ప్రశ్న రావణ్ పై ఉపా కేసు.. పిచ్చుకపై బ్రహ్మాస్త్రమేనా?
Publish Date:Jul 9, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టు, అతనిపై ఉపా కేసు నమోదు చేయడం ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. సోషల్ మీడియాలో వ్యాఖ్యల ఆధారంగా ఏకంగా దేశద్రోహం, తీవ్రవాద నిరోధక చట్టాల కింద కేసులు పెట్టడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు తాజా వ్యాఖ్యలు, హోమ్ శాఖకు ఆయన చేసిన హెచ్చరికలపై ప్రముఖ విశ్లేషకుడు భరద్వాజ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రశ్నరావణ్ పై ఉపా కేసు కేవలం.. ఒక యూట్యూబర్ అభ్యంతరకర వ్యాఖ్యలకు పరిమితం కాలేదనీ, దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహం దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. రావణ్‌కు ఇప్పటికే నాలుగు కేసుల్లో బెయిల్ వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉపా చట్టాన్ని ప్రయోగించిందని విమర్శలు వస్తున్న వేళ భరద్వాజ.. సాధారణ ఐపీసీ సెక్షన్ల ద్వారా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఉపా కేసు పెట్టడంతో.. సంవత్సరాల తరబడి జైల్లో ఉంచాలనే కక్ష సాధింపు ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఏపీ ఇంటెలిజజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. పోలీసులు కోర్టుకు సమర్పించిన ఆధారాల్లో కొన్ని వీడియోలు ఎడిట్ చేసినవని, కాంటెక్స్ట్ (సందర్భం) మార్చి రూపొందించిన లింకులను న్యాయస్థానానికి సమర్పించారని ఆయన చెప్పారు. ఒకవేళ కోర్టులో ఇవి ఎడిటెడ్ వెర్షన్లు అని రుజువైతే.. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని హెచ్చరించారు. రాజకీయంగా చూస్తే.. ఈ మొత్తం ఎపిసోడ్‌ను జనసేన వర్సెస్ రావణ్ వివాదంగా మార్చేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని భరద్వాజ అన్నారు. టీడీపీ ఈ విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తుండగా, జనసైనికులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఈ వివాదాన్ని వైసీపీకి ముడిపెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. రావణ్‌కు జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక సాయం అందిస్తున్నారనే ప్రచారాన్ని తెరపైకి తెచ్చి, వైసీపీని హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. యూట్యూబ్‌లో వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, అసభ్య పదజాలం వాడటం కచ్చితంగా తప్పే అయినప్పటికీ, చట్టాన్ని దుర్వినియోగం చేయడం సరైంది కాదని భరద్వాజ అన్నారు. కేవలం ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోకుండా, సోషల్ మీడియాలో హద్దులు మీరుతున్న అధికార, ప్రతిపక్షాలకు చెందిన అందరు యూట్యూబర్లపై కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుతం ఈ ఉపా కేసు వ్యవహారం విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌లో పౌరహక్కుల సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలకు దారితీసింది. ప్రభుత్వం చట్టాన్ని ఆయుధంగా మార్చుకుని పౌర హక్కులను కాలరాస్తోందనే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. Youtuber Ravan Arrest, UAPA Case on Ravan, Pawan Kalyan, Chandrababu Naidu, Jagan Mohan Reddy, AB Venkateswara Rao, Journalist Bharadwaj Analysis, AP Politics
http://www.teluguone.com/news/content/uapa-case-against-ravan-brahmastra-against-sparrow-25-225532.html





