ఇంట్రోవర్ట్ అంటే కామెడీ కాదు బాస్.. వారి బలాలు తెలిస్తే షాకవుతారు..!
Publish Date:Apr 14, 2026
Advertisement
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు. ఎక్స్ట్రోవర్ట్ లు అయితే బయటకు బాగా జాలీగా ఉంటూ, అందరిలో కలిసిపోతూ.. ఎక్కడైనా సరే ఇట్టే సర్దుకుపోయే స్వభావం కలిగి ఉంటారు. కానీ ఇంట్రోవర్ట్ లు అలా కాదు.. వారు ఎవరి ముందూ ఏమీ ఎక్కువ మాట్లాడలేరు, కనీసం కావలసిన వస్తువులు, అవసరమైన విషయాల దగ్గర కూడా వారు మాట్లాడలేకపోవడం వల్ల నష్టపోతూ ఉంటారు. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఈ కారణంగా ఇంట్రోవర్ట్ లను చాలా కామెడీ చేస్తుంటారు. వారు సిగ్గుపడుతూ ఉంటారని, మొహమాటం ఎక్కువని కూడా ఆటపట్టిస్తూ ఉంటారు. అయితే.. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే.. నాణేనికి మరొక వైపు కూడా ఉంటుంది. అదే ఇంట్రోవర్ట్ లలో ఉండే బలం. వారి వ్యక్తిత్వమే వారికి పెద్ద బలం అని చాలామంది కూడా అంటుంటారు. ఇంతకీ.. ఇంట్రోవర్ట్ లలో ఉండే బలాలు ఏంటో తెలుసుకుంటే.. ఒంటరితనం.. ఇంట్రోవర్ట్ లు ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడతారు. వారు ఒంటరిగా ఉన్నప్పుడు పునరుత్తేజం పొందుతారు. వారికి జనాల మధ్యలో ఉండటం అనే విషయం త్వరగా విసుగు తెప్పిస్తుంది. అయితే ఇలా ఒంటరిగా ఎక్కువ గడపడం వల్ల వారికి వారి మీద నమ్మకం, వారి నిర్ణయాల పట్ల నమ్మకం, తమ వ్యక్తిత్వం పట్ల దృఢంగా ఉంటారు. లోతైన మాటలు.. ఇంట్రోవర్ట్ లు చిల్లర మాటల కంటే అర్థవంతమైన సంభాషణలకు ప్రాధాన్యత ఇస్తారు. అదే పనిగా ఏదో ఒకటి మాట్లాడటం అనే దాని కంటే.. అవసరమైనప్పుడు అవసరమైన విషయాలు మాట్లాడటానికే వారు ఆసక్తి చూపిస్తారు. అతి ఆలోచనలు.. ఇంట్రోవర్ట్ లు ఒంటరిగా గడపడం ఎక్కువ కాబట్టి చాలా ఎక్కువ ఆలోచిస్తుంటారు. ప్రతి విషయం గురించి లోతుగా ఆలోచిస్తారు , నిర్ణయాలను జాగ్రత్తగా పరిశీలిస్తారు. తక్కువే.. కానీ బలమైన స్నేహాలు.. ఇంట్రోవర్ట్ లకు ఎక్కువ మంది స్నేహితులు ఉండరు. వారి లిస్ట్ లో చాలా కొద్దిమంది మాత్రమే స్నేహితులు ఉంటారు. కానీ ఆ కొద్ది మంది చాలా మంచి స్నేహితులై ఉంటారు. వారి స్నేహం కూడా చాలా బలంగా ఉంటుంది. వారు పెద్దగా మాట్లాడరని అంటుంటారు.. కానీ వారి మనసుకు ఎవరైనా దగ్గరైనా, ఎదుటి వారి వ్యక్తిత్వం వారికి నచ్చినా.. వారు బాగా మాట్లాడతారు. వినడానికి ప్రాధాన్యత.. ఎక్స్ట్రోవర్ట్ లు ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూ ఉంటే.. ఇంట్రోవర్ట్ లు మాత్రం ఎక్కువగా వినడానికే ఇష్టపడతారు. ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే దాన్ని వినడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. మౌనంగా ఉంటూ ఎదుటివారి మాటలను, వారి వ్యక్తిత్వాన్ని గమనించడానికి వీరు ఇష్టపడతారు. వీరిలో పరిశీలనా శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. *రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/why-quiet-minds-make-powerful-leaders-35-217328.html




