రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వనజీవి రామయ్య.. ఐసీయూలో చికిత్స
Publish Date:May 18, 2022
Advertisement
తెలంగాణ ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు వనజీవి రామయ్య. మొక్కల సంరక్షణ జీవన విధానంగా మార్చుకున్న ప్రకృతి ప్రేమికుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఆయన బుధవారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. మొక్కలకు నీళ్లు పోసేందుకు రోడ్డు దాటుతూ ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కాలికి తీవ్ర గాయమైందనీ, త్వరలోనే కోలుకుంటారనీ వైద్యులు చెబుతున్నారు. వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారన్న వార్త వినగానే ఆయన అభిమానులు, ప్రకృతి ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణభయం లేదనీ, త్వరలోనే కోలుకుంటారనీ వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న వనమాలి రామయ్యకు సర్జరీ చేయాల్సి ఉందని వైద్యులు చెబుతున్నారు. రోడ్డు దాటుతుండగా బైక్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారన్న వార్త తెలియగానే రాష్ట్ర ఆరోగ్య మంత్రి హరీష్ రావు ఫోన్ లో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడారు. మెరుగైన చికిత్స అందించాల్సిందిగా ఆదేశించారు. రామయ్యకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా వనజీవి రామయ్యకు యాక్సిడెంట్ అవ్వడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వాకబు చేశారు.
http://www.teluguone.com/news/content/vanajeevi-ramayya-injured-in-road-accident-25-136071.html





