ప్రభాస్ ను రాముడిగా అంగీకరిస్తారా?
Publish Date:Jun 7, 2023
Advertisement
సీటు వదులుతారు సరే.. ప్రభాస్ రాముడంటే హనుమంతుడు నమ్మాలిగా! శ్రీరాముడు అనగానే మన తెలుగువారికి, అందునా సినీ ప్రియులకు ముందుగా నందమూరి తారక రామారావు గుర్తుకొస్తారు. అంతలా శ్రీరాముడి పాత్రలో పరకాయప్రవేశం చేశారు ఎన్టీఆర్. ఆయన సుందర రూపం, సుమధుర స్వరం ప్రేక్షకులను కట్టిపడేశాయి. రాముడంటే ఇలాగే ఉంటాడు అనుకునేలా చేశాయి. మనకు రాముడంటే ఎన్టీఆర్ పేరు గుర్తుకు రావడం ఎంత సహజమో.. నీలి వర్ణంలో మీసాలు గడ్డాలు లేని సుందర రూపంలో ఉన్న రాముని ముఖం కళ్ళముందు కదలాడటం కూడా అంతే సహజం. రాముడి రూపం ఇలాగే ఉంటుందని మన హృదయాల్లో బలమైన ముద్ర పడిపోయింది. అందుకే ఎన్టీఆర్ అనే కాదు.. రాముని పాత్ర ఎవరు పోషించినా మీసాలు గడ్డాలు లేకుండా నీలి వర్ణంలో సాధ్యమైనంత అందంగా కనిపించడానికి ప్రయత్నించారు. అయితే వారెవరూ ఎన్టీఆర్ని మైమరిపించలేకపోయారు. అలా అని వారు వేషధారణ విషయంలో విమర్శలు ఎదుర్కోలేదు. కానీ మొదటిసారి ఆ విమర్శలకు ఆస్కారం ఇచ్చాడు ప్రభాస్. ప్రభాస్ ఆరడుగుల అందగాడు. అయితే ఆరడుగులు ఉండి, అందంగా ఉన్నంత మాత్రాన శ్రీరాముడు అయిపోరు. ఆహార్యంలో, వాచకంలో, ఆంగికంలో అణువణువునా రాముడు కనిపించాలి. ప్రభాస్, శ్రీరాముడి పాత్ర పోషించిన 'ఆదిపురుష్' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ ఆ మూవీ ట్రైలర్స్ చూస్తుంటే నిజంగా ప్రభాస్, శ్రీరాముడి పాత్రే పోషించాడా అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే ఇందులో ఆయన మీసాలు, గడ్డాలతో ఓ రాజులా, ఓ యోధుడిలా కనిపిస్తున్నాడు. ప్రజలు రాముడిని రాజుగా కంటే దేవుడిగా చూడటానికే ఇష్టపడతారు. ఈ భూమ్మీద రాముడంత అందంగా మరెవరూ ఉండరనే భావన చాలామందిలో ఉంది. అదే ప్రభాస్ పాలిట శాపంగా మారింది. ట్రైలర్స్ లో చూస్తుంటే ఏదో బాహుబలి సెట్స్ నుంచి డైరెక్ట్ గా ఆదిపురుష్ సెట్స్ కి వచ్చి.. కాస్ట్యూమ్ మార్చుకొని విల్లు పట్టుకున్నట్టుగా ఉంది కానీ, రాముడి రూపంలో కనిపించడం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు అనిపించట్లేదు. పైగా డైలాగ్ డెలివరీ కూడా ఏదోలా ఉంది. స్వరంలో ఉండాల్సిన మాధుర్యం, సున్నితత్వం కరువయ్యాయి. ఏదో బాహుబలి ఊపిరి బిగబట్టి డైలాగ్ లు చెప్పినట్టుగా ఉంది. గతంలో రామాయణం ఆధారంగా ఎన్ని సినిమాలు వచ్చినా హంగు ఆర్భాటాలకు పోలేదు. పాత్రల ఆహార్యం, చిత్రీకరణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని.. ఆ గాధలో ఉన్న గాఢతను అర్థంచేసుకొని భావోద్వేగాల మీద చిత్రాలను నడిపిస్తూ అద్భుతంగా నడిపించారు. కానీ 'ఆదిపురుష్' ట్రైలర్స్ చూస్తుంటే ఇది రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమా అని స్వయంగా ప్రభాస్ చెప్పినా నమ్మలేకపోతున్నాం. ఏదో హాలీవుడ్ నుంచి యానిమేషన్ సినిమానో, సూపర్ హీరో సినిమానో తెలుగులో డబ్ అవుతుంది అనిపిస్తోంది. అలా అని గ్రాఫిక్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయనుకుంటే పొరపాటే. శాకుంతలంకి ఎక్కువ, బాహుబలికి తక్కువ అన్నట్టుగా ఉన్నాయి. రూపం రాముడిలా లేదు. హంగు ఆర్భాటాలు తప్ప ఇది రామాయణం అనే భావన కలగట్లేదు. మరి ఇలాంటి సినిమాతో ప్రభాస్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. పైగా ఆదిపురుష్ ప్రదర్శించే ప్రతి థియేటర్ లో హనుమంతుడి కోసం ఒక సీటు వదులుతాం అంటున్నారు. అసలు హనుమంతుడు థియేటర్ కి రావాలంటే అది రామాయణం అని, అతను రాముడు అని హనుమంతుడుకి అనిపించాలిగా. మీసాలు, గడ్డాలతో ఉన్న బాహుబలి రూపాన్ని చూసి ఈయన మా రాముడు కాదనుకొని థియేటర్ దాకా వచ్చి వెనక్కి వెళ్లినా ఆశ్చర్యంలేదు.
http://www.teluguone.com/news/content/will-people-accept-prabhas-as-rama-39-156486.html