పులివెందులలో జగన్ సినిమా అయిపోయిందా: ఇక కూటమి సినిమా చూపిస్తుందా.?
Publish Date:Oct 29, 2026
Advertisement
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఆయన సినీమా అయిపోయిందా? స్థానిక నామినేషన్లలో ఆ నియోజకవర్గ పరిధిలోని మెజారిటీ స్థానాలు తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఏకగ్రీవం కావడం దీనినే సూచిస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. స్థానిక ఎన్నికల ప్రచారంలో అధికార తెలుగుదేశం కూటమి నేతలు జగన్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పులివెందుల గడ్డపై జగన్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పక్కా ప్రణాళికతోనే తాము పులివెందులలో అడుగుపెట్టామని, మాజీ సీఎంకు సినిమా చూపిస్తామంటూ ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పులివెందులలో జగన్ సినిమాకు ఎండ్ కార్డ్ పడిందా? అన్న అనుమానాలకు తావిచ్చాయి. జగన్ సినిమా డైలాగులు చెబుతున్నారని, చొక్కాలు మడతపె డతామంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఆయనలోని పరాజయ భయాన్ని ఎత్తి చూపుతున్నాయనీ ఆదినారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన చొక్కా చేతులు మడతపెడితే భయపడే పరిస్థితులు పులివెందులలో ఇప్పుడు లేవని ఎద్దేవా చేశారు. పులివెందులలో జగన్ కు ఇప్పుడు తాము సినిమా చూపిస్తామని హెచ్చరించారు. ఒకప్పుడు జగన్ వెంటే నడిచి, ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశంకూటమి అభ్యర్థిగా జమ్మలమడుగు నుంచి గెలుపొందిన ఆదినారాయణ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదే సభలో ఆయనతో పాటు పాల్గొన్న పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి కూడా జగన్పై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. తనను అంతం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినా తాను ఎప్పుడూ వెనకడుగు వేయలేదని, పులివెందుల ప్రజల మద్దతుతోనే మునుపటి కంటే బలంగా నిలబడ్డానన్న ఆయన.. గత నాల్గ దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం చేసిన తప్పిదాలకు పులివెందుల ప్రజలు ఇప్పుడు సరైన సమాధానం చెబుతున్నారన్నారు. నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు. దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. [Local Body Elections Pulivendula, Jagan, Ycp, Backfoot, Adinarayana Reddy, Pulivendula Politics, BTech Ravi, Telugu One]
http://www.teluguone.com/news/content/local-body-elections-pulivendula-39-235718.html





