ఉక్రెయిన్ వైద్య విద్యార్థుల భవిష్యత్తు ఏంటి?
Publish Date:Mar 4, 2022
Advertisement
రష్యా దాడి నేపథ్యంలో తిరిగి ఉక్రెయిన్ ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కనిపించడంలేదు. యుద్ధం ముగిసినప్పటికీ విద్యాలయాలు ఇప్పట్లో తెరుచుకునే సూచనలు కనిపించడం లేదు. దీంతో ఉక్రెయిన్ లో ఇప్పటికే రెండు, మూడేళ్ళ వైద్యవిద్య పూర్తిచేసుకున్న తమ భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకునే ప్రమాదం ఉందనే భయం పలువురు విద్యార్థుల్లో గూడుకట్టుకుంది. ఉక్రెయిన్ వైద్య విద్యాలయాల్లో చదువుకుంటున్న భారత విద్యార్థులు ఎవరూ ప్రత్యామ్నాయ కోర్సుల్లో చేరగలిగే పరిస్థితి కూడా లేదు. రెండు, మూడేళ్ళు చేసిన వైద్య విద్యాభ్యాసం భవిష్యత్ లో ఎందుకూ కొరగాకుండా పోతుందనే ఆందోళనలో పడిపోతున్నారు భారత విద్యార్థులు. నిజానికి భారతదేశంలో వైద్య విద్య అత్యంత ఖరీదైనది. కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్నది. దేశంలో వైద్యులకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. అయినప్పటికీ డిమాండ్ కు తగిన స్థాయిలో వైద్యులను తయారుచేసుకోవడంలో మన ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైద్య విద్య కోసం భారత విద్యార్థులు ఇతర దేశాలకు క్యూ కడుతున్నారనేది జగమెరిగిన సత్యం. అలా ఉక్రెయిన్ లో వైద్య విద్యాభ్యాసానికి వెళ్లి, రష్యా యుద్ధం నేపథ్యంలో మధ్యలోనే చదువులు వదిలేసి, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భారత్ కు తిరిగి వచ్చేశారు. ఇంకా అనేక మంది విద్యార్థులు వస్తున్నారు. చదువులు మధ్యలోనే ఆపేసి స్వదేశానికైతే వచ్చేశారు కానీ.. ఇకపై తాము ఏమి చేయాలనే దానిపై వారిలో ఆందోళన నెలకొంది. రష్యా చేసిన బాంబుదాడుల్లో ఉక్రెయిన్ లోని భారతీయ వైద్య విద్యార్థి నవీన్ దుర్మరణం పాలయ్యాడు. ఇంకా వేలాది మంది భారతీయ వైద్య విద్యార్థులు ఉక్రెయిన్ లో చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ ప్రాణాలకు రక్షణ కల్పించి స్వదేశానికి తీసుకెళ్ళండని వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా అభ్యర్థిస్తున్నారు. బంకర్లలో దాక్కుని భయకంపితులతున్నారు. భారత ప్రభుత్వం చొరవ తీసుకుని ‘ఆపరేషన్ గంగా’ పేరుతో ప్రత్యేక విమానాల్లో వందలాది మందిని స్వదేశానికి తరలించింది. ఇంకా తరలిస్తోంది. ఇంకా వందల మంది విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఉక్రెయిన్ సరిహద్దులకు తరలి వస్తున్నారు. ఇలాంటి సంఘటనల నేపథ్యంలో ఇన్ని వేల మంది భారతీయ విద్యార్థులు వైద్య విద్య కోసం ఉక్రెయిన్ ఎందుకు తరలి వెళ్ళారనే చర్చ జరుగుతోంది. కేవలం ఉక్రెయినే కాదు.. పలు సోషలిస్ట్ దేశాల్లోనూ భారతీయ విద్యార్థులు వైద్య విద్య అభ్యసిస్తున్నారు. అయితే.. ఎక్కువ మంది ఉక్రెయిన్ లో చదివేందుకు ఆసక్తి చూపుతుండడానికి కారణాలు ఉన్నాయి. మన దేశంలో వైద్య విద్య అత్యంత ఖరీదు. ఇది వాస్తవం. ప్రభుత్వ కళాశాలలో కన్వీనర్ కోటాలో సీటు లభిస్తే నాలుగు లక్షల లోపు ఖర్చుతో ఎంబీబీఎస్ పూర్తి చేయెచ్చు. ప్రైవేటు కళాశాలలో కన్వీనర్ కోటాలో సీటు వస్తే ఖర్చు 40 లక్షల దాకా అవుతుంది. ప్రైవేటు కళాశాలలో యాజమాన్య కోటాలో ఎంబీబీఎస్ పూర్తిచేయాలంటే ప్రస్తుతం కోటి నుంచి కోటిన్నర వరకు అవుతోంది. ఇతర ఖర్చులు, పరీక్షల వ్యయం, హాస్టల్ ఫీజులు కలిపి మన దేశంలో తడిసిమోపెడవుతున్నాయి. ధనవంతులు తప్ప మధ్యతరగతి విద్యార్థులు మన దేశంలో ప్రైవేటు కళాశాలల్లో, యాజమాన్య కోటాలో వైద్య విద్య అభ్యసించ గలిగే స్థితి లేదు. అయినప్పటికీ డాక్టర్ కావాలని వీరికి ఉండే బలమైన కోర్కెను అణచిపెట్టుకోలేరు. ఇలాంటి వారందరికీ యుక్రెయిన్ లాంటి కొన్ని దేశాల్లో అతి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య విద్య అందుబాటులో ఉంది. ఉక్రెయిన్ లో పది నుంచి 16 లక్షల ఖర్చుతోనే వైద్య విద్య పూర్తి చేయెచ్చు. ఉక్రెయిన్ లో జీవన వ్యయం కూడా సాధాణంగానే ఉంటుంది. ఆహారం, వసతి ధరలు భారత్ తో సమానంగా ఉంటాయి. పెద్దగా ఖర్చు కాకుండానే వైద్య పట్టా పొందొచ్చు. పైగా ఈ విద్యకు బ్యాంకుల నుంచి రుణాలు కూడా లభిస్తాయి. భారత్ లో వైద్య విద్య ప్రవేశపరీక్ష చాలా కష్టతరం. ఇది కూడా విదేశాల వైపు మన విద్యార్థుల చూడడానికి కారణం అంటున్నారు. భారత్ లో అయితే.. సీటు కోసం లక్షల మందితో పోటీపడాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సీట్లు ప్రతి 18 మంది పోటీదార్లకు ఒకటి మాత్రమే ఉంది. ఇంటర్, పీయూసీ లేదా తత్సమానమైన పరీక్షల్లో ఎన్నిమార్కులొచ్చినా విద్యార్థి సాధారణ విద్యాభ్యాసంలో ఎంత ప్రతిభావంతుడైనా నీట్ పోటీ పరీక్షకు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉంటుంది. సాధారణ పరీక్షల్లో ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులు కూడా నీట్ లో అర్హత సాధించలేని సందర్భాలు ఉంటున్నాయి. ఉక్రెయిన్ వంటి దేశాల్లో వైద్య విద్య పట్ల ఆసక్తి పెరగడానికి ఇది కూడా ఓ కారణం. ఉక్రెయిన్ లోనే 394 పైగా వైద్య విశ్వవిద్యాలయాలున్నాయి. వీటిలో 18 విశ్వవిద్యాలయాల్ని భారత ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. వీటిలో వేలాది మంది భారతీయ విద్యార్ధులున్నారు. భారత్ తో పోలిస్తే సోవియట్ యూనియన్ పరిధిలో వైద్యవిద్యకు అధిక ప్రాధాన్యత ఉంది. అలాగే బల్గేరియా రొమేనియా, పోలెండ్ వంటి దేశాల్లో కూడా వైద్యరంగాన్ని పటిష్టం చేశారు. ఆయా దేశాల్లో కూడా వైద్య విద్య భారత్ తో పోలిస్తే అతి తక్కువ ఖర్చుతోనే చేయొచ్చు. దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో గత ఏడాది నిర్వహించిన వైద్య విద్య ప్రవేశపరీక్షనిట్ కు 18.10 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో కొంత శాతం విద్యార్థులు మాత్రమే అర్హత సాధించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలన్నింటిలో కలిపి అందుబాటులో ఉన్న మెడికల్ సీట్లు 25 వేలు మాత్రమే. ప్రైవేటు కళాశాలల్లో 60 శాతం సీట్లు యాజమాన్య కోటాలోనే ఉంటాయి. 10 శాతం మాత్రమే కన్వీనర్ భర్తీ చేయగలుగుతారు. జాతీయ స్థాయిలో ప్రతి కళాశాలలోనూ ఎస్.సీ, ఎస్ టీ, బీసీ, ఓబీసీ వర్గాలకు నిర్ణీత శాతంలో రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుంది. మిగిలిన సీట్లే ఓపెన్ కేటగిరీలో మెరిట్ ఉన్న వారికి దక్కుతాయి. భారత్ లో మూడు దశాబ్దాల క్రితమే ప్రైవేటు వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతులు వచ్చాయి. అప్పట్నుంచి ప్రభుత్వం వైద్య కళాశాలల ఏర్పాటు, నిర్వహణ పట్ల తన బాధ్యతను నెమ్మదిగా తగ్గించుకుంది. దీంతో కొత్త కళాశాలలు వచ్చినా 50 శాతం సీట్లు యాజమాన్య కోటాకే దఖలు అవుతున్నాయి. మిగిలిన 50 శాతంలో సగానికి పైగా రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేయాలి. మిగిలిన సీట్లే నీట్ లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. ఉక్రెయిన్ లో చదివినా మరెక్కడ వైద్యపట్టా పొందినా భారత వైద్యుల్లో అత్యధికులు మన దేశంలోనే సేవలందించేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. పైగా మన దేశంలో వైద్యుల కొరత కూడా ఎక్కువే. యుద్ధం కారణంగా చదువులు మధ్యలోనే ఆపి ఉక్రెయిన్ నుంచి వెనక్కి వస్తున్న విద్యార్థులంగా వైద్య విద్య పట్ల ఆసక్తి కలిగి, వైద్యులుగా రాణించాలనే ఆకాంక్షతో అక్కడికెళ్ళినవారే. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉక్రెయిన్ నుంచి తిరిగి వస్తున్న వైద్య విద్యార్థులకు దేశంలోని అన్ని వైద్య కళాశాలల్లోనూ కొంత శాతం సీట్లు కేటాయిం చాలనే డిమాండ్ వస్తోంది. వారు మన దేశంలోనే వైద్యవిద్య పూర్తిచేసేలా సహకరించాలని కోరుతున్నారు. దీంతో మన దేశంలో కొంతమేరకైనా వైద్యుల కొరత తీరుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/what-about-indian-medical-students-furture-39-132579.html





