తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎవరు...? టిఆర్ఎస్ అధినేత మదిలో ఈపాటికే ఖరారు!
Publish Date:May 17, 2022
Advertisement
తెలంగాణలో రాజ్యసభ ఎవరిని వరించబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రముఖుల పేర్లు తెరమీదికి వచ్చినా... టిఆర్ఎస్ అధిష్టానం దృష్టిలో మాత్రం ఈ పాటికే జాబితా సిద్దమైందనే చర్చ జరిగుతుంది. మిగతా వన్నీ వదంతుల షికార్లేనన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. అయితే, రాజకీయ వర్గాల్లోనూ, సాధారణ ప్రజల్లోనూ టిఆర్ఎస్ అధిష్టానం దృష్టిలో మాత్రం ప్రముఖంగా వినిపిస్తున పేర్లు దామోదర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్ రాజ్. అయితే, మరి కొందరి పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. హెటిరో అధినేత పార్థశారథి రెడ్డి, పిఎల్ శ్రీనివాస్ పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఇదిలా ఉండగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం రాజ్యసభకు వెళ్ళడానికన్నా ప్రత్యక్ష ఎన్నికలకే అధికంగా మొగ్గుచూపుతున్నారనేది పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నది. కేవలం రెండేండ్లు ఉండే రాజ్యసభకు వెళ్ళడానికి బదులుగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ఐదేండ్లు పదవిలో ఉండటానికే అధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు సమాచారం. ఇటీవల టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటి రామారావుతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశంలో ఇదే విషయం ప్రస్తావనకు వచ్చినట్టు కూడా శ్రీనివాస్ రెడ్డి మద్దతుదారుల అభిప్రాయం. పారిశ్రామిక వర్గాల మద్దతును కూడగట్టడంలో భాగంగా పారిశ్రామిక రంగానికి చెందిన ప్రముఖ హెటిరో సంస్థ అధినేత పార్థసారథి రెడ్డిని కూడా రాజ్యసభకు పంపించాలనే యోచన గులాబీ బాస్ మదిలో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నది. దీనికి తోడు ఆర్జీఆర్ సిద్దాంతి విద్యాసంస్థల అధినేత పిఎల్ శ్రీనివాస్ కు కూడా అవకాశం ఇవ్వలనేది కూడా ఒక ఆలోచన ఉన్నదనేది సీనియర్లలో మాటల్లో నానుతున్నది. గతంలో ఎమ్మెల్సీ, రాజ్యసభకు ఎంపికలు ఎలా ఉన్నా.. ఈ మారు మాత్రం సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకుని రాజ్యసభకు పంపించే వారి జాబితాను టిఆర్ఎస్ అధినేత సిద్దం చేసినట్టు చర్చ జరుగుతుంది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వారిని ఒకరికి రాజ్యసభకు అవకాశం కల్పించాలనేది గట్టిగా సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వాల్లోనూ సినీ పరిశ్రమలోని వారికి అడపాదడపా పదవులు వచ్చేవి. ఎందుకంటే టి. సుబ్బరామిరెడ్డి, మురళీమోహన్, రావు గోపపాల రావు, మోహన్ బాబు, శారద, జమున, జయప్రద, రోజా, దాసరి నారాయణరావు, కృష్టంరాజు, బాబూమోహన్ ఇలా చాలామందే రాజ్యసభకు, ఎమ్మెల్సీగా నియమితులైన సందర్భాలున్నాయి. నేటికీ ఇతర రాష్ట్రాల్లో ఇది కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి కూడా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన వారిని రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ను రాజ్యసభకు పంపిస్తున్నారనేది దాదాపు ఖాయమని ప్రచారం జరుగుతున్నది. అయితే, టిఆర్ఎస్ ఓటు బ్యాంక్ గా మారుతున్న దళితులు, మైనార్టీలలో దళిత వర్గానికి కూడా ప్రాతినిథ్యం కల్పించాలా..? వద్దా..? అనేది కూడా కెసిఆర్ యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఈ వర్గం నుంచి అవకాశం కల్పిస్తే మాత్రం మాజీ మంత్రి మొత్కుపల్లి నర్సింహులు, లేదా మాజీ ఎంపి మంధా జగన్నాథంకు అవకాశం ఇవ్వచ్చనేది చర్చ జరుగుతోంది. బిసి వర్గాల నుంచి పిఎల్ శ్రీనివాస్ పేరు వినిపిస్తున్నా.. ఈ మారు అవకాశం రాకపోవచ్చనేది తెలుస్తుంది. ఓసి వర్గానికి చెందిన దివకొండ దామోదర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బ్రాహ్మణ కోటాలో సిఎల్ రాజాం, కెప్టెన్ లక్ష్మీకాంతరావు పేర్లు కూడా ఉన్నాయి. అయితే, తుది జాబితాలో మాత్రం దామోదర్ రావు పేరు ఖాయమని తెలుస్తుంది. ఇక శ్రీనివాస్ రెడ్డి పైన కూడా బిజెపిలోకి చేరుతారనే ప్రచారం ఉన్నందున పార్టీ అతడిని నిలువరించేందుకు రాజ్యసభ సీటును కట్టబెడతారనేది బలంగా వినిపిస్తున్నది. ఇటీవల రాజ్యసభలో తెలంగాణ నుంచి మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. అందులో బండ్ల ప్రకాశ్, డి. శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావులు ఉన్నారు. అయితే, బండ్ల ప్రకాశ్ స్థానాన్ని భర్తీచేసేందుకు మే 19 నామినేషన్లకు తుదిగడువుగా ఉన్నది. డి శ్రీనివాస్, కెప్టెల్ లక్ష్మీకాంతరావు స్థానాల్ని భర్తీ చేయడానికి మే 31వ తేదీ నామినేషన్లకు ఆఖరు గడువుగా ఉన్నది. ఈ నేపథ్యంలో రాజ్యసభకు బండ్ల ప్రకాశ్ స్థానంలో పంపించే అభ్యర్థి ఎవరన్నది బుధవారం ఖరారు కానున్నది. ఇక డి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు స్థానాల్ని భర్తీ చేసేందుకు మే 31 నామినేషన్లకు చివరితేదీగా ఉంది. మే 30వ తేదీ వరకు వీటికి గడువు ఉన్నందు ముందుగా బండ్ల ప్రకాశ్ స్థానంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ను పంపించే అవకాశాలు లేకపోలేదు. మిగతా రెండింటికి దామోదర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లేదా మరో నేతను పార్టీ అధిష్టానం నిర్ణయించనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేడు అంటే 18వ తేదీన రాజ్యసభకు ఎవరు వెళ్తారనేది తేలే అవకాశాలు లేకపోలేదు.
http://www.teluguone.com/news/content/who-are-going-to-rajyasabha-from-telangana-25-136025.html





