సుభిక్షపాలనకు బటన్ నొక్కలేదేమి?
Publish Date:Jul 29, 2022
Advertisement
చిటికేస్తే యువరాణి పావురం అయిపోయి ఎగిరిపోతుంది, ఈల వేస్తే బస్సాగి పోయి వర్షం వస్తుంది.. ఇవన్నీ సినిమాల్లో జరిగే మాయా మంత్రాలు. అన్నీ అలా చిటికెలో, బటన్ నొక్కేస్తే అయిపోయేట్లయితే దేశంలో ఎప్పుడో దారిద్య్రం, అవినీతి, దోపిడీలు పోయి ఉండేవి. కానీ అలా జరగడం లేదు. ఎవరికీ అలాంటి అతీత శక్తులు లేవు. ఈ అత్యాధునిక కంప్యూటర్ కాలంలో కీబోర్డు బటన్‌లు తప్ప హఠాత్తుగా అన్నీ జరిగిపోయే మంత్రశక్తి ఉన్న బటన్ ఎక్కడా ఎవరికీ కనపడటం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్ కి మాత్రం ఇట్టే అయిపోయే పద్దతి తెలిసిపోయింది. డీబీటీ పేరుతో బటన్ నొక్కితే లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ అయిపోతాయని సెలవిచ్చారు. కానీ అలా జరుగుతుందా.. అంటే సీఎం గారి దృష్టిలో అవుతుంది. కానీ వాస్తవ ప్రగతి, ప్రజా సంక్షేమానికి మాత్రం ఆ బటన్స్ ఏవీ పనిచేయడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రచారాలు, ఆర్భాటాల పటాటోపం తప్ప అభివృద్ధి, ప్రజా సంక్షేమం జాడలు రాష్టంలో ఎక్కడా కనపడటం లేదని విమర్శకులు అంటున్నారు. చాలాకాలం నుంచి ఉన్న అమరావతిని అభివృద్ధి చేసి, మిగతా ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని ఏపీ సీసీ అధ్యక్షులు ఎస్.శైలజానాథ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల తాకిడితో ప్రజలు నానా అవస్థలు పడుతుంటే సీఎం మాత్రం బటన్ నొక్కితే అన్నీ అయిపోతాయన్న భ్రమలోనే ఉన్నారని ప్రజల నుంచి విమర్శలు వస్తు న్నాయి. డీబీటీతో రాష్ట్ర అభివృద్ధి చేసినట్లవుతుందా అని శైలజానాథ్ ప్రశ్నించారు. రాష్ట్ర విభజన హామీలను కేంద్రం నెరవేర్చక పోయినా..జగన్ మోహన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
http://www.teluguone.com/news/content/why-not-pressing-button-for-good-governence-39-140845.html





