఎన్నికల పైనే కాకుండా, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ పై కూడా ఉంటుందని అంటున్నారు. ఈ నేపధ్యంలో రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ను కూడా మునుగోడు డిసైడ్ చేస్తుందని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే, రాజగోపాల రెడ్డి రాజీనామా ప్రకటించిన కొద్ది సేపటికే తెర మీదకు వచ్చారు. అంతేకాదు, అప్పటికప్పుడు, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ కన్వీనర్ గా ఎన్నికల కమిటీ ప్రకటించారు. అలాగే, ఎవరొచ్చినా, ఎవరు రాకున్నా, ఎన్నికల శంఖారావం పూరిస్తున్నామని, ఆగష్టు 5 న మునుగోడులో కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. అంతే కాకుండా, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా, కాంగ్రెస్ లో పుట్టిపెరిగిన వారికంటే, తనకే కాంగ్రెస్ పార్టీ పట్ల ఎక్కువ శ్రద్ధ ఉందని ప్రకటించుకునే ప్రయత్నం చేశారు.
నిజానికి జిల్లాకు రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకులే కాకుండా, కేంద్ర నాయకులు కూడా రాజగోపాల రెడ్డి పార్టీ రాజీనామా చేయకుండా చూసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ, రేవంత్ రెడ్డి, ఆయన వర్గానికి చెందిన నాయకులు మాత్రం, మొదటి నుంచి, రాజగోపాల రెడ్డి పార్టీ వదిలిపోతేనే మంచిందనే విధంగా వ్యవహరించారని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/will-sonia-centiment-workout-39-141151.html





