రాహుల్ యాత్రతో కమల దళంలో వణుకు
Publish Date:Oct 12, 2022
Advertisement
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగిస్తున్న భారత్ జోడో యాత్ర, ప్రారంభించి నెలరోజులు పూర్తయింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 34 రోజులు పూర్తి చేసుకుని ఈరోజు (బుధవారం) 35 రోజులోకి ప్రవేశించింది. ఈ 35 రోజుల్లో తమిళనాడు, కేరళ రాష్ట్రాలను దాటి కర్ణాటకలో సాగుతోంది. నిజానికి, రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభంలో కాంగ్రెస్ లోనే చాలా మందికి చాలా అనుమానాలున్నాయి. ఈ యాత్ర వలన ఏమిటి ప్రయోజనం?అని పెదవి విరిచారు. భారత్ జోడో నినాదం ఎంతవరకు ఎన్నికల నినాదంగా పనిచేస్తుంది? ఎంత వరకు ఓట్ల పంట పందిస్తుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, అదే సమయంలో పార్టీలో కొందరు సీనియర్ నాయకులు మాత్రం భారత్ జోడో యాత్ర సమీప భవిష్యత్ లో చక్కని ఫలితాలు చూపుతుందని విశ్వాసం వ్యక్త పరిచారు. ఈ నేపద్యంలో నెల రోజులు సాగిన యాత్రను వెనక్కి తిరిగి చూసుకుంటే, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ఆశించిన దానికంటే అనూహ్య స్పందన వస్తోందని, పార్టీ నాయకులే కాదు, స్వతంత్ర పరిశీలకులు కూడా సంతృప్తిని వ్యక్త పరుస్తున్నారు. యాత్ర ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో చోటు చేసుకున్న గందరగోళ పరిస్థితులు యాత్ర పైనా ప్రభావం చూపినా, రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష ఎన్నికల వ్యవహారంలో ప్రత్యక్షంగా వేలు పెట్టలేదు. ఒక విధంగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా, యాత్ర కొనసాగించారు. విభిన్న వర్గాల ప్రజలను కలుస్తూ మాట్లాడుతూ, మేథావులు, సామాజిక కార్యకర్తలు, వ్యవసాయ, కార్మిక సంఘాల ప్రతినిధులు, విధ్యార్ధులతో చర్చలు జరుపుతూ సాగుతున్న యాత్ర అందరిలో, ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణుల్లో విశ్వాసాని పెంచుతోందని రాజకీయ పరిశీలకులు కూడా గుర్తిస్తున్నారు. నిజానికి రాహుల్ యాత్ర, తమిళనాడు,కేరళలలో కంటే, మరి కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరనున్న కర్ణాటకలో మరింత జోరుగా సాగుతోంది. అందుకే, మొదట్లో రాహుల్ యాత్రను లైట్’గా తీసుకున్న బీజేపీ రాహుల యాత్రను గుర్తించడమే కాదు, కౌంటర్ స్ట్రాటజీ మీద దృష్టి పెట్టింది. రేపటి అసెంబ్లీ ఎన్నికపై రాహుల్ యాత్ర ప్రభావం ఉంటుందని బీజేపీ నాయకులూ అంగీకరిస్తున్నారు. రాహుల్ యాత్రకు సమాధానంగా కమల దళం,‘జన సంకల్ప’ యాత్రను ప్రారంభించింది. అంతే కాదు, రాహుల్ యాత్రకు వస్తున్న అనూహ్య స్పందనతో కాంగ్రెస్ పార్టీ పలుకుబడి రోజు రోజుకు పెరుగతున్న నేపధ్యంలో, బీజేపీ ప్రభుత్వం రాహుల్ యాత్రకు వ్యతిరేకంగా ప్రకటనలు గుప్పిస్తోంది. నిజానికి రాహుల్ యాత్ర కర్ణాటకలో ప్రవేశించినప్పటి నుంచి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఇతర మంత్రులు, బీజేపీ సీనియర్ నాయకులు యాత్రను విమర్శించని రోజంటూ లేదు. బీజేపీలో భయం మొదలైంది అనేందుకు ఇదే నిదర్శనమని కాంగ్రెస్ నాయకులూ అంటున్నారు. నిజానికి, రాహుల్ గాంధీ యాత్రకు ఈ స్థాయిలో స్పందన తాము కూడా ఉహించలేదని కాంగ్రెస్ నాయకులే అంటున్నారు. అయితే, బొమ్మై అన్నట్లుగా, రాహుల్ గాంధీ తమ సొంత ఇమేజ్ ని పెంచుకునేందుకే యాత్ర మొదలు పెట్టారని అనుకున్నా, రాహుల్ యాత్ర బీజేపీ, బొమ్మై వెన్నులో వణుకు పుట్టిస్తోందనేది మాత్రం కాదనలేని నిజమని కాంగ్రెస్ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు.
అయితే, రాహుల్ యాత్రతో వచ్చిన ఉత్సాహం ఎన్నికల వరకు ఉంటుందా? మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య ముఖ్యమంత్రి కుర్చీ కోసం సాగుతున్న అంతర్గత కుమ్ములాటల్లో కొట్టుకుపోతుందా చూడవలసి ఉందని అంటున్నారు. అయితే, కర్ణాటక ఫలితం ఎలా ఉన్నా రాహుల్ గాంధీ భారాత్ జోడో యాత్ర, పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోందనే విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదని అంటున్నారు.అలాగే, నిజంగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, దేశంలో ముఖ్యంగా తెలంగాణలో హస్తానికి మళ్ళీ కొత్త శక్తి వచ్చినట్లే అంటున్నారు.
http://www.teluguone.com/news/content/un-presidented-response-to-rahul-bharat-jodo-yatra-shewering-in-bjp-25-145300.html





