అందుకే బాబు, మోడీ తెదేపా-బీజేపీ నేతల యుద్దంలో కలుగజేసుకోవడంలేదేమో?
Publish Date:Nov 4, 2015
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెదేపా-బీజేపీ నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం క్రమంగా తీవ్ర స్థాయికి చేరుకొంటోంది. బీజేపీ నేత సోము వీర్రాజు అవసరమయితే తెదేపా ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి దానితో పోరాడుతామని హెచ్చరిస్తుంటే, ఆయనను అదుపులో ఉంచాలని బీజేపీ అధిష్టాన్ని కోరుతామని తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెదేపా ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిన కారణంగా ప్రజలలో దానిపట్ల వ్యతిరేకత పెరిగిపోయిందని బీజేపీ నేత కావూరి సాంభశివరావు అంటే కావూరి,పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ అందరూ కూడా బీజేపీలో పనిచేస్తున్న సోనియాగాందీ ఏజెంట్లని, వారు రాష్ట్రంలో బీజేపీని అన్ని విధాల భ్రష్టు పట్టించేసి వచ్చే ఎన్నికల సమయానికి మళ్ళీ అందరూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోతారని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. తెదేపా-బీజేపీ నేతల మధ్య ఇంత తీవ్రంగా మాటల యుద్ధం జరుగుతున్నా కూడా తెదేపా-బీజేపీ అధిష్టానాలు వాటిని సీరియస్ గా తీసుకోకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కనుక వారి యుద్ధానికి బహుశః రెండు పార్టీల అధిష్టానాలు అనుమతి ఉన్నట్లేనని భావించవలసివస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపుడప్పుడు తన పార్టీ నేతలను హెచ్చరిస్తున్నప్పటికీ, బీజేపీతో వారి మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉందంటే, ఆయన అనుమతి ఉన్నట్లే భావించవచ్చును. అయితే మిత్ర పక్షాలుగా ఉన్న ఆ రెండు పార్టీలు ఈవిధంగా ఎందుకు ఒకదానిపై మరొకటి కత్తులు దూసుకొంటున్నాయని ఆలోచిస్తే దానికి ఎవరి కారణాలు వారికున్నట్లు కనబడుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలంటే, ప్రజలను దృష్టిని ఆకట్టుకోవడానికి ఆ మాత్రం ‘పవర్ పంచ్’లు ఉపయోగించక తప్పదు కనుకనే బీజేపీ అధిష్టానం వారి యుద్దాన్ని చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని భావించవవలసి ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రాభివృద్ధికి, రాజధాని నిర్మాణానికి అవసరమయిన సహాయ సహకారాలు కేంద్రం నుండి పొందాలంటే కేంద్రంతో సఖ్యతగా ఉండాలి. కానీ తమ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ నేతలు చేస్తున్న తీవ్రమయిన ఆరోపణల వలన తెదేపా చాల నష్టపోయే ప్రమాదం ఉంది కనుక తమ పార్టీని కాపాడుకోవలసిన బాధ్యత, అవసరం తెదేపా నేతలకుంది. అందుకే వారు కూడా ఘాటుగా స్పందించక తప్పడం లేదు. రాష్ట్రస్థాయిలో తెదేపా, బీజేపీలు ఇంత తీవ్రంగా యుద్దాలు చేసుకొంటున్నప్పటికీ, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీల మధ్య బంధం చాల పటిష్టంగానే ఉంది. నరేంద్ర మోడీ అమరావతికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు మెచ్చుకొంటూ మాట్లాడిన మాటలు, తెదేపాతో తమ స్నేహం ఎప్పటికీ బలంగా కొనసాగుతుందని ప్రకటించడం అందుకు చక్కని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చును.
http://www.teluguone.com/news/content/ap-45-52021.html





