గొడ్డు చాకిరీ.. నేతల దౌర్జన్యాలు! ప్రాణాలు తీసుకుంటున్న వాలంటీర్లు
Publish Date:Aug 17, 2021
Advertisement
వాలంటీర్ వ్యవస్థను గొప్పగా చెప్పుకుంటోంది ఏపీలోని జగన్ రెడ్డి ప్రభుత్వం. మహాత్మ గాంధీ కలను సాకారం చేశామని చెబుతోంది. రెండు లక్ష ల మందికి పైగా ఉపాధి కల్పించామని ప్రచారం చేసుకుంటోంది. ఇందతా ఒకవైపు అయితే మరోవైపు మాత్రం గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థ మేడిపండు లాంటిదని తేలుతోంది. చాలీ చాలనీ వేతనం, గొడ్డు చాకిరీ, వైసీపీ నేతల దౌర్జన్యాలతో వాలంటీర్లు నలిగిపోతున్నారని తెలుస్తోంది. వైసీపీ నాయకుల పెత్తనం ఎక్కువైందని, వాలంటీర్లను కూలీలకంటే హీనంగా చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఓవైపు అధికారులు, మరోవైపు అధికారపార్టీ నాయకులు.. పెద్దల ఒత్తిళ్ల వళ్ల వాలంటీర్లు శారీరకంగా, మానసికంగా కుంగిపోతున్నారు. కొందరు ఉద్యోగాలు వదిలేస్తుండగా.. మరి కొందరు ఆత్మహత్యకు పాల్పడుతుండటం కలకలం రేపుతోంది. అనంతపురం జిల్లా రాయదుర్గంలో వాలంటీర్ మహేశ్ ఇంట్లో ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్న ఘటన మరవకముందే.. కర్నూల్ జిల్లాలో మరో విషాదం చోటు చేసుకుంది. మరో వలంటీరు అర్ధంతరంగా తనువు చాలించాడు. పెళ్లి చేసుకుంటే.. వలంటీరు పనికి ప్రభుత్వం ఇచ్చే వేతనం సరిపోదని, మరో ఉద్యోగం వస్తుందో రాదోనన్న భయంతో సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లా కోడుమూరు సుందరయ్య కాలనీలో నివాసం ఉంటున్న అల్లుగుండు అబ్దుల్ ఖాదర్, జైనాబీ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హబీబ్‌బాషా (26) వార్డు వలంటీర్. ఇద్దరు కొడుకులకూ పెళ్లి చేయాలని ఖాదర్ నెల కిందట ఖాయం చేశారు. అప్పటి నుంచి హబీబ్ దిగాలుగా ఉంటున్నాడు. పెళ్లయితే ప్రభుత్వం ఇచ్చే రూ.5వేల వేతనంతో కుటుంబాన్ని పోషించుకోవడం కష్టమని, మరో ఉద్యోగం వస్తుందో.. లేదో అని తండ్రితో చెబుతూ బాధపడుతుండే వాడు. సోమవారం ఇంట్లో హబీబ్ చీరతో ఉరివేసుకున్నాడు. కొడుకు శవమై కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతపురం జిల్లాలో సూసైడ్ చేసుకున్న వాలంటీర్ మహేష్.. తన చావుకు కారణం ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ ఉద్యోగమే కారణమని సూసైడ్ లేఖ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. తనతో గొడ్డు చాకిరీ చేయించుకున్నారని సూసైడ్ నోట్లో రాశాడు మహేశ్. తన లాంటి పరిస్థితి మరో వాలంటీర్‌కు రాకుండా చూడాలని సూసైడ్ నోట్లో ప్రదేయపడటం సంచలనంగా మారింది. మొదటినుంచీ వాలంటీర్ వ్యవస్థ వివాదాస్పదంగానే ఉంది. వాలంటీర్లతో బండ చాకిరీ చేయిస్తున్నారనీ, అన్ని రకాలుగా వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల నుంచి ఎదురయ్యే ఒత్తిళ్ల కంటే.. అధికార పార్టీ నాయకుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులు మరింత ఎక్కువగా ఉన్నాయని.. వైసీపీ నేతల ఓవరాక్షన్‌ను, టార్చర్‌ను తట్టుకోలేకపోతున్నామని అనేకమంది ఆరోపిస్తున్నారు. జగన్ రెడ్డి సర్కార్ గొప్పగా చెప్పుకుంటున్న వాలంటీర్ వ్యవస్థ.. ప్రాణాలు తీసేలా తయారైందని మండిపడుతున్నారు.
http://www.teluguone.com/news/content/village-volunteer-ends-life-in-kurnnol-dist-39-121577.html





