పాత సిస్టమా.. కొత్త జోనలా! ఉద్యోగ నియామకాలు ఎలా ?
Publish Date:Dec 19, 2020
Advertisement
ఎన్నికల్లో వరుస ఎదురు దెబ్బలు.. యువత తిరుగుబాటు... నిరుద్యోగుల ఆక్రందనలు.. ఏదైతేనేం మొత్తానికి ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు సిద్ధమైంది తెలంగాణ సర్కార్ . ఆరేండ్లుగా కొలువుల భర్తీపై పెద్దగా ఫోకస్ చేయని సీఎం కేసీఆరే స్వయంగా ఉద్యోగ ప్రకటన చేశారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తక్షణమే దాదాపు 50 వేల ఉద్యోగ నియమకాలు చేపట్టాలని సీఎం కేసీఆర్ నుంచి సీఎస్ కు ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. సర్కార్ ప్రకటనతో ఉన్నతాధికారులు కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే జోనల్ సిస్టమ్ పై క్లారిటీ లేకపోవడంతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎలా ఇవ్వాలన్న దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారట. ఎలా వెళితే ఎక్కడ లీగల్ సమస్య వస్తుందోనన్న ఆందోళన వారిని వెంటాడుతుందని తెలుస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో గతంలో ఉన్న జోనల్ సిస్టమ్ ను పునర్ వ్యవస్థకరించింది. ఇందుకోసం రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ జరిగింది. కేసీఆర్ సర్కార్ సూచించిన కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి సవరణ ఉత్తర్వులు 2018 ఆగస్టులో వచ్చాయి. అయినా ఇప్పటికీ దాని ప్రకారం పోస్టుల పునర్ వ్యవస్థీకరణ జరగలేదు. కొత్త జోనల్ వ్యవస్థతో జిల్లాల సంఖ్య విషయంలోనూ చిక్కులు వస్తున్నాయి. రాష్ట్రపతి అమోదించిన కొత్త జోనల్ విధానం ఆమోదించినప్పుడు 31 జిల్లాలు ఉండగా.. తర్వాత మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. దీంతో కొత్తగా వచ్చిన రెండు జిల్లాలు ఏ జోన్లోకి వెళ్తాయన్నది స్పష్టత లేదు. గతంలో జరిగిన నియామకాలకు సంబంధించి లీగల్ సమస్యలు తలెత్తాయి. ఈసారి అలాంటి చిక్కులకు ఆస్కారం లేకుండా వీలైనంత త్వరగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారట. పాత జోనల్ వ్యవస్థ ప్రకారం పది పాత జిల్లాల ప్రాతిపదికన ఆయా పోస్టులకు స్థానిక రిజర్వేషన్ ఉంటుంది. కొత్త జోనల్ వ్యవస్థలో 31 జిల్లాలు ఉన్నందున స్థానిక రిజర్వేషన్ 95% ఉంటుంది. వికారాబాద్ జిల్లా ఏ జోన్ పరిధిలోకి వస్తుందనే వివాదం ఇంకా తేల లేదు. కొత్త జోనల్ సిస్టమ్ ప్రకారం ఏ జోన్ కింద ఎన్ని పోస్టులు ఉన్నాయో నిర్ధారించడానికి చాలా సమయం పడుతుంది. దీంతో ప్రస్తుతానికి పాత జోనల్ వ్యవస్థ ప్రాతిపదికనే భర్తీ ఉండొచ్చని తెలుస్తోంది. కొత్త జోనల్ వ్యవస్థ ఉనికిలోకి వచ్చినప్పటికీ ‘మూడేళ్ల గడువు’ అనే నిబంధనతో పాత జోనల్ వ్యవస్థనే అమలుచేసే వెసులుబాటు ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు. కొత్త జోనల్ సిస్టమ్ ఇంకా అమలులోకి రానందున.. ప్రస్తుతానికి పాత జోనల్ విధానంలో పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. టీఆర్టీ నిర్వహించాలంటే టెట్ కంపల్సరి. ఎస్సీఈఆర్టీ రూల్స్ ప్రకారం ప్రతి ఏటా రెండు సార్లు టెట్ నిర్వహించాలి, అయితే తెలంగాణ సర్కార్ ఏడాది ఒకసారి మాత్రమే టెట్ నిర్వహిస్తామని గతంలో జీవో ఇచ్చింది. కాని అది కూడా అమలు కాలేదు. 2016, 2017లో మాత్రం టెట్ నిర్వహించారు. గత మూడేండ్లుగా జరగలేదు. దీంతో గత మూడేళ్లలో బీఈడీ, టీటీడీ పూర్తి చేసిన వారు ... టీఆర్టీ రాయాలంటే టెట్ లో అర్హత సాధించాల్సిందే. కాబట్టి వారి కోసం టెట్ జరపాల్సిందే. అంతేకాదు టెట్ మార్కుల అర్హత పరిమితి ఏడేండ్లు. వరుసగా నిర్వహించకపోవడం వల్ల దాదాపు 5 లక్షల మంది టీచర్ ట్రైనింగ్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు టెట్ వాల్యూ కోల్పోయారు. దీంతో ఉపాధ్యాయ భర్తీలు చేపట్టాలంటే కచ్చితంగా నోటిఫికేషన్ వెలువడడానికి ముందే టెట్ ప్రకటన రావాల్సి ఉంటుంది. కాబట్టి త్వరలోనే టెట్ నోటిఫికేషన్ విడుదల రావొచ్చని, టెట్ పూర్తయ్యాకే టీఆర్టీ నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/tspsc-39-107916.html





