ఐరాస నివేదికతో ప్రభుత్వాల్లో చలనం!
Publish Date:Jul 4, 2012
Advertisement
ప్రసూతి మరణాలపై ఐక్యరాజ్యసమితి ఇచ్చిన నివేదిక దేశవ్యాప్తంగానూ, రాష్ట్రవ్యాప్తం గానూ ప్రభుత్వాలను కుదిపేసింది. దేశంలో ప్రతిపది నిమిషాలకు ఒక ప్రసూతి మరణం సంభవిస్తోందని ఆ నివేదిక తేటతెల్లం చేస్తోంది. 2010లో దేశవ్యాప్తంగా 57వేల మంది తల్లులు ప్రాణాలు వదిలారని తేలింది. అంటే గంటకు ఆరుగురు, ప్రతిపదినిమషాలకు ఒకరు మరణించారని నివేదిక స్పష్టం చేసింది. తాజా లెక్కల ప్రకారం ప్రసూతి మరణాల రేటు లక్షమంది మహిళలకు 212 చొప్పున ఉంది. అయితే 2015 నాటికి లక్షమంది మహిళలకు 109కు తగ్గాల్సి ఉందని ఐకాస తన నివేదికలో లక్ష్యంగా నిర్ణయించింది. కానీ 1990నాటి పరిస్థితులతో పోలిస్తే ఈ మరణాలు 47శాతం తగ్గాయని ఐకాస తన నివేదికలో అంగీకరించింది. ఈ నివేదికలను పరిశీలించిన కేంద్రప్రభుత్వం ప్రసూతి మరణాలు సంభవించకుండా సమీప పిహెచ్సిల్లో ఏర్పాట్లపై ప్రచారం చేయాలని సమాచారశాఖను ఆదేశించింది. దీని ఫలితంగా ప్రసవానికి పిహెచ్సికి వెళితే ఆర్థికంగా సహకరిస్తారని ప్రచారమూ జరుగుతోంది. ఇక రాష్ట్రప్రభుత్వాల విషయానికి వస్తే ప్రతీ ఆరోగ్య కేంద్రం వద్ద, ప్రత్యేక శిబిరాల్లోనూ తల్లి`బిడ్డ సంక్షేమం కోసం ప్రభుత్వాసుపత్రుల్లోనే కాన్పు జరగాలని ప్రచారం చేస్తోంది. ఈ నివేదిక ఆధారంగా వచ్చిన ఈ స్పందన గ్రామీణ ప్రాంతాల్లోనూ, గిరిజన తండాల్లోనూ కనిపిస్తోంది. ఇంకా ఆరోగ్య సిబ్బంది కొరత ఉన్నా గ్రామీణులు పిహెచ్సిలను, కార్పొరేట్ ఆసుపత్రుల సేవలనూ వినియోగించుకోవటానికి ముందుకు వస్తున్నారు.
http://www.teluguone.com/news/content/uno-statement-24-15341.html





