బి కేర్ ఫుల్... ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న నర్సుకు కరోనా..
Publish Date:Dec 30, 2020
Advertisement
కరోనా మహమ్మారి నుండి తమ దేశ ప్రజలను రక్షించడం కోసం బ్రిటన్, అమెరికా వంటి కొన్ని దేశాలు ఫైజర్ వ్యాక్సిన్ కు అత్యవసర అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అమెరికాలో ఫైజర్ వ్యాక్సిన్ వేయించుకున్న వారం తరువాత ఓ మేల్ నర్సు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. అమెరికాలోని క్యాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన మాథ్యూస్ స్థానికంగా ఉన్న రెండు ఆస్పత్రుల్లో నర్సుగా విధులు నిర్వహిస్తున్నారు. అయన మొన్న డిసెంబర్ 18న ఆయన ఫైజర్ కరోనా వ్యాక్సిన్ తొలి డోసును తీసుకున్నారు. అయితే వ్యాక్సిన్ వేయించుకున్న ప్రాంతంలో చేతిపై కొద్దిగా ఎర్రబడటం తప్ప తనకు ఎటువంటి ఇబ్బందులూ కలగలేదని మాథ్యూస్ తెలిపారు. అయితే అయన ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న ఆరు రోజుల తరువాత.. క్రిస్మస్ సందర్భగా విధుల్లో ఉన్న తనకు కొంత అనారోగ్యంగా అనిపించిందని.. ఆ తరువాత కొంత సేపటికే చలి, ఒళ్లునొప్పులు వచ్చాయని ఆయన తెలిపారు. మరుసటి రోజు మ్యాథ్యూస్ అనుమానం కలిగి టెస్టు చేయించుకోగా.. రిపోర్టుల్లో పాజిటివ్ అని తేలింది. అయితే ఈ ఘటన పై స్పందించిన అంటువ్యాధుల నిపుణుడు ఒకరు ఈ ఘటన అనూహ్యమైనదేమీ కాదని వ్యాఖ్యానించారు. "క్లినికల్ ట్రయల్స్‌లో తేలిన వివరాల ప్రకారం.. వ్యాక్సిన్ తీసుకున్న 10 నుంచి 14 రోజుల తరువాతే కరోనాను ఎదుర్కొనేందుకు మన రోగనిరోధక శక్తి పూర్తిస్థాయిలో సిద్ధమవుతుందని స్పష్టం చేస్తున్నారు. వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తరువాత మనలో ఇమ్మునిటీ 50 శాతం, రెండు డోసు తీసుకున్న తరువాత 95 శాతం శక్తిని పుంజుకుంటుందని" ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నతరువాత కూడా కొంతకాలం పాటు భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటి నియమాలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/us-nurse-tests-positive-over-a-week-after-receiving-pfizer-vaccine-39-108357.html





