మావోయిస్టు గణపతి జాడ ఎక్కడ?
Publish Date:Apr 12, 2026
Advertisement
మావోయిస్టు అగ్రనేత, మావోయిస్ట్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతికి సంబంధించిన తాజా ఇంటెలిజెన్స్ నివేదికలు, తెలంగాణ డీజీపీ ప్రకటనల ప్రకారం చూస్తే ఆయన అడవుల్లో మాత్రం లేరని తెలుస్తోంది. ఈ విషయం పోలీసులు ధృవీకరించారు కూడా. గత రెండేళ్లుగా ఆయన నేపాల్‌లో రహస్యంగా తలదాచుకున్నారని, అక్కడ ఒక అర్బన్ సేఫ్ హౌస్‌లో ఉన్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. 77 ఏళ్ల గణపతి ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో అంటే డయాబెటిస్, కీళ్లనొప్పులు, ఇతర వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు పార్టీ ఆయనను అడవుల నుంచి బయటకు పంపిందని సమాచారం. గతంలో గణపతి ఛత్తీస్ గఢ్ అడవుల్లో ఉండేవారు. కానీ ఆరోగ్యం క్షీణించడంతో మొదట బిహార్ మీదుగా నేపాల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన నివాసం ఎక్కడ అనేది ప్రభుత్వం అత్యంత రహస్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. అయితే ఆయన త్వరలోనే అధికారికంగా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా కేంద్ర హోం శాఖ, తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కి ఆయన కదలికలపై పూర్తి సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గడువు విధించడంతో, గణపతి లొంగుబాటుకు సంబంధించి తెరవెనుక చాలానే చర్చలు జరిగినట్టు కనిపిస్తోంది. కొన్ని నిఘా వర్గాల నివేదికల ప్రకారం, ఆయన్ను.. గత కొన్నాళ్ల క్రితమే నేపాల్ నుంచి న్యూఢిల్లీకి తీసుకువచ్చి, నిఘా వర్గాల పర్యవేక్షణలో ఉంచారు. తన సోదరుడు రామచంద్రరావు, ఇతర కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు గణపతి లొంగిపోవడానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఏప్రిల్ 10, 2026న తెలంగాణ పోలీసులు విడుదల చేసిన నివేదిక ప్రకారం.. తెలంగాణకు చెందిన కీలక మావోయిస్టు నేతల్లో గణపతి సహా కేవలం ఐదుగురు మాత్రమే ఉన్నారు. గణపతి కనుక లొంగిపోతే.. ఆయనకు మెరుగైన వైద్యం, పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. అవన్నీ పక్కన పెడితే.. గణపతి ప్రస్తుతం పోలీసు రాడార్ లోనే ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. త్వరలోనే ఆయన లొంగుబాటుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు
http://www.teluguone.com/news/content/where-is-maoist-ganapathi-36-217179.html





