మోడీ ఔనన్నా.. కాదన్నా విజయం నాదే.. సుబ్రహ్మణ్య స్వామి
Publish Date:Aug 23, 2022
Advertisement
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామిది ఒక ప్రత్యేక ఒరవడి. ఆయనకు పార్టీలూ, ఆ పార్టీల విధానాలతో పెద్దగా సంబంధం ఉండదు. ఆయన అనుకున్నది అనుకున్నట్లు మాట్టాడేస్తారు. జనతా పార్టీలో ఉన్నా, బీజేపీలో ఉన్నా మరో పార్టీ అయినా ఆయనకు పెద్ద తేడా ఉండదు. ప్రస్తుతం ఆయన తన కాన్సన్ట్రేషన్ అంతా ప్రధాని మోడీపై పెట్టారు. ఆయన టార్గెట్ గా వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. తాజాగా సోమవారం ఆయన రామసేతు అంశాన్ని అడ్డుపెట్టుకుని మోడీపై సెటైర్లతో ట్వీట్ చేశారు. రామసేతు అంశం ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్న సంగతి విదితమే. రామసేతుపై సుప్రీం కోర్టు సోమవారం (ఆగస్టు 22) విచారణ చేపట్టింది. అందులో భాగంగా రామసేతు పురాతన వారసత్వ కట్టడమా? కాదా అన్నది తేల్చి చెప్పాలంటే దేశ సర్వోన్నత న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీం ఆదేశాలను ఆధారం చేసుకుని సుబ్రహ్మణ్య స్వామి మోడీపై చురకలు వేశారు. సుప్రీం ఆదేశాలతో రామసేతు విచారణ తుది దశకు వచ్చినట్లేనని పేర్కొన్న సుబ్రహ్మణ్య స్వామి ఇక కేంద్రం నోరు తెరవక తప్పదని అన్నారు. అంతే కాదు మోడీ ఔనన్నా.. కాదన్నా తానే గెలుస్తానని చమత్కరించారు. మోడీ రామసేతు పురాతన వారసత్వ కట్టడమే అని అంగీకరిస్తే విజయం తనదనీ, అలా కాకుండా అది పురాతన వారసత్వ కట్టడం కాదని సుప్రీం కు తెలియజేస్తే 2024 ఎన్నికలలో మోడీ పరాజయం ఖాయమన్నారు. ఎలా చూసినా విజయం తనదేనని సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ చేశారు.
http://www.teluguone.com/news/content/weather-modi-says-yes-on-no-victory-is-mine-says-swamy-39-142512.html





