వైసీపీలో ఇక మిగిలేదెవరు?
Publish Date:Jan 24, 2025
Advertisement
వైసీపీకి విజయసాయి బిగ్ షాక్ ఇచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచీ జగన్ తో అడుగు కలిపి నడిచిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. కష్టకాలంలో జగన్ కు చేయిచ్చారు. ఒకప్పుడు పార్టీలో నంబర్ 2గా ఓ వెలుగు వెలిగిన విజయసాయి.. ఆ తరువాత ఆ స్థానం కోల్పోయినప్పటికీ పార్టీలో మాత్రం అత్యంత కీలకమైన నేత అనడంలో సందేహం లేదు. అటువంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు హఠాత్తుగా పార్టీకీ, రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం జగన్ కు తేరుకోలేని షాకేనని అంటున్నారు. శనివారం (జనవరి 25) ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న విజయసాయి రెడ్డి, పార్టీ ఆవిర్భావం నుంచీ జగన్ కు కుడి భుజంగా మెలిగిన విజయసాయిరెడ్డి రాజీనామా నిర్ణయం వైసీపీ నాయకులు, శ్రేణులను ఆయోమయంలో పడేసింది. తన రాజీనామా నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతం, ఎవరి ఒత్తిడీ లేదని ప్రకటించినప్పటికీ.. జగన్ అక్రమాస్తుల కేసులతో పాటు.. వైసీపీ అధికారంలో ఉండగా తాను వెలగబెట్టిన దందాలకు సంబం ధించిన కేసులు మెడమీద వేళాడుతుండటంతో విజయసాయి రాజకీయ సన్యాసం నిర్ణయం తీసుకుని ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పినంత మాత్రాన కేసుల ఉచ్చు నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. ఈ విషయం విజయసాయికి తెలియంది కాదు. అయినా రాజకీయాలకు దూరం కావడంతో వాటి సీరియస్ సెన్ ఒకింత తగ్గుతుందన్ని ఆయన ఆశిస్తున్నట్లు కనిపిస్తోంది. అన్నిటికీ మించి జగన్ అక్రమాస్తుల కేసులో తాను అప్రూవర్ గా మారితే శిక్షల బెడద ఉండదని ఆయన భావిస్తుండవచ్చు. ఇప్పటికే పులివెందుల తెలుగుదేశం నాయకుడు బీటెక్ రవి.. విజయసాయి అప్రూవర్ గా మారడం ఖాయం, జగన్ కు శిక్ష పడటం తధ్యం అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతే కాదు.. జగన్ పై అనర్హత వేటు పడుతుందనీ, పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందనీ కూడా ఆయన జోస్యం చెప్పారు. ఆ సంగతి అలా ఉంచితే... తాను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటున్నట్లు చేసిన ట్వీట్ లో ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లకు పరోక్షంగా అపాలజీ కూడా చెప్పారు. రాజకీయంగా తెలుగుదేశంతో విభేదించానే తప్ప వ్యక్తిగతంలో చంద్రబాబు పట్ల తనకు గౌరవం ఉందని పేర్కొన్నారు. అలాగే జనసేనాని చిరంజీవితో తనకు చిరకాల స్నేహం ఉందనీ సెలవిచ్చారు. అదే సమయంలో వైఎస్ కుటుంబానికి, జగన్ కు కృతజ్ణతలు చెప్పారు. తన భవిష్యత్ కార్యాచరణను కూడా విజయసాయి ప్రకటించేశారు. ఇక సేద్యం చేసుకుంటాననీ రాజకీయాల జోలికి రాననీ పేర్కొన్నారు. తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని స్పష్టం చేశారు. తన రాజకీయ సన్యాసంపై విజయసాయి చేసిన ప్రకటన వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసులో నంబర్ 2 అయిన విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం ప్రకటన వెనుక కారణాలపై రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బాంబు వెనుక ఏదో కారణముందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నారు. వైసీపీలో తన ప్రాధాన్యత తగ్గిపోవడం, 2024 ఎన్నికలలో ఓటమికి ప్రధాన కారణమైన సజ్జల రామకృష్ణారెడ్డికే జగన్ మళ్లీ పార్టీ కన్వీనర్ గా నియమించడంతో తీవ్ర అసంతృప్తికి లోనై విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారని అంటున్నారు. అన్నిటికీ మించి కాకినాడ పోర్టు కేసులో నిండా మునిగిన విజయసాయి రాజీనామా నిర్ణయానికి వచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కినాడ పోర్ట్ కేసులో ఈడీ ఆయనను ఇటీవల విచారించిన సంగతి తెలిసిందే. తన కారణంగా తన కుటుంబ వ్యాపారం దెబ్బతిని కూడదని విజయసాయి రాజకీయ సన్యాసం నిర్ణయానికి వచ్చి ఉంటారని అంటున్నారు. ఏది ఏమైనా విజయసాయి రెడ్డి రాజీనామా వైసీపీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహించాల్సిన అవసరం లేదు. విజయసాయిరెడ్డే పార్టీలో ఉండలేక, జగన్ నాయకత్వాన్ని భరించలేక రాజీనామా చేశారంటే.. రానున్న రోజులలో ఇక పార్టీలో మిగిలే వారెవరుంటారన్న సందేహం వైసీపీ శ్రేణులలో వ్యక్తం అవుతోంది.
http://www.teluguone.com/news/content/who-will-remain-in-ycp-39-191814.html





