ఆ ముగ్గురు మంత్రులు తోకలేని కోతులు వంటివారు.. జనసేన ఫైర్
Publish Date:Dec 30, 2020
Advertisement
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తాజాగా ఏపీ మంత్రులు చేసిన తీవ్ర వ్యాఖ్యలపై జనసేన ముఖ్య నేత శివశంకర్ స్పందించారు. ఈరోజు ఆయన విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం జగన్ వెనుక ఉన్న ముగ్గురు మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, పేర్ని నాని కూడా ముగ్గురు తోకలు కత్తిరించిన కోతులులాంటివారని అన్నారు. ఆ మంత్రులకు మంత్రివర్గ సమిష్టి బాధ్యతలు ఎంతమాత్రం తెలియవని, అంతేకాకుండా ప్రజస్వామ్యం గురించి గానీ, రాజ్యాంగం గురించి కానీ ఓనమాలు కూడా తెలియని మంత్రులని విమర్శించారు. ఈ ముగ్గురు ప్రాచీనయుగంలో పుట్టవలసినవాళ్లని అయన అన్నారు. ఆ మంత్రులు ఈ యుగంలో పుట్టడం ఆంధ్ర రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని అన్నారు. మంత్రి కొడాలి నాని బూతులు మాట్లాడుతూ.. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, ప్రజా సమస్యలపై మాట్లాడడంలేదని శివశంకర్ విమర్శించారు. మంత్రులు తమ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. బూతులు మాట్లాడే మంత్రులను పక్కన పెట్టుకుని సీఎం జగన్ పరిపాలన సాగిస్తున్నారని అయన విమర్శించారు. నివర్ తుఫాను వల్ల 19 లక్షల మంది రైతులకు నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అసెంబ్లీ సాక్షిగా చెప్పారని... ఇప్పుడు 11 లక్షల మంది రైతులని చెబుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల సమస్యను పూర్తిగా గాలికొదిలేశారని, నివర్ తుఫాన్ వచ్చినప్పుడు తడిసిన ధ్యాన్నాన్ని కొనుగోలు చేస్తానని సీఎం జగన్ చెప్పారని.. అయితే ఇప్పుడు మిల్లర్లు శాసిస్తున్నారని, దీంతో రైతులు రోడ్డుపై ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం వ్యక్తిగత దాడులు ఆపాలని, రైతులకు నివర్ నష్టపరిహారం తక్షణమే ఇవ్వాలని శివశంకర్ డిమాండ్ చేశారు.
http://www.teluguone.com/news/content/janasena-leader-siva-sankar-slams-ycp-leaders-39-108361.html





