వరంగల్‌లో వైసీపీ పోటీ ఎందుకుట?
Publish Date:Nov 4, 2015
Advertisement
బొంకరా బొంకరా పోలిగా అంటే... టంగుటూరు మిరియాలు తాటికాయలంత అన్నాట్ట. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి అలాగే వుంది. తెలంగాణలో ఆ పార్టీకి అస్సలు ఉనికే లేదు. వైసీపీ అనే పార్టీని ఇక్కడ ఎవరూ పట్టించుకోనే పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ నాయకులు తమ పార్టీకి తెలంగాణలో బోలెడంత ఆదరణ వుందని చెప్పుకొస్తున్నారు. అబద్ధాలు చెప్పడానికైనా ఒక హద్దంటూ వుండాలి కదా. అలాంటి హద్దులేవీ లేనట్టుగా వైసీపీ అబద్ధాలు చెబుతోంది. తనకు నిజంగా తెలంగాణలో ఉనికి ఉందని వైసీపీ నమ్ముతోందో లేక జనాన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తోందో ఆ పార్టీ నాయకులకే ఎరుక.
అదంతా అలా వుంటే, ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేయడానికి వైసీపీ ముందుకు రావడం చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఒకవైపు కేసీఆర్‌తో వైసీపీ నాయకుడు జగన్ సత్సంబంధాలను కొనసాగిస్తాడు. ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలవటానికి తన మద్దతు ప్రేమగా ఇస్తాడు. మెదక్ పార్లమెంట్ స్థానానికి కేసీఆర్ రాజీనామా చేస్తే వచ్చిన ఉప ఎన్నికలో అభ్యర్థిని నిలపకుండా తన మిత్ర ధర్మాన్ని చాటాడు. తన పార్టీకి ఎలాగూ తెలంగాణలో సీన్ లేదు కాబట్టి టీఆర్ఎస్‌కి మద్దతు ఇస్తూ నెట్టుకొస్తూ వున్న వైసీపీకి సడెన్‌గా వరంగల్‌లో పోటీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో. టీఆర్ఎస్, వైసీపీల మధ్య ఏదైనా తేడా వచ్చిందన్న దాఖలాలు కూడా ఏవీ కనిపించడం లేదే. అలాంటప్పుడు వరంగల్ పార్లమెంటు స్థానానికి పోటీ చేయడం ఏమిటో! కాకపోతే, ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఓట్లను చీల్చి, తద్వారా టీఆర్ఎస్ అభ్యర్థి గెలవటానికి పరోక్షంగా సహకరించే ఉద్దేశంతోనే జగన్ ఈ ఎన్నికలలో తన పార్టీ అభ్యర్థిని నిలబెడుతున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి శత్రువుగా కనిపిస్తూనే మేలు చేసే జగన్ లాంటి మంచి మిత్రుడు దొరికిన కేసీఆర్ అదృష్టవంతుడు.
http://www.teluguone.com/news/content/warangal-election-45-52020.html





